మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రులు 

ఉద్యోగుల మేలుకే ప్రభుత్వ ప్రాధాన్యం

ఆందోళనలు, సమ్మె ప్రతిపాదనలు విరమించాలి

నూతన పీఆర్సీతో జీతం పెరిగిందే తప్ప తగ్గలేదు

ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక ముఖ్య భాగం

చర్చలకు మంత్రుల కమిటీ సదా సిద్ధం

ఉద్యోగులు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి

అమరావతి : ఉద్యోగుల మేలుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పలువురు మంత్రులు తెలిపారు. అందువల్ల ఉద్యోగులు ఆందోళనలు, సమ్మెలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఆందోళనలు చేయడం సరికాదన్నారు. సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ముఖ్య భాగమన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలపై గురువారం పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎవరు ఏమన్నారంటే..

బాబు ఏనాడైనా ఉద్యోగులకు మేలు చేశారా?
ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులు. ఉద్యోగులు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ కోరుతోంది. సీఎం జగన్‌ ఉద్యోగులందరినీ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఉద్యోగులకు మేలు చేశారా? ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే పప్పుబెల్లాల్లా పంచుతున్నారంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. 
–  కె.నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి
 

చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం
చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వం చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్ధం. ఉద్యోగులతో చర్చల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎక్కడా ఉద్యోగులను గృహనిర్బంధంలోకి తీసుకోలేదు. అయితే అనుమతి లేని సభలకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పాం.
– మేకతోటి సుచరిత, హోం శాఖ మంత్రి

మొండి వైఖరితో ఉన్నామనడం సరికాదు..
మేము మొండి వైఖరితో ఉన్నామని ఉద్యోగులు విమర్శించడం సరికాదు. కొత్త జీతాలు ప్రాసెస్‌ చేశాక వాటిని ఆపాలని చెప్పడం భావ్యం కాదు. ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం, పోలీస్‌ వ్యవస్థ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఆయన ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను ఏం ఉద్ధరించారు? ఒక్కసారి గుర్తు చేసుకోండి.
–  బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

విద్యుత్‌ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చాం..
చర్చల ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. నూతన పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. విద్యుత్‌ రంగం అప్పుల్లో ఉన్నా ఆ సంస్థల ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చాం. ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ఉద్యోగులకు మేలు చేస్తుంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది.
– బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ, ఇంధన శాఖ మంత్రి 
 

రోడ్డెక్కితే సమస్య పరిష్కారం కాదు..
ఉద్యోగులు పీఆర్సీని సమస్యగా భావిస్తున్నారు కాబట్టి వారి సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల మంత్రుల కమిటీ వద్దకు ఉద్యోగులు చర్చలకు రావాలి. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కావాలనే కొందరు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలా జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులను వెంటాడి వేధించేది కాదు.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
 

ఉద్యోగుల్లో ఎవరికీ అన్యాయం జరగదు..
ఉద్యోగులకు మేలు చేసే సీఎం జగన్‌ మనకు ఉన్నారు. మీరంతా మా కుటుంబ సభ్యులు. ఎవరికీ అన్యాయం జరగదు. 2008, 2018 నాటి డీఎస్సీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి వైఎస్‌ జగన్‌ ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ సమస్య ఉన్నా మంత్రుల కమిటీతో చర్చించండి. 
– ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి

ఉద్యోగులు పట్టుదలకు పోవద్దు..
ఉద్యోగులు పట్టుదలకు పోవద్దు. ప్రభుత్వం అన్ని వర్గాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో అన్ని వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ప్రభుత్వమే ఉద్యోగులకు మరింతగా మేలు చేస్తుంది. ఉద్యోగులంతా మా ప్రభుత్వంలో కుటుంబ సభ్యులే.
– పి.విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

ఉద్యోగులంటే సీఎంకు ప్రత్యేకమైన అభిమానం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలున్నాయని భావిస్తే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల వారు నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో అర్థం లేదు. ఉద్యోగుల పక్షపాతి.. సీఎం వైఎస్‌ జగన్‌. ఉద్యోగులంటే సీఎంకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను నానా బాధలకు గురి చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారు.
– అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి

ఉద్యోగులు ఆందోళనకు దిగడం మంచిది కాదు 
నూతన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగడం మంచిది కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. మొండిపట్టు పట్టడం తగదు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది.
– గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి

Back to Top