'అనంత'లో అభిమాన వర్షం

మద్దికెర:

అనంతపురం జిల్లా ప్రజలు మహానేత తనయ వైయస్ షర్మిలపై అనంతమైన అభిమానాన్ని కురిపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆమె వెంట సాగారు. వ్యవసాయ కూలీలు ఎదురైన చోట్ల ఆమె ఆగి మరీ మాట్లాడారు. ఓ చోట తాము తెచ్చుకున్న డబ్బానుంచి పప్పు అన్నం కలిసి షర్మిలకు తినిపించారు. ఆమె వారిచ్చిన దానిని ఆనందంగా తిన్నారు. తమకు కరెంటు రావడంలేదనీ, ఒక్క బల్బుకే రూ. 200 బిల్లు వస్తోందనీ వాపోయారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
షర్మిల: ఏమ్మా బాగున్నారా? కూలి పనికొచ్చారా?
మహిళ: బతకడమే కష్టమైంది. తండ్రి(వైయస్‌ను ఉద్దేశించి) ఉన్నట్టుండి వెళ్లిపోయాడు. మాకు సాయం చేసేవారే లేరు.
షర్మిల: కరువుపని దొరుకుతోందా అమ్మా..
మహిళ: పని దొరకడం లేదమ్మా..
షర్మిల: బియ్యం సరిగ్గా ఇస్తున్నారా?
మహిళ: ఆ.. 8 శేర్లు ఇస్తున్నారు.
మరో మహిళ: వాళ్లిచ్చే బియ్యం చాలడం లేదు. మేం మళ్లా అవ్వే బియ్యం బయట కిలో రూ. 12, రూ.15కు కొంటున్నాం.
షర్మిల: కరెంటు పరిస్థితి ఎట్లా ఉందమ్మా..
మహిళ: మాకు కరెంటు బిల్లు రూ. 200 నుంచి రూ. 250 వస్తోంది. కరెంటు రెండు గంటలే ఉంటుంది.
మరో మహిళ: ఒక్కటే బల్బుంది మాకు. కానీ రూ. 200 బిల్లు వస్తోంది.
షర్మిల: అవును.. ఇంకా వీళ్లేదో కరెంటు బాగా ఇస్తున్నట్టు బిల్లులొకటి మళ్లీ..
మహిళ: బిల్లు కట్టకపోతే కనెక్షన్ తీసేస్తారట.
షర్మిల: చంద్రబాబు ఉన్నప్పుడు ఇట్లాగే వేధిస్తే 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జగనన్న సీఎం అయ్యాక మీ కష్టాలు తీరుస్తాడు.

ఇడుపులపాయ నుంచి కర్నూలు సరిహద్దు వరకు..
     అక్టోబర్ 18న ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి సమాధి చెంతన ప్రారంభమైన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఇప్పటికి ఐదున్నర రోజుల పాటు వైయస్ఆర్ జిల్లాలో, 16 రోజుల పాటు అనంతపురం జిల్లాలో సాగింది. వైయస్ఆర్ జిల్లాలో 82.5 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 194.5 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు. గురువారం 22వ రోజు అనంతపురం జిల్లాలో 8.2 కి.మీ. నడిచిన షర్మిల సాయంత్రం నుంచి కర్నూలు జిల్లాలో 4.3 కి.మీ. పాదయాత్ర చేశారు. 22వ రోజు మొత్తం 12.5 కి.మీ. సాగింది. మొత్తంగా ఇప్పటివరకు 281.30 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

తాజా వీడియోలు

Back to Top