అధికార, విపక్షాలపై షర్మిల నిప్పులు

రాగులపాడు:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల పందతొమ్మిదో రోజున తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అధికార, విపక్షాలపై నిప్పులు కురిపించారు. రాగులపాడు సమీపంలో హంద్రీ-నీవా కాలువను ఆమె పరిశీలించినపుడు రైతులు తమ కష్టాలను మొరపెట్టుకున్నారు.. ‘అమ్మా.. ఇదిగో ఇప్పుడు నీళ్లు ఇస్తాం.. అప్పుడు నీళ్లు ఇస్తాం.. అంటూ రఘువీరారెడ్డి ముహూర్తాల మీద ముహూర్తాలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నారు. వైఎస్ చనిపోయాక హంద్రీ-నీవా పనులు పూర్తిగా మందగించాయి’ అంటూ షర్మిలకు   ఫిర్యాదు చేశారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతోనే దివంగత సీఎం వైఎస్  హంద్రీ-నీవా పథకాన్ని చేపట్టారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు.. నాలుగు వందల గ్రామాలకు తాగు నీరు ఇవ్వాలని భావించారు. తొలి దశలో 95 శాతం పనులు వైయస్ పూర్తి చేశారు. మిగిలిన ఐదు శాతం పనులు చేయడానికి ఈ ప్రభుత్వం మూడేళ్లుగా ఆపసోపాలు పడుతోంది. హంద్రీ-నీవా, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఒక్కటే అన్న విషయం కూడా తెలియని మంత్రులు కిరణ్ కేబినెట్లో ఉండటం మన దౌర్భాగ్యం. చంద్రబాబు శిలాఫలకాలకు పరిమితమైతే.. రోశ య్య, కిరణ్‌లు ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టడానికి పరిమితమయ్యారు’ అం టూ విమర్శించారు.

అన్నం దుర్వాసన
    ఆ తర్వాత రాగులపాడు క్రాస్‌లోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించిన షర్మిల విద్యార్థులతో మమైకమయ్యారు. వంట గదిలోకి వెళ్లి భోజనం, కూరలను పరిశీలించారు. అన్నం రుచి చూసిన షర్మిల దుర్వాసన వస్తోందని చెప్పా రు. ఆ తర్వాత విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘అక్కా.. మాకు సమయానికి పుస్తకాలు అందించడం లేదు. నెలనెలా కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం అందించడం లేదు. క్రీడా సౌకర్యాలు లేవు. ట్యూటర్ లేడు. విద్యుత్తు కోతలతో ఇబ్బందులు పడుతున్నాం. భోజనం దుర్వాసన వస్తోంది. గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పి మెనూ తగ్గించారు. రెండు లీటర్ల పెరుగులోకి రెండు బిందెల నీళ్లు పోసి నీళ్ల మజ్జిగ అందిస్తున్నారు. హాస్టల్‌లో తాగడానికి నీళ్లు కూడా లేవు’ అంటూ షర్మిల ముందు విలపించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘వైయస్ ఉన్నప్పుడు అన్ని సక్రమంగా వచ్చేవా’ అని ఆరా తీశారు. ‘అక్కా... వైయస్ ఉన్నప్పుడు మాకు అన్నీ వేళకు సమకూరేవి’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘కొద్ది రోజులు ఓపిక పట్టండి.. జగనన్న సీఎం అవుతారు.. మీకు వైయస్ హయాంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో అలాంటి సదుపాయాలనే కల్పిస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు.

రాగులపాడులో జన నీరాజనం

     ఆ తర్వాత రాగులపాడుకు చేరుకున్న షర్మిలకు జనం నీరాజనాలు పలికా రు. రాగులపాడు బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ అధికార, విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. ప్రజాసమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్నపై అక్ర మ కేసులు బనాయించాయని ఆరోపించారు. ‘జగనన్నను ఆశీర్వదించండి.. అప్పుడు రాజ న్న రాజ్యం వస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది’ అంటూ ప్రజల కు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత రాగులపాడు శివారులో రాత్రి 7.40 గంటలకు పాదయాత్ర ను ముగించి, రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం 12.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.

Back to Top