40 ఏళ్ల అనుభవం... అభాసుపాలు


  •  అబద్ధాలు, అర్ధసత్యాలతో దిగజారిపోతున్న చంద్రబాబు 
  •  వైయస్‌ఆర్‌పై వ్యాఖ్యలతో పరువు గంగపాలు
  •  చరిత్రను తిరగదోడి బాబును ఆడేసుకున్న నెటిజన్లు

రోజుకో మోసం.. పూటకో హామీతో చంద్రబాబు ఎట్టకేలకు నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. రెండు రోజుల నుంచి అడిగిన ఛానల్‌కి కాదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతున్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కదా.. కర్టసీ కోసమైనా కవర్‌ చేద్దామని వెళ్లిన  ఛానళ్లకు చంద్రబాబు షాకుల మీద షాకులివ్వడంతో సదరు రిపోర్టర్లకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయినంత పనైంది. సొంత డబ్బా కొట్టుకోవడం గురించి చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి అలాంటి విద్యను కనిపెట్టిందే చంద్రబాబు. ఇక చెప్పేదేముంది అవకాశం మళ్లీ రాదన్నట్టుగా నిజానిజాలతో సంబంధం లేకుండా చరిత్రను వక్రీకరించేశాడు. జనం నవ్వుతారన్న సోయలేకుండా జరిగిందానికి.. చెబుతున్నదానికీ సంబంధం లేకుండా అర్ధసత్యాలను ప్రచారం చేసుకున్నాడు. తన డప్పు తానే వాయించేసుకున్నాడు. 

వైయస్‌ఆర్‌కి టికెట్‌ ఇప్పించానని చెప్పుకున్నందుకు

40 ఏళ్ల నాటి రాజకీయాలు ఎవరికి గుర్తుంటాయని అనుకున్నాడో.. ఇప్పుడు నేను అబద్ధలు చెప్పినంతమాత్రాన ఎవరు కౌంటర్‌ చేస్తారని అనుకున్నాడో తెలియదు కానీ.. అన్నీ అర్ధ సత్యాలతో ఇంటర్వ్యూను ముగించేశాడు. చనిపోయిన వాళ్ల విషయంలో తన గొప్పలు ప్రచారం చేసుకునే అలవాటున్న చంద్రబాబు.. చివరికి వైయస్‌ఆర్‌ విషయంలోనూ పబ్లిసిటీ కోసం పాట్లు పడ్డాడు. ఇందిరాగాంధీకి చెప్పి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించానని చెప్పి నవ్వులపాలయ్యాడు. కనీసం వారిద్దరూ ఒకే పార్టీ నుంచి పోటీ చేయలేదన్న సంగతి ఆయన మరిచిపోయి ఉండొచ్చు.. కానీ చరిత్ర మరిచిపోదు కదా.. వెంటనే సోషల్‌ మీడియాలో చంద్రబాబు లూజ్‌ టాక్‌ గురించి రచ్చయ్యింది. 

బ్రతికి లేని వాళ్ల గురించో.. మాట్లాడలేని స్థితిలో ఉన్న గురించో తనకు అనుకూలంగా వార్తలు రాయించుకోవడమో.. తానే గొప్పలు చెప్పకోవడం చంద్రబాబుకు మొదటున్నంచీ అలవాటే. ఇదే ఇంటర్వ్యూలో పీవీ నర్సింహారావుకు ఆర్థిక సంస్కరణల గురించి చెప్పానని డబ్బా కొట్టకున్నాడు. గతంతలోనూ బ్రాడ్‌ బ్యాండ్‌ గురించి వాజ్‌పేయికి తానే ఐడియా ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నాడు. కాంగ్రెస్‌ హయాంలో మొదలైన డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టినట్టు ప్రచారం చేసుకున్నాడు. సెల్‌ఫోన్, కంప్యూటర్‌ను దేశానికి తానే తెచ్చినట్టు డాబులు పోయాడు. చివరికి ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించింది కూడా తానేనని చెప్పకున్నాడు. తన పబ్లిసిటీ కోసం ఎవరి కష్టాన్నైనా తన అకౌంట్‌లో వేసుకోవడం ఆయనకు అలవాటే. మొదట్లో తనను తాను ఎస్టాబ్లిష్‌ చేసుకోవడం కోసం పెద్దవాళ్ల పేరు.. వారి పనులను వాడుకున్న చంద్రబాబు రాన్రాను అదొక వ్యవసంలా మార్చుకున్నారు. బాబు తరఫు మీడియా ఉన్న కాలంలో తన రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం అబద్ధాలు చెప్పడం, గొప్పలు ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడూ అదే పంథాను అనుసరిస్తూ 40 ఏళ్ల అనుభవం ఇంతేనా అని జూనియర్ల ముందు చులకన అవుతున్నారు. 
 
Back to Top