అపహాస్యం పాలవుతున్న మద్యం కొత్త విధానం

హైదరాబాద్: కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చినా పాత పరిస్థితులు మారటం లేదు! రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ ఊర్లో చూసినా పాత దందానే!! మూడు నెలల కిందట ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని అమలు చేయకపోతే మద్యం షాపులపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తామనీ, మరోమారు పట్టుపడితే షాపును సీజ్ చేస్తామనీ చేసిన హెచ్చరికలు తాటాకు చప్పుళ్ళని తేలిపోయింది. రాష్ట్రమంతటా విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు(బెల్టు షాపులు) వెలిశాయి. ఇవి జిల్లాకు వెయ్యి నుంచి ఐదు వేల వరకూ ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా గ్రామాల్లో ఊరి పెద్దలే అనధికారికంగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. వీటికి లక్షల్లో వెచ్చిస్తున్నారు కూడా.  మద్యం సీసాపై ఉన్న గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ)కే విక్రయించాలన్న సర్కారు నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. సీసాలపై ఉన్న రేటుకన్నా పది నుంచి ఇరవై శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లూజు విక్రయాలకు లెక్కే లేదు. మద్యం దుకాణాల ముందే మందుబాబులు చుక్కేసుకుంటున్నారు. ఏ ఊర్లో ఏ కూడలిలో చూసినా ఈ దృశ్యం కనిపిస్తుంది. కొన్నిచోట్ల మందుబాబులకు అప్పు తాగించటం, ఆ తర్వాత అప్పుల వసూళ్ల కోసం దాడులు చేయటం జరుగుతోంది. గుడులు, బడులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదన్న నిబంధనను ఎక్కడా పాటించటం లేదు.
ఇలాంటి వాటిపై స్థానికులు ఆందోళనలు చేసినా, రోజుల తరబడి నిరాహార దీక్షలు చేసినా, కలెక్టర్లకు మొరపెట్టుకున్నా.. ఆ దుకాణాలను కదిలించలేకపోతున్నారు. అత్యధిక శాతం మద్యం దుకాణాలు బినామీ పేర్లతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి అనుచరుల ఆధీనంలోనే సాగుతున్నాయి. లెసైన్సుదారులకు తృణమో పణమో ఇచ్చి వారిని తప్పించటమో, వారినే ఉద్యోగులుగా పెట్టుకుని దుకాణాలను తమ ఆధీనంలోకి తీసుకోవటమో షరామామూలైపోయింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం గిరిజనుల పేరుతో మద్యం సిండికేట్లు దందా సాగిస్తున్నాయి. ఇక మద్యం సిండికేట్ల మధ్య గొడవలు అక్కడక్కడా హత్యలూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వివాదాల్లో ఏకంగా ఎక్సైజ్ అధికారులు జోక్యం చేసుకుని రాజీ చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తీసుకువచ్చి, వాటిపై లేబుళ్లు మార్చేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. చాలా జిల్లాల్లో నాటు సారా, గుడుంబా విక్రయాలూ విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలూ జరుగుతున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ ప్రారంభంలో అక్కడక్కడా ఒకటీ అరా కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు.. ఆ తర్వాత యథాప్రకారం మామూళ్లు దండుకుండా లిక్కర్ మాఫియాలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. మద్యం దుకాణాల తీరుతెన్నులు, నిబంధనల అమలుపై ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో ఈ విషయం తేటతెల్లమైంది.
అనంతపురం... పారుతున్న ‘పొరుగు’ మందు!
అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోదరుడు.. లాటరీలో ఏకంగా 42 దుకాణాలను సొంతం చేసుకున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యాన్ని జిల్లాకు దిగుమతి చేసుకుంటున్న మద్యం వ్యాపారులు.. బాటిళ్లపై లేబుళ్లు మార్చేసి విక్రయిస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ గుడి వద్ద బెల్ట్‌షాపు నిర్వహించేందుకు వేసిన అనధికారిక వేలంలో రూ. 16 లక్షలకు పైగా పాట పాడి బెల్ట్‌షాపును దక్కించుకున్న ఓ వ్యక్తి యథేచ్ఛగా మద్యాన్ని విక్రయిస్తున్నారు.
