అభివృద్ధి, సంక్షేమం వైపు వడివడిగా అడుగులు 

వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు నేటికి సరిగ్గా నాలుగేళ్లు 

2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభం  

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగింపు 

కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు విన్న జననేత  

ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలు..

నాటి యాత్రను గుర్తు చేస్తూ, నేటి పాలనను వివరిస్తూ నేడు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు  

‘నాకున్నదల్లా ఒక్కటే కసి. నేను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని.. అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు మంచి జరగాలన్న కసి. అన్ని కులాల్లోని పేదలను ఆదుకోవాలన్న కసి. రాష్ట్రాన్ని దేశ శిఖరాగ్రాన నిలపాలన్న కసి’ అంటూ అశేష జనవాహిని నడుమ.. పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా చేస్తున్న జైజగన్‌ నినాదాల మధ్య సాగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలివి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ మాటలకు కట్టుబడే పాలన సాగిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. 

  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం.. చరిత్రాత్మకం. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు. అన్ని జిల్లాల్లో జనం ‘జయహో జగన్‌’ అంటూ తరలి వచ్చి తమగోడును వెళ్లబోసుకున్నారు. మరో వైపు పూలబాట వేసి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్దారు. నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాధలు, అర్హతలున్నా ఉద్యోగం.. ఉపాధి లేని యువత, విద్యార్థులు, అన్నమో రామచంద్రా అంటూ రైతులు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఎక్కడికక్కడ వారి బాధలు చెప్పుకున్నారు.

 
వైయ‌స్ జగన్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా..
పాదయాత్రలో ప్రజలకు ‘జగన్‌ అనే నేను’.. అంటూ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ఆయన్ను ‘జగన్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను’ అని చెప్పే వరకు నడిపించాయి. ఇప్పటికీ అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం వరకు నడిపిస్తున్నాయి. 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్రను తిరగరాశారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఏకంగా 19 చట్టాలు చేశారు.

సంక్షేమాభివృద్ధి రెండు కళ్లుగా..
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన జగన్‌.. అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. భారీ ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం కోసం బిల్లు రూపొందించి, కేంద్రానికి పంపారు. దిశ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచారు.

రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని కులాల వారు రాజకీయంగా సమానంగా ఎదగాలనేదే సీఎం జగన్‌ లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కోవిడ్‌ కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మరో ఎత్తు. ఒకవైపు గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో పడేసి అప్పగించింది. మరో వైపు ప్రపంచంలోనే భయంకరమైన మహమ్మారి కరోనా కమ్మేసింది. అయినా... మొక్కవోని దీక్షతో ఖర్చుకు వెనుకాడక రాష్ట్రానికి పునరుజ్జీవం తెచ్చారు ముఖ్యమంత్రి జగన్‌. సచివాలయ వ్యవస్థతో గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుల ముందు నిలిపారు. 

Back to Top