చంద్రబాబు తప్పుకో..!

గుంటూరుః ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లా నల్లపాడురోడ్డులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పశ్చిమ గోదావరి జిల్లా నిరుద్యోగ సంఘం బయలు దేరింది. వైఎస్ జగన్ కు మద్దతు పలికేందుకు విద్యార్థులు, యువత అంతా పెద్ద ఎత్తున దీక్షా ప్రాంగణానికి తరలివస్తున్నారు. ఈసందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుుపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన అంతా కూడా సింగపూర్ నుంచే నడుస్తోందని నిరుద్యోగుల సంఘం ఆరోపించింది. సామాన్య ప్రజల్లోకి రాకుండా సింగపూర్ లోనే తిరుగుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని వారు మండిపడ్డారు. చంద్రబాబు చూపిస్తున్నట్లుగా అమరావతి నగరాన్ని నిర్మించలేరని అవన్నీ గ్రాఫిక్స్లోనే సాధ్యమని చెప్పారు. మరోపక్క, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దీక్షకు బయలు దేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై సాధ్యం కాకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుకోవాలని, వైఎస్ జగన్ సాధిస్తారని అన్నారు.

ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యార్థులు బెంగళూరులో దయనీయ స్థితిలో ఉన్నారని, కేవలం ఆరువేల రూపాయలకు అవమానకర పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ పోవాలంటే కేవలం ప్రత్యేక హోదానే పరిష్కార మార్గం అని చెప్పారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వైఎస్ జగన్ ను అడ్డుకోవడం అంటే మొత్తం రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని అడ్డుకున్నట్లేనని అన్నారు. ప్రత్యేక హోదాతో తమకు కనీసం ప్రైవేటు ఉద్యోగాలయినా వస్తాయని చెప్పారు.
Back to Top