బతికేదెట్లా షర్మిలమ్మా!

కరెంటు లేకపోయినా పెద్ద బిల్లు వస్తోందనీ, తాగడానికి నీళ్లు లేవనీ.. పింఛన్లు అందట్లేదనీ  చెబుతూ ఆవేదనలు.
సాగు చేయడం కంటే చావడమే మేలని చెబుతున్న రైతన్నలు, ఉపాధి కూలీ 30 రూపాయలు కూడా రావట్లేదని కూలీల విచారం...వీరందరికీ భరోసా కల్పిస్తూ నలబయ్యవ రోజు మరో ప్రజా ప్రస్థానంలో వైయస్ షర్మిల సాగారు. జగనన్న వచ్చాక రాజన్న రాజ్యం తెస్తాడని ఆమె వారికి ధైర్యం చెప్పారు. నలబై రోజుల యాత్రలో రాజన్న కుమార్తె మొత్తం 539 కి.మీ నడిచారు. దారివెంట అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ సాగారు.
కలుకుంట్లకు చెందిన ఉరుకుందయ్య అనే రైతు షర్మిలను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన వెతలు చెప్పుకున్నారు. ఉన్న నాలుగెకరాలకు తోడు రెండెకరాలు గుత్తకు తీసుకుని పత్తి, మిరప, శనగ వేశానని తెలిపారు. ఇప్పటి వరకు లక్ష ఖర్చు పెట్టాననీ, కరెంటు లేక పంట మొత్తం పోయిందనీ  ఆవేదన వ్యక్తం చేశారు.  ఎకరానికి మూడు క్వింటాళ్ల పత్తి వచ్చింది.  అమ్మితే క్వింటాల్‌కు రూ.3000 కూడా రాలేదు. దాంట్లోనే పురుగు మందులు, ఎరువుల డబ్బలు సేటు తీసుకున్నాడు. ఈ పరిస్థితిలో ఎలా బతకాలని ఆ రైతు షర్మిలను ప్రశ్నించాడు. ఇంత పురుగుల మందు తాగి చనిపోవడమే మేలని కన్నీరు కార్చాడు.

బింగి దొడ్డి గ్రామానికి చెందిన భారతమ్మ అనే కూలీ ఆవేదన మరో ఎత్తు. పగలంతా కాయ కష్టం చేసి, ఇంటికెడితే  కరెంటే ఉండదన్నారు. ఒండుకొని తిని పడుకోబోతే  ఫ్యాను తిరగదు. దోమలు  పీక్కు తింటాయని చెప్పారు. బిల్లు రూ.400, రూ.500కు తక్కువ రాదు. అదీ.. ఇదీ అని లేదు అన్ని రేట్లూ పెరిగాయి ఎలా బతకాలంటూ షర్మిలను ప్రశ్నించింది.

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో సోమవారం ఆమె వద్ద గోడు వెళ్లబోసుకున్న వారిలో కేవలం ఇద్దరి ఆవేదన ఇది. జిల్లాలో పాదయాత్ర సాగుతున్న దారిపొడవునా ఇలా ఎందరో వచ్చి ఆమెకు తమ కష్టాలు చెప్పుకొంటున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్క పాలమూరు జిల్లానే కాదు.. ఇంతకుముందు పాదయాత్ర సాగిన  జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. రైతు కావచ్చు, కూలీ కావచ్చు, చేనేత కార్మికుడు కావచ్చు... అందరిదీ ఒకటే ప్రశ్న.. ‘ఈ సర్కారు కాల్చుకుతింటుంటే ఎలా బతకాలి?’ అన్నదే వారి ఆవేదన. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’లో వీరంతా ఆమెను కలిసి తమ గోడు చెప్పుకొంటున్నారు.

Back to Top