హైదరాబాద్ : చంద్రబాబు పాదయాత్ర టిడిపి క్యాడర్ పాలిట బాధయాత్రగా సాగుతోంది. అనంతపూర్ జిల్లాలో అక్టోబర్ 12 న సాగిన చంద్రబాబు 11 వ రోజు పాదయాత్ర నిస్తేజంగా సాగింది. బాబు ధోరణి పట్ల కార్యకర్తల్లో నిర్వేదాన్ని నిండింది. ఉరవకొండ మండలం నింబగళ్లులో బాబు బసచేసిన ఏసీ బస్సు చుట్టూ ఉదయం నుంచే 'దేశం' నేతలు, కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు వెయిటింగ్‌లో ఉన్నారు. గం. 10.45లకు బస్సు నుంచి దిగిన చంద్రబాబు ఎవరినీ పట్టించుకోకుండా యాత్రకు బయలుదేరారు. గంటల తరబడి వేచి ఉన్నా తమను కలుసుకోకుండా, తమను ఖాతరు చేయకుండా వెళ్లిపోవడంతో కార్యకర్తలు ఉస్సూరుమన్నారు. రెండు రోజులుగా కుడికాలు నొప్పితో బాధపడుతున్న బాబు శుక్రవారం రేణుమాకులపల్లికి చేరుకుని, జనం సమస్యలు చెప్పేదాకా రచ్చబండపై కుర్చీలో కూర్చొని విన్నారు. ప్రసంగం తర్వాత దిగి వెళ్లేటప్పుడు ఒక్కసారిగా తూలిపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పక్కనే ఉన్న వాహనంలో (ఇన్నోవా) ఆయనను పడుకోబెట్టారు. తర్వాత బస్సులోకి తరలించారు. ఫిజియోథెరపిస్టులు, వైద్యులు బాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. రచ్చబండపై నుంచి దిగుతున్న సమయంలో బాబుకు కాలుబెణికిందని భావిస్తున్నారు. అయితే కాస్సేపటి తర్వాత బాబు బస్సులో నుంచి బయటకు వచ్చి యథావిధిగా యాత్రను సాగించారు. అనారోగ్యంగా ఉండటంతో ఆయన సంచార జాతుల వారు ఏర్పాటు చేసిన సభకు వెళ్లలేకపోయారు. దీంతో వారు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు. దారిలో ముస్లింలు, చేనేతకార్మికులను కలిశారు. వారు చెప్పేది ఆలకించారు.
రేణుమాకులపల్లిలో రుణాలు మాఫీ చేయాలని ఒక రైతు బాబును డిమాండ్ చేశారు. దీనిపై ఆలోచిద్దాం అంటూ ఆయన దాట వేశారు. సమస్యలు చెప్పినప్పుడు హామీ ఇవ్వకుండా వెళ్లడంపై రైతులు నిస్పృహ చెందారు. అనంతరం ఉరవకొండ బహిరంగసభలో మాట్లాడారు. గురువారం నాటి పాదయాత్రకు జనం తక్కువగా హాజరు కావడంతో. శుక్రవారం వాహనాలలో జనాన్ని భారీగా తరలించారు. సీపీఐ రాష్ట్ర పార్టీ తరఫున ఆ పార్టీ నేత రామకృష్ణతో పాటు కార్యకర్తలు బాబుకు సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు. రాత్రికి గ్రేడ్ హొత్తూరు చేరుకుని బస చేశారు. బాబు శుక్రవారం 18.5 కిలోమీటర్లు నడిచారు. పదకొండో రోజుతో బాబు పాదయాత్ర 194.8కిలోమీటర్లకు చేరుకుంది.