పశ్చిమగోదావరి... 24/7 మద్యం ప్రవాహం!
పశ్చిమగోదావరి జిల్లాలో లెసైన్సుదారుల పేర్లు బోర్డులకే పరిమితం అయ్యాయి. వాటాదారుల ముసుగులో బినామీలే షాపులు నిర్వహిస్తున్నారు. మెయిన్ షాపులను మూసి పక్క కౌంటర్ ద్వారా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో 453 మద్యం దుకాణాలు ఉండగా వాటికి ఐదు రెట్లు బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. మెయిన్ షాపుల్లో నిబ్‌కు రూ. 5 నుంచి రూ. 10 చొప్పున, బెల్టుషాపుల్లో రూ. 10 నుంచి రూ. 20 చొప్పున ఎంఆర్‌పీకన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా లూజు విక్రయాలు, సిట్టింగ్ రూమ్‌లకు ఏసీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల భీమవరం గునుపూడి, రెస్ట్‌హౌస్ రోడ్డు, పెదపేట ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. రెస్ట్‌హౌస్ శివారున షాపు మార్చాలని స్థానిక మహిళలు సుమారు 15 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేసి చివరకు విరమించుకున్నారు.
వరంగల్... నాయకుల ‘టేకోవర్’!
వరంగల్ జిల్లాలో 227 షాపులను కేటాయించారు. హన్మకొండలోని నయీంనగర్‌లో వైన్‌షాపును దక్కించుకున్న వ్యక్తిని బెదిరించి ఓ కాంగ్రెస్ నేత టేకోవర్ చేశాడు. మరో కాంగ్రెస్ నేత ఫాతిమానగర్ వద్ద మరో షాపును ఇదే పద్ధతిలో కైవసం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ టీఆర్‌ఎస్ నేత శివనగర్, రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద ఈ తరహాలోనే షాపును నిర్వహిస్తున్నాడు. ఎంఆర్‌పీ, సిట్టింగ్ రూములు, బెల్టు షాపుల విషయంలో నిబంధనలు సక్రమంగా అమలు కావటం లేదు. మానుకోట మండలంలో గుడుంబా ఏరులై పారుతోంది.
రంగారెడ్డి... ఎంఆర్‌పీపై ముసుగేశారు!
రంగారెడ్డి జిల్లాలో మద్యం డీలర్లు ఎంఆర్‌పీ ధరకంటే రూ. 10 నుంచి రూ. 20 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఎంఆర్‌పీ కనిపించకుండా స్టిక్కర్‌వేస్తున్నారు. యాచారం మండల కేంద్రంలోని ఓ వైన్స్‌ను హైదరాబాద్ నగరానికి చెందిన డీలరు దక్కించుకోగా ఈ దుకాణాన్ని ప్రస్తుతం ఇతరులు కొనసాగిస్తున్నారు. మాల్ గ్రామంలోని మరో మద్యం దుకాణాన్ని ఇదే తరహాలో బినామీలే నిర్వహిస్తున్నారు. శంషాబాద్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట మండలాల్లో బినామీలు తమ హవా కొనసాగిస్తున్నారు. జిల్లాలో దాదాపు నాలుగున్నర వేలకు పైగా బెల్ట్ దుకాణాలు కొనసాగుతున్నట్లు అధికారులే చెప్తున్నారు.
ఖమ్మం... గిరిజనుల పేరుతో నేతల దందా!
ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని 78 మద్యం దుకాణాలను గిరిజనుల పేరుతో మాజీ మద్యం వ్యాపారులు, కాంగ్రెస్, టీడీపీల అనుచరులే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లాటరీల ద్వారా వచ్చిన లెసైన్స్‌దారుడికి లక్షల్లో సొమ్ము అప్పగించి వాటి నిర్వహణ గతంలోని వైన్‌షాపు నిర్వాహకులే చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేలకు పైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో ఎంఆర్‌పీకన్నా 20 శాతం ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో రూ.1.80 లక్షలకు వేలంపాట నిర్వహించి మరీ బెల్టుషాపును నడుపుతున్నారు. కొత్తగూడెం మండలంలోని రాఘవాపురం, పాలేరు నియోజకవర్గం చెరువు మాదారం, ఖమ్మం నియోజకవర్గం రమణగుట్ట ప్రాంతాలలో నీటిఎద్దడి తీవ్రంగా ఉంది. కానీ మద్యం మాత్రం విచ్చల విడిగా దొరుకుతోంది.
