తాడేపల్లి: అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేక, మద్దతు లేక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మధురమైన మామిడి పండ్లను పండించిన రైతులకు ఈసారి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులతో పూత లేటుగా రావడం, వచ్చిన పూత నిలబడక పోవడం, అంతో ఇంతో కాసిన కాయలు గాలి వానకు రాలిపోవడంతో సగం పంట పోయిందని, ఈ ఏడాది మొదటి నుంచి మామిడి రైతులు నష్టాలును ఎదుర్కొంటున్నారన్నారు. కిలోమామిడి రూ.20_40 ధర పలకాల్సిన ఉండగా, ర్యాంపుల వద్ద రూ.4 కీ అడుగుతున్నారన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా కొనుగోలు చేయడం లేదని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఖర్చులు కూడా తిరిగిరాని పరిస్థితుల్లో రైతులు నిరాశలో కూరుకు పోయారన్నారు. రాయచోటి నియోజక వర్గంలో వేరుశనగ పంటతో పాటు మామిడి ప్రధాన పంట అయిందన్నారు. నియోజక వర్గంలో అధిక విస్తీర్ణంలో మామిడి సాగు అవుతోందన్నారు. బేనీషా, మల్లిక, ఖాదర్ వంటి రకాలకు కూడా కనీస ధర లేదని, రేట్లు లేక తోతాపురి పంటను తోటల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులు నష్టాలనుమూటకట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, కిలోకు రూ 10 అదనంగా చెల్లించాలని,పార్టీల కతీతంగా అందరి రైతుల నుంచి కొనుగోళ్లు చేయాలని ఆయన కోరారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గుజ్జు పరిశ్రమలపై ఒత్తిడి తెచ్చి మామిడి కొనుగోలు చేయించాలని ప్రభుత్వాన్ని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మద్దతు ధర కల్పించి నియోజక వర్గంలో ప్రతి మండల కేంద్రంలో మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. దళారీ వ్యవస్థలేకుండా చేయాలన్నారు. అకాల వర్షాలు, గాలుల కారణంగా పంట రాలి పోతుండగా, పక్వానికి వచ్చిన పంటను అమ్మలేని స్థితి ఉందన్నారు. దుక్కి దున్నడం నుంచి పంట కోయడం వరకు ఒక కిలో మామిడి పంటను తీయడానికి రూ.7_15 ఖర్చవుతుందని, కనీసం ఆ ఖర్చు కూడా తిరిగిరావడం లేదని రైతులు వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. మామిడి పంట అయిపోయివచ్చిందని, ఆఖరిలో తమ కాయలను జ్యుస్ ఫ్యాక్టరీల వాళ్లకు కొనుగోలు చేయమని సిపారసు చేయమని దీనంగా రైతులు అడుగుతుంటే మనసుకు చాలా బాధ కలిగిందని, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. మండీల వద్ద కొనుగోలు యంత్రాంగం సక్రమంగా పనిచేయాలనీ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని ఆయన కోరారు.వరి, టమోటా తదితర పంటలకూ గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఏడాది నుంచి పంట నష్టపరిహారం, రైతు భరోసాలు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయన్నారు. మామిడి రైతులకు పరిహారంగా ఎకరాకు రూ 20 వేలు ఇవ్వాలి మామిడి రైతులకు పరిహారంగా ఎకరాకు రూ 20 వేలు చెల్లించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. మామిడి పంటకు ఇన్స్యూరెన్స్ ఇస్తే మంచిదన్నారు. మామిడి చెట్లు చనిపోతే ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రభుత్వం చెపుతోందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో మామిడి, తదితర ఉద్యాన పంటలకు పెద్దపీట వేశారన్నారు . రైతులు సంతోషంగా ఉండాలని మామిడి మొక్కలు ఉచితంగా ఇవ్వడం, 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించి ప్రోత్సహించడం వైయస్ఆర్ పుణ్యమేనన్నారు. డ్రిప్ ఇరిగేషన్ తోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, డ్రిప్ ఇరిగేషన్ అంటేనే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారన్నారు. ఆ సమయంలోనే రాయచోటి నియోజక వర్గంలోనే సుమారు 20 వేల ఎకరాలలో మామిడి తోటలు ఏర్పాటు అయ్యాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. అదే స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.