'అన్నా! ఎంత దిగుబడి వస్తోంది?'ధర్మవరం 27 అక్టోబర్ 2012 : షర్మిల తన పాదయాత్రలో రైతులను ప్రత్యేకంగా పలకరిస్తున్నారు. ముమ్మూర్తులా తండ్రిలాగే వ్యవసాయం పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. రైతుల బాగోగులు అడుగుతున్నారు. ఏమేం పంటలు వేశారు? దిగుబడి ఎంత వస్తోంది? లాభం వచ్చిందా? వంటి ప్రశ్నలు వేస్తూ వ్యవసాయరంగం పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటిగా ఎందుకు ఉండడం లేదో అధ్యయనం చేస్తున్నారు.
శుక్రవారం అనంతపురం జిల్లా తుమ్మల క్రాస్ నుంచి ధర్మవరం పట్టణానికి బయలుదేరిన షర్మిల దారిలో వేరుశనగ పొలంలో పని చేసుకుంటున్నమల్లేనిపల్లికి చెందిన రైతు కురుబ వెంకటేశును పలకరించారు. చేనులోకి ఎవరూ వెళ్లొద్దని అందరికీ షర్మిల జాగ్రత్తలు సూచించారు. (మొన్నీమధ్య చంద్రబాబు పాదయాత్ర వల్ల పొలం పాడైన ఉదంతం దృష్య్టా షర్మిల ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.) రైతుతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. "అన్నా ఎన్ని ఎకరాల్లో వేరుశనగ వేశావు? ఎంత ఖర్చయింది? ఎంత దిగుబడి వచ్చింది?" అని అడిగారు.
దీనికి జవాబిస్తూ రైతు "అమ్మా మూడెకరాల్లో వేరుశనగ వేశా. రూ.30 వేల పెట్టుబడి పెట్టా. ఐదు బస్తాల దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.పది వేలు కూడా రావు. మొత్తమ్మీద రూ.20 వేల నష్టం వచ్చింది" అంటూ వివరించారు. 'అన్నా.. ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇచ్చిందా? ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిందా?' అని షర్మిల అడిగారు."అమ్మా!రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఏటా అప్పులు చేసి పంట సాగు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెంచి, వ్యాపారులకు, దళారులకు లాభం చేస్తోంది. రైతులను నాశనం చేస్తోంది" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల  "అన్నా! అధైర్యపడొద్దు, ఈ కష్టాలు కొన్ని రోజులే. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అవుతారు. రాజన్నలాగే రైతుల కోసం పనిచేస్తారు. అందరికీ మేలు చేస్తారు" అంటూ ధైర్యం చెప్పారు.

Back to Top