గుంటూరు... బార్లలో నిలువు దోపిడీ!
గుంటూరు జిల్లాలో ఎంఆర్‌పీ ఉల్లంఘనలు, లూజు విక్రయాలు, బెల్టుషాపుల దందా మళ్లీ జోరందుకుంది. బారుల్లో సగటున ఫుల్‌బాటిల్‌కు రూ. 130 నుంచి రూ.200 అధిక ధర, వైన్‌షాపుల్లో రూ. 50 నుంచి రూ. 90 వరకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. వైన్‌షాపుల్లో లూజు విక్రయాలు సర్వ సాధారణంగా సాగుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు జిల్లాలో లిక్కర్ వ్యాపారులుగా హవా సాగిస్తున్నారు. కొత్తగా లెసైన్సులు తీసుకున్నవారికి పాత లిక్కర్ వ్యాపారులకు అనధికారికంగా వాటాలిచ్చి తమ కనుసన్నల్లో సాగిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ, కార్మికశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలకు నెలకు సగటున రూ. 25 లక్షల వరకు ముడుపులు అందుతున్నట్లు అంచనా. జిల్లాలో వెయ్యికి పైగా బెల్టుషాపులున్నాయి.
శ్రీకాకుళం... అధికారికంగా అధిక ధరలు!
శ్రీకాకుళం జిల్లాలో బెల్ట్‌షాపుల్లో రూ. 15 వరకూ అధిక ధరలకు విక్రయిస్తుండగా గ్రామ, మండల కేంద్రాల్లోని మద్యం దుకాణాల్లో రూ. 5 నుంచి 10 వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఈ మేరకు పెంచి అమ్ముకోవచ్చన్న ‘ప్రభుత్వ ఉత్తర్వులను’ వీరు చూపిస్తున్నారు. కొన్ని షాపులను లెసైన్స్‌దారుల నుంచి సిండికేట్ నిర్వాహకులు కొనుగోలు చేసినా లెసైన్స్ పొందిన వారితోనే నిర్వహింపజేస్తూ వారికి నెలనెలా జీతాన్ని ఇస్తున్నారు. ఇచ్ఛాపురంలోని సత్యనారాయణస్వామి, ముత్యాలమ్మ ఆలయాలతో పాటు టెక్కలిలో అమ్మవారి ఆలయానికి పక్కనే మద్యం షాపులు నిర్వహిస్తున్నారు.
కర్నూలు... అన్ని పార్టీలకూ వాటా!
కర్నూలు జిల్లాలో వ్యాపారులు సిండికేట్‌గా మారి హవా నడిపిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రముఖుల అనుచరులే దుకాణాలను నిర్వహిస్తున్నారు. కోడుమూరులో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు హర్షవర్ధన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు మద్యం దుకాణాలను కొనసాగిస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నీరజారెడ్డి అనుచరులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరుతో పాటు కర్నూలులో సగభాగం, ఎమ్మిగనూరులో ఇతరుల భాగస్వామ్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. కోడుమూరు, ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు బెల్టు షాపుల నిర్వాహకులతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు అడ్వాన్స్ వసూలు చేసుకుని మద్యం సరఫరా చేస్తూ విక్రయాలు చేపడుతున్నారు.
నల్లగొండ... బెల్టుషాపులకూ వేలం పాటలు!
నల్లగొండ జిల్లాలోని ఒక్కో మండలంలో వంద దాకా బెల్టుషాపులున్నాయి. జాతీయ రహదారి వెంట మద్యం దాబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మునుగోడులో కస్తూరిబా గాంధీ విద్యాలయానికి 70 గజాల దూరంలోనే మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దేవరకొండలో బస్టాండ్ ఎదురు సందులో ఒక స్కూల్ పక్కనే వైన్స్ ఏర్పాటు చేశారు. పెద్దవూర మండలంలో బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయాల వివాదంతో జూన్ నెలలో కర్నాటి మణిరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో స్థానిక రాజకీయ నాయకులను వాటాదారులుగా చేర్చుకొని దుకాణాలను నడుపుతున్నారు.

Back to Top