ఇది రైతు పక్షపాత ప్రభుత్వం

 వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు  

రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యం

కౌలు రైతులనూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం

వారికీ రైతులతో సమానంగా అన్నీ వర్తింప చేస్తున్నాం

అందుకోసం ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్నాం

ఏటా బడ్జెట్‌ కూడా పెంచుతూ పోతున్నాం

దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు, కార్యక్రమాలు

వ్యవసాయాన్ని పండగ చేస్తూ సీఎంగారి నిర్ణయాలు

వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.కన్నబాబు ప్రకటన

వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌లో ఉంది

దీనిపై కేంద్రమే స్వయంగా సర్టిఫికెట్‌ ఇచ్చింది

అయినా పవన్‌కళ్యాణ్‌ దాన్ని విస్మరిస్తున్నారు

కేంద్ర సర్టిఫికెట్‌ కంటే ఇంకా గొప్ప గుర్తింపు ఏముంటుంది?

సూటిగా ప్రశ్నించిన మంత్రి కె.కన్నబాబు

స్వప్రయోజనాల కోసమే పవన్‌కళ్యాణ్‌ యాత్ర

రైతుల ఆత్మహత్యలంటూ బెంబేలెత్తించే ప్రయత్నం

రైతుల బలవన్మరణాలంటూ అర్దం లేని లెక్కలు

ఆ వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయి?

ఎవరెవరిని కలిసి ఆ వివరాలు సేకరించారు?

టీడీపీ రోడ్‌మ్యాప్‌లో పవన్‌కళ్యాణ్‌ నడుస్తున్నారు

తాడేపల్లి:  మాది రైతు పక్షపాత ప్రభుత్వమ‌ని మంత్రి క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్  రాష్ట్ర రైతుల గురించి మాట్లాడారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయ‌డాన్ని మంత్రి త‌ప్పుప‌ట్టారు. అధికారం చేపట్టిన వెంటనే వైయ‌స్ జగన్‌గారు, తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఇచ్చే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచారు. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం యజ్ఞంలా పని చేస్తోంది. వ్యవసాయ రంగంలో శాశ్వత మౌలిక వసతుల కల్పన కోసం, రైతులను వెంటనే ఆదుకోవడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

కేంద్రమే సర్టిఫికెట్‌ ఇచ్చింది:
    ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని వెల్లడించింది. ఆ ప్రకటన చేసింది బీజేపీ ప్రభుత్వం. ఆ పార్టీతో స్నేహంగా ఉన్న పవన్‌కళ్యాణ్, ఆ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్‌ను ఎందుకు విస్మరించారు? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్వయంగా రాష్ట్రానికి ఒక సర్టిఫికెట్‌ ఇచ్చింది. వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని కితాబునిస్తే, దాన్ని పవన్‌కళ్యాణ్‌ ఎందుకు పట్టించుకోలేదు. కేంద్రం ఇచ్చిన సర్టిఫికెట్‌ కన్నా ఇంకా ఏం సర్టిఫికెట్‌ కావాలి? సీఎం జగన్‌గారు ఎంతో తపన పడి, పని చేస్తే ఆ గుర్తింపు వచ్చింది.

టీడీపీ రోడ్‌మ్యాప్‌లో పవన్‌:
    2019కు ముందు పవన్‌కళ్యాణ్, రాష్ట్రానికి కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని అన్నారు. ఆ తర్వాత ఇటీవల ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఇచ్చే రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కానీ వాస్తవానికి ఆయన టీడీపీ ఇస్తున్న రోడ్‌ మ్యాప్‌లో వెళ్తున్నారు.
    2014 ఎన్నికలకు ముందు నుంచి చూసినా, పవన్‌కళ్యాణ్‌ ఎలా వెళ్తున్నారనేది తెలుస్తుంది. అప్పటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా టీడీపీని సమర్థించారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అయిదేళ్లపాటు ఒక్కసారి కూడా ఆ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకుండా, ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్‌సీపీనే విమర్శించారు. అన్ని సమస్యలకు కారణం విపక్ష వైయస్సార్‌సీపీ అన్నట్లు మాట్లాడారు.
    ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయేలా, ఏకపక్షంగా వైయస్సార్‌సీపీకి ఆ ఓట్లు రాకుండా, పవన్‌కళ్యాణ్‌ విడిగా పోటీ చేశారు. మళ్లీ 2024 వచ్చే సరికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని ప్రకటిస్తున్నారు. ఆయన ఏ విధంగా చూసినా, టీడీపీ రోడ్‌ మ