అలుపెరగని ఆడబిడ్డ!

నల్గొండ : నాగార్జుసాగర్ ఆయకట్టు ప్రాంతం‌ శుక్రవారంనాడు జలాలతోనే కాదు జనంతో హోరెత్తింది. అలుపెరుగకుండా, అప్రతిహతంగా పాదయాత్ర కొనసాగిస్తున్న మహానేత రాజన్న బిడ్డ వెంట జనాభిమానం తరంగమై నడిచి వచ్చింది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఏడవ రోజున నల్గొండ జిల్లా హాలియా, నిడమనూరు మండలాల్లో అప్రతిహతంగా కొనసాగింది. గ్రామీణ మహిళలు శ్రీమతి షర్మిలకు ఎదురొచ్చి మంగళ హారతులిచ్చి అఖంగా స్వాగతం పలికారు. మహానేత రాజన్న బిడ్డ.. ప్రజల కష్టాలు వింటూ వారికి ధైర్యం ఇస్తూ ముందుకు సాగారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారంనాడు హాలియా మండలం అలీనగర్ శివారు నుంచి ‌ప్రారంభమైంది. నిడమనూరు మండలం ముకుందాపురం సరిహద్దు వరకూ కొనసాగింది. నిడమనూరు, ముకుందాపురంలో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, స్థానికులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముకుందాపురంలో రచ్చబండ కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో కదిలిరావడంతో శ్రీమతి షర్మిల వాహనం ఎక్కి ప్రసంగించాల్సి వచ్చింది. అలీనగర్, వెంకటేశ్వ‌రనగర్, నిడమనూరు, ‌బి.కె. తండా, బొక్కముంతలపాడు, ముకుందాపురంలో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి తమ అభిమాన జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిలకు హార్దికంగా స్వాగతం పలికారు.

నిడమనూరులో పలువురు మహిళలు శ్రీమతి షర్మిలకు మంగళహారతులతో ఎదురొచ్చారు. నిడమనూరు, ముకుందాపురంలలో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలు తమ సమస్యలను ఆమె ముందు ఏకరువు పెట్టారు. పలువురు మహిళలు జగనన్న ఎప్పుడు బయటకు వస్తాడని అడిగారు. జగనన్న వస్తేనే తమ సమస్యలు తీరతాయని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమభావన సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని మహిళలు వాపోయారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ... రాష్ట్రంలో దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. ‘డిగ్రీ పూర్తి చేశాను. ఫీజు రీయింబర్సుమెంట్ లేక కాలేజీ ఫీజులు కట్టలేకపోయాను. మా అమ్మ బర్రెను అమ్మి కాలేజీ ఫీజు కట్టింది. రాజీ‌వ్ యువ‌ కిరణాలు పథకం ద్వారా యువకులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఎవరికిచ్చారు ఉద్యోగాలు’ అని నిడమనూరులో‌ ఓ యువకుడు పగిడిమర్రి అనిల్ శ్రీమతి షర్మిల దగ్గర వాపోయాడు. స్పందించిన శ్రీమతి షర్మిల రాజీవ్ యువ‌ కిరణాలు అంతా ఉత్తి బూటకం.. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా పరిశ్రమలకు అస్తవ్యస్తంగా విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోయి పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర దారి పొడవునా శ్రీమతి షర్మిల తనకు ఎదురు వచ్చిన మహిళలను అప్యాయంగా పలకరిస్తూ, వారు చెప్పిన సమస్యలను వింటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు నడక సాగించారు. దారి పొడవునా పలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన జనంతో రహదారి కిటకిటలాడింది. జగనన్న త్వరలో బయటకు వచ్చి రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు.

Back to Top