పండుగలైనా పుట్టిన రోజులైనా పాదయాత్రలోనే వేడుకలన్నీ ప్రజా సంకల్పంలోనే




పండుగ ఎప్పుడొస్తుంది. ప్రేమించే కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు. పండగ ఎప్పుడౌతుంది. ఊరు, వాడా అంతా ఒక్కటై వేడుక చేసుకున్నప్పుడు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర అడుగడుగునా పండుగనే తలపిస్తోంది. ఎన్ని కష్టాలున్నా, కన్నీళ్లున్నా కుటుంబమంతా కలిస్తే ఎంతటి ఆనందం వెల్లివిరుస్తుందో...యువనేత ఒక్కో గ్రామంలో అడుగు పెడుతున్నప్పుడు అలాంటి సంబరమే ఎదురొస్తోంది. తోరణాలతో, పూల బాటలతో, మేళ తాళాలతో, జగన్నినాదాలతో అడుగడుగూ ఓ సందడిలా సాగుతోంది ప్రజా సంకల్పం. ఎన్ని బాధలున్నా ఆ జననేత ముందుకొచ్చి చెప్పుకుంటే చాలు, తీరిపోతాయన్న నమ్మకమే ఆ ఆనందానికి పునాది.
వైయస్ఆర్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎపి ప్రతిపక్షనేత వైయస్ జగన్ పాదయాత్ర మొదలై నేటితో 74రోజులు అయ్యింది. ఇడుపుల పాయలో మహానేత పాదాలకు మొక్కి మొదలైన ప్రజాసంకల్పం 1000కి.మీ దాటింది. ఈ దారిలో ఎన్నో జ్ఞాపకాలు విచ్చుకున్నాయి. ఎన్నో సంఘటనలు హృదయాన్ని హత్తుకున్నాయి. ఎందరి ఆశీర్వచనాలో యువనేతపై ప్రేమగా వర్షించాయి. ఆ ప్రజల మధ్యే పండుగలు, వేడుకలు ఘనంగా జరిగాయి.

అనంతపురంలో క్రిస్మస్ వేడుకలు

అనంతపురం జిల్లా గాండ్ల పెంట్ల సమీపంలో విశ్రాంతి శిబిరంలోనే పాదయాత్రకు విరమం ప్రకటించి క్రిస్మస్ వేడుకలు అక్కడే జరుపుకున్నారు వైయస్ జగన్. పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజల మధ్యనే ఈ వేడుకలు జరగాలని కోరుకున్నారు. అందుకోసం వైయస్ కుటుంబ సభ్యులే పాదయాత్ర శిబిరానికి వచ్చి క్రిస్మిస్ సంబరాల్లో పాల్గొన్నారు. నా కుటుంబం కంటే నాన్నగారు అందించిన ఇంత పెద్ద కుటుంబంతో కలసి పండుగ చేసుకోవడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు  జగన్. ప్రజలతో మమేకమై ఉండే జన నాయకుడి లక్షణం అది.

జనంతోనే జన్మదిన వేడుకలు

1972, డిసెంబర్ 21న కడప జిల్లాలో పుట్టారు జగన్ మోహన్ రెడ్డి. ఈ ఏడాది పుట్టిన రోజున ఆయన 44వ పడిలోకి అడుగు పెట్టారు. యువనేతగా, జన హృదయ నేతగా, మహానేత వారుసుడిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ జగన్  తన జన్మదిన వేడుకలను ప్రజా సమక్షంలో, పాదయాత్రలోనే జరుపుకున్నారు. కార్యకర్తలు స్థానిక నేతలు జగన్ ను కలిసి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. శిబిరం దగ్గరకు వచ్చిన ప్రజలు సైతం నిండు నూరేళ్లు చల్లగా ఉండమని దీవించారు. పాదయాత్ర ఏ ఆటంకం లేకుండా సాగాలని, ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ స్వర్ణయుగాన్ని తిరిగి తేవాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, సేవాకార్యక్రమాలు విరివిగా జరిగాయి. విదేశాల్లో సైతం యువనేత అభిమానులు ర్యాలీలు, సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు

ముఖ్యమంత్రి ఊళ్లో ప్రతిపక్షనేత సంక్రాంతి వేడుకలు

ఈ ఏడాది సంక్రాంతికో మరో కొత్త సందర్భం ఎదురైంది. ముఖ్యమంత్రి ఊరు చంద్రగిరి నియోజక వర్గంలోని నారావారి పల్లె. సంక్రాంతికి అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రతిపక్షనేత ఇద్దరూ చంద్రగిరిలో ఉండటం ఓ విశేషం. నారావారి పల్లెలో ముఖ్యమంత్రి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటే, ఇటు ప్రతిపక్షనేత రామచంద్రాపురంలో బసచేసి సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. పంచకట్టుతో ఆకట్టుకున్నారు. అటు కుటుంబసభ్యులు, ఇటు వైసిపినేతలు, ప్రజల మధ్య యువనేత సంక్రాంతి పండుగ వేడుకగా సాగింది.

జాతీయ పండుగకు జన అభివాదం

రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే ప్రతిపక్షనేత ప్రజా సంకల్పానికి పూనుకోవడానికి ప్రధాన కారణం. పాదయాత్రలో నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగుటూరులో గణతంత్రవేడుకల్లో పాల్గొన్నారు ప్రతిపక్షనేత. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేసారు. ఇక దావోస్ లో హడావిడి చేస్తున్న చంద్రబాబు ఆలస్యంగా రావడంతో గణతంత్ర వేడుకల్లో పాల్గొననేలేదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండీ, రాజ్యాంగాన్ని, చట్టాన్ని లెక్కచేయకుండా, గణతంత్రి దినోత్సవానికి  గైర్హాజరవ్వడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, బహుసా దేశ చరిత్రలోనూ ఇదే ప్రధమం కావచ్చు.

Back to Top