శ్రీను.. కొత్త డ్రామా


మూడోరోజూ సహకరించని నిందితుడు      

మరోవైపు మధ్యాహ్నం కొత్త నాట‌కం మొదలు

ఛాతీ, ఎడమ చెయ్యి నొప్పెడుతున్నాయని సీన్‌ 

వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలింపు

పరీక్షల అనంతరం శ్రీనివాస్‌కు ఏ సమస్యా లేదని తేల్చిన వైద్యులు

అస్వస్థత పేరుతో నిందితుడి వాయిస్‌ వినిపించే ప్లాన్‌ అని అనుమానాలు

అందుకు తగినట్లే అరుపులు కేకలతో రక్తి కట్టించిన శ్రీనివాస్‌

 విశాఖపట్నం: ఘటన జరిగి ఆరురోజులైంది. నిందితుడు కస్టడీ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఆర్థిక లావాదేవీలు.. వాడిన సెల్‌ఫోన్ల సేకరణ.. కాల్‌ డేటా విశ్లేషణంటూ సగం పుణ్యకాలం గడిచిపోయింది. తొలిరోజు ఏ సమాధానాలైతే చెప్పాడో కస్టడీలో మూడో రోజు కూడా అదే సమాధానాలు నిందితుడి నోటి వెంట వస్తుండడంతో విచారణాధికారులు విస్తుపోతున్నారు. ఓ వైపు కస్టడీ గడువు తరుముకొస్తున్నా..ఈ ఘటనకు వెనుక ఉన్న కుట్రకోణాన్ని మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం బయటకు తీయలేకపోతోంది. చిక్కు ముడిని విప్పలేకపోతోంది. విచారణ సాగుతున్న తీరు చూస్తుంటే పక్కా వ్యూçహాత్మకంగానే సాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసా..గుతోంది. ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో హైడ్రామాలు సాగుతున్నాయి. వరుసగా మూడోరోజు కూడా నిందితుడు శ్రీనివాసరావును విచారించారు. ఆదివారం చికెన్‌ బిర్యానీ, సోమవారం శాకాహార భోజనం తీసుకున్న నిందితుడు మంగళవారం ఉన్నట్టుండి ఛాతినొప్పి వస్తుందంటూ వేలాడపడడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో స్థానిక ప్రైవేటు వైద్యుడు దేముడుబాబును రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

బీపీ, పల్స్‌ రేటు సాధారణంగానే ఉందని, కానీ నిందితుడు ఆందోళనతో ఉన్నాడని, చేతులు, ఛాతి నొప్పిగా ఉన్నాయని అంటున్నాడని కేజీహెచ్‌కు తీసుకెళ్లడం మంచిదని దేవుడుబాబు సిఫార్సు చేశారు. ఆ వెంటనే హుటాహుటిన ప్రత్యేక బందోబస్తు మధ్య కేజీహెచ్‌కు తరలించి మళ్లీ బీపీ, పల్స్, షుగర్‌తో పాటు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించారు. స్టేషన్‌ వద్ద తాను ప్రజలతో మాట్లాడాలన్న నిందితుడు.. ఆస్పత్రి వద్ద తనకు ప్రాణహాని ఉందంటూ గగ్గోలు పెట్టాడు. కాగా గడిచిన రెండురోజులు బాగానే తింటున్నాడని, ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పిన సిట్‌ అధికారులు మంగళవారం సరిగా భోజనం చేయడం లేదని చెప్పడం విస్మయానికి గురిచేశారు.


అంతేకాదు సోమవారం అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్తూ మీడియాకు నవ్వుతూ కన్పించిన నిందితుడు తెల్లారేసరికి నీరసంగా కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. రెండరోజు అర్ధరాత్రి 2.30 గంటల వరకు విచారణ పేరిట హైడ్రామా నడిచింది. కాగా మూడోరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా, సిట్‌ ప్రత్యేకాధికారి ఫకీరప్ప, సిట్‌ అధికారి నాగేశ్వరరావు స్టేషన్‌కు రాగా, కొత్తగా విధుల్లో చేరిన డీసీపీ–2 నయీమ్‌లు కూడా విచారణ టీమ్‌లో చేరారు. వీరంతా కలిసి రాత్రి 8 గంటల వరకు ఏకబికిన విచారణ సాగించారు. మంగళవారం రోజంతా నిందితుడు నుంచి ఎలాంటి అదనపు సమాచారాన్ని రాబట్టలేకపోయారని తెలియవచ్చింది.


సిట్‌ ఎదుట ఎయిర్‌పోర్టు డైరెక్టర్, సీఎస్‌వో
ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.ప్రకాష్‌రెడ్డి, సీఎస్‌వో వేణుగోపాల్‌లు సిట్‌ ఎదుట హాజరు కాగా, వారి నుంచి ఆరోజు ఘటనపై స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్‌ చేశారు. మరో వైపు నిందితుడు వాడిన సెల్‌ఫోన్లు రికవరీ చేయడంతో పాటు కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాసరావు ఎక్కువగా మాట్లాడిన వారి నుంచి వివరాలు రాబట్టేందుకు మూడు ప్రత్యేక బృందాలు గుంటూరు, హైదరాబాద్‌తో పాటు గ్వాలియర్‌ కూడా పంపారు. మరో వైపు నిందితుడు జేబులో లభ్యమైన లేఖను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ స్థానిక మూడో మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. కాగా ఘటన సమయంలో జగన్‌ ధరించిన షెర్ట్‌ ఇప్పించాలని కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. సోమవారం కేసులో ఎలాంటి పురోగతి లేదని చెప్పగా, మంగళవారం విచారణ ఏమాత్రం పురోగతి లేదని సీపీ మహేష్‌చంద్ర లడ్డా చెప్పుకొచ్చారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో వైద్య పరీక్షలకు పంపడం మినహా ఈరోజు ఎలాంటి దర్యాప్తు ముందుకు సాగలేదని పరోక్షంగా పేర్కొన్నారు.

పోలీస్‌ కస్టడీలో ఉన్న దుండగుడు శ్రీనివాసరావు నుంచి మూడోరోజూ పోలీసులు ఎటువంటి వివరాలు రాబట్టలేకపోయారు. పైగా మధ్యాహ్నం నుంచి కొత్త డ్రామా చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీనివాసరావును జనరల్‌ చెకప్‌లో భాగంగా ప్రైవేట్‌ వైద్యుడితో పరీక్షలు చేయించారు. అదే సమయంలో తనకు ఛాతీ నొప్పి వస్తోందని.. ఎడమ చెయ్యి నొప్పెడుతోందని ఏడుపు లంకించుకోవడంతో.. కేజీహెచ్‌కు తరలించి ఎక్స్‌రేలు తీయించి.. పరీక్షలు జరిపించి ఎటువంటి సమస్యా లేదని తేల్చారు.

కానీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి కేజీహెచ్‌కు తరలించడం.. అక్కడ ఆ వార్డు నుంచి ఈ వార్డుకు పలుమార్లు తిప్పడం చూస్తే.. ఇదంతా కావాలని ఆడుతున్న నాటకంలా కనిపించింది. మీడియాకు, ముఖ్యంగా టీవీ చానళ్లకు నిందితుడి బైట్లు, అతని వాయిస్‌లు లభించేలా చేయడానికి అలా తిప్పారన్న ఆరోపణలు వినిపించాయి. అందుకు తగినట్లే నిందితడు ‘తాను జగన్‌ అభిమానిని’ అన్న పాత పాటతోపాటు.. తనకు ప్రాణహాని ఉందని, రక్షించాలని కేకలు వేశాడు.

Back to Top