జన‘కోట’లో మార్మోగిన జగన్నినాదం!

సామర్లకోట :

నిత్యమూ పరుగులు తీస్తున్న రైళ్ళ రణగొణ ధ్వని జగన్నినాద ధ్వానం ముందు వెలవెలబోయింది. ప్రజల పట్ల మమతానురాగాలు నింపుకున్న మారాజు రాజన్న బిడ్డ పాదయాత్ర సందర్భంగా సామర్లకోట జనకోటగా రూపుదాల్చింది. ఒక వైపున కాంగ్రెస్‌, టిడిపిలపై శ్రీమతి షర్మిల సంధించే వాగ్బాణాలు.. మరో వైపున ఆకాశంలో సప్తవర్ణాలు విరజల్లిన బాణాసంచా మోతలతో సామర్లకోట పట్టణం మారుమోగిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాకంటక పాలన, చంద్రబాబు కుట్ర రాజకీయాలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఆదివానంపాడే 13వ రోజు పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల పరిధిలోని పల్లెల్లో హుషారుగా కొనసాగి సామర్లకోటలోకి ప్రవేశించింది.

శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగినంత దూరమూ దారులన్నీ మమతానురాగాలు పూసిన పూదోటలే అయ్యా యి. రోడ్లకు ఇరువైపులా పరవళ్లు తొక్కిన అభిమాన జనం జీవనదులను తలపించారు. అడుగడుగునా శ్రీమతి షర్మిలకు జనం నీరాజనాలు పలికారు. ఆమెకు హారతులిస్తూ, పూల వర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురం జగ్గయ్య చెరువు సమీపంలోని పొలంలో ఏర్పాటు చేసిన బస నుంచి ఉదయం ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర కుమారపురం, కొత్తకందరాడ, ఫకృద్దీన్‌పాలెం మీదుగా జల్లూరు వరకు కొనసాగింది.

కూలిపని చేస్తున్న విద్యార్థినిని చూసి చలించిన షర్మిల :
కొత్తకందరాడ సమీపంలో పొలంలో కూలీగా పనిచేస్తున్న బాలిక జల్లూరి గంగాభవానిని చూసి శ్రీమతి షర్మిల చలించిపోయారు. దగ్గరకు పిలిపించుకొని ‘చదువుకోవల్సిన వయస్సులో ఇలా పనికెందుకొచ్చావు?’ అంటూ లాలనగా అడిగారు. ‘మా అమ్మానాన్నలు చనిపోయారు. నాకొక అక్కాచెల్లి ఉన్నారు. నేను పిఠాపురం ఆర్ఆ‌ర్‌బిహెచ్ఆ‌ర్ కళాశాలలో ఇంట‌ర్ రెండవ సంవత్సరం చదువుతున్నాను. మా కుటుంబం గడవాలంటే ఖాళీగా ఉన్న సమయంలో  ఇలా పనికి రావాల్సిందే’ అని భవాని వివరించింది. ‘నీ చదువు కొనసాగించు..నీ కుటుంబాన్ని ఆదుకుంటాం’ అంటూ శ్రీమతి షర్మిల ఆమెకు భరోసానిచ్చారు.

ఫకృద్దీన్‌పాలెంలో మినప రైతులు శ్రీమతి షర్మిలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నకిలీ విత్తనాలు, పల్లాకు తెగులు వల్ల ఏటా నష్టపోతున్నామన్నారు. ‘త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది.. మీ కష్టాలన్నీ తీరతా’యంటూ శ్రీమతి షర్మిల వారికి ధైర్యం చెప్పారు. కుమారపురంలో అంబేద్కర్, ఫకృద్దీ‌న్‌పాలెంలో మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల‌ు వేసి శ్రీమతి షర్మిల నివాళులు అర్పించారు.

మధ్యాహ్నం జల్లూరు నుంచి కోదండరామపురం వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన శ్రీమతి షర్మిలకు ఆ నియోజకవర్గ‌ం పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర‌ రామారావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. విచిత్ర వేషధారణలు, తీన్మార్‌ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్పులు, మోటారు సైకిళ్ళ ర్యాలీలతో పాదయాత్ర పరిసరాలు హోరెత్తాయి. అక్కడి నుంచి సామర్లకోటలోని బసకు చేరుకునే వరకు వేలాదిగా జనం శ్రీమతి షర్మిల వెంట కదం తొక్కారు. కోదండరామపురం నుంచి బ్రౌన్‌పేట, తహశీల్దార్, మున్సిప‌ల్ కార్యాలయాల సెంటర్లు, గాంధీచౌ‌క్‌ల మీదుగా స్టేషన్‌సెంటర్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నడిచేందుకు గంటన్నరకు పైగా సమయం పట్టింది. బహిరంగసభ జరిగిన స్టేషన్‌సెంటర్ ‌సామర్లకోట చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన జనంతో వరద గోదారిని తలపించింది. ఇటు గాంధీచౌక్ నుంచి అటు ఫ్లై ఓవ‌ర్ వరకు జనమే జనం. సభ జరుగుతున్నంత సే‌పూ జనం వస్తూనే ఉన్నారు.

విశేష ప్రజా స్పందన :
శ్రీమతి షర్మిల ప్రసంగానికి ప్రజలు ఆద్యంతమూ అనూహ్యంగా స్పందించారు. జగన్నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్, ‌టిడిపిలను ఎండగడుతున్నంత సేపూ జనం కేరింతలు కొడుతూనే ఉన్నారు. అలాగే ‘బోనులో ఉన్నా సింహం సింహమే. అరచేతితో సూర్యుడిని అడ్డుకోలేరు. జగనన్నను ఏ శక్తీ ఆపలేదు’ అంటూ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నప్పుడు ‘జై జగన్’ నినాదాలతో సామర్లకోట పట్టణం మారుమోగిపోయింది. బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల పెద్దాపురం రోడ్డులోని మఠం సెంటర్ మీదుగా యూనియ‌న్ బ్యాంకు సమీపంలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి ఏడు‌ గంటల సమయంలో చేరుకోవడంతో ఆదివారం నాటి పాదయాత్ర షెడ్యూలు ముగిసింది.

Back to Top