రైతు కన్నీటితో బాబు అవినీతి సేద్యం

– పెట్టుబడిదారులకు అండగా భూసేకరణ
– గోదావరి ఆక్వా ఫుడ్‌ పనులు మళ్లీ ప్రారంభం 
– ప్రాజెక్టును తరలిస్తామని మాట తప్పిన సర్కారు 
– మహిళా దినోత్సవం రోజునే మహిళలపై లాఠీచార్జ్  

‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం’ బాగు పడిన చరిత్ర లేదు. బహుశా రాష్ట్రంలో కరువు తాండవించడానికి ప్రధాన కారణం చంద్రబాబు రైతులకు చేస్తున్న ద్రోహమేనేమో. పచ్చని పంట పొలాలను నాశనం చేసి వేలాది ఎకరాలను తన అనుచరులకు కట్టబెడుతున్నాడు. అధికారంలోకి వచ్చింది మొదలు భూదాహంతో రగిలిపోతున్నాడు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా తెలుగు తమ్ముళ్లు వదలడం లేదు. ఎక్కడ పచ్చని పైర్లు కనిపించినా బాబుకు నిద్ర పట్టడం లేదు. శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకు లక్షల ఎకరాలను అక్రమార్కులకు పలహారంగా పంచి పెడుతున్నాడు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు ఏమంటూ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడోగానీ ప్రతి జిల్లాలోనూ కరువు తాండవిస్తోంది. రైతులు పక్క రాష్ట్రాలకు వలస పోయి కూలీలుగా బతకాల్సిన గడ్డు రోజులు దాపురించాయి.  

గోదావరిని నాశనం చేస్తున్న ఆక్వాఫుడ్‌ ప్యాక్టరీ
చంద్రబాబు సర్కారు ఓ ప్రయివేటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి నేరుగా కొమ్ముకాసింది. వందలాది మంది పోలీసులను మోహరించి సుమారు నాలుగైదు గ్రామాల్లో రెండేళ్లుగా భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్, నరసాపురం మండలాల పరిధిలోని తుందుర్రు, జొన్నలగరువు, కంశాలి బేతపూడి గ్రామాల నడుమ గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణం జరుగుతోంది. అధికార పక్షానికి చెందిన కొందరు ప్రముఖులు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడంతో ప్రభుత్వం నేరుగా వారికి మద్దతు పలుకుతోంది. ఇప్పటికి ఈ ప్రాంతంలో ఆందోళన సాగిస్తున్న సుమారు 150 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి విలువైన యంత్ర, నిర్మాణ సామగ్రి తరలించాలని భావించిన యాజమాన్యం సామగ్రిని ఎవరూ అడ్డుకోకుండా పోలీసుల సహాయాన్ని కోరింది. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడితోపాటు చుట్టపక్కల ప్రాంతాల్లో  వందలాది మంది పోలీసులు మోహరించారు.  అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం మొదలైంది. స్థానికులు ఎవరైనా నిర్మాణ సామగ్రిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేస్తామని గ్రామాల్లో బెదిరింపులకు దిగారు.  

ప్రశ్నార్థకంగా ప్రజా జీవనం
తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగర్వు. ఇవి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం రూరల్‌ మండలంలోని చిన్న గ్రామాలు. ఆరు మాసాల క్రితం వరకూ ఈ గ్రామాల పేర్లు తెలిసింది కేవలం ఆప్రాంతం వారికే. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దానికి కారణం ఆ గ్రామాల మధ్య తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లే ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌ నిర్మాణం ప్రారంభించటంమే. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఆ ప్రాంతంలో 40 వేల ఎకరాల వరి, చేపల, రొయ్యల సాగు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో మత్స్య సంపదను అందిస్తూ మత్స్యకారులకు అన్నం పెడుతున్న, 30 గ్రామాల ప్రజలకు సాగు, తాగు నీటిని అందిస్తున్న గొంతేరు కాలువ కాలుష్య కాసారంగా తయారవుతుంది. ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల పూర్తిగా కలుషితమైన యనమదు్రరు  కాలువ ఉదాహరణగా పక్కనే కనబడుతోంది. నిర్మించబోయే ఆక్వా ఫుడ్‌ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్‌ టన్నుల కొద్దీ నిల్వ ఉండటం, ఊరు మధ్య పెద్దబాంబుని పెట్టుకుని జీవించడమే అవుతుంది. అందుకు రొయ్యల పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఈ నష్టాలు ఉన్నాయి కాబట్టే ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాల కోసం, తమ భవిష్యత్‌ కోసం రెండున్నరేళ్ళుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. చుట్టుపక్కల సుమారు 30 గ్రామాల ప్రజల మద్దతును కూడగట్టగలిగారు.

బాధితులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ 
గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా నిలిచింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. స్థానిక నాయకులు కూడా మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కూడా ఫ్యాక్టరీని జనావాసాల మధ్య నుంచి తొలగించాలని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. బతుకులను ప్రశ్నార్థకం చేసే ఇలాంటి ప్రాజెక్టులు జనావాసాలకు దూరంగా సముద్రానికి దగ్గరగా నిర్మించుకోవాలని హితవు పలికారు. అందుకు అనుగుణంగానే చేస్తామని బాధితులకు హామీ ఇచ్చిన పరిశ్రమ యాజమాన్యం మరోసారి స్థానికులను భయాందోళలనలకు గురి చేస్తూ పనులను ప్రారంభించింది. మహిళా దినోత్సవం రోజున ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలను ఈడ్చి పారేసింది. 

ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
పాలక తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా పెట్టుబడిదారులకు కొమ్ముకాయటం, ఫ్యాక్టరీ నిర్మాణానికి పోలీసులను కాపలాపెట్టడం, పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్ళలో నిర్బంధించడం, ఏమైనా కట్టించి తీరతామంటూ మొండిగా వ్యవహరించటం ఆ ప్రాంత ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న భీమవరం, నర్సాపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీనే 2014 ఎన్నికల్లో గెలిపించారు. ఉద్యమిస్తున్న గ్రామాల్లోనూ గతంలో తెలుగుదేశానికి బ్రహ్మరథం పట్టారు. కానీ, నేడు ప్రభుత్వం ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల, ప్రజా ఉద్యమాలు పట్ల ఎలా వ్యవహరిస్తుందో స్వయంగా గమనించిన ప్రజలు అదే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకులను ఆ గ్రామాల్లోనే నిలదీస్తున్నారు. మహిళలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక ఆ పార్టీ నాయకులు మొహం చాటేసుకుని పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

తాజా వీడియోలు

Back to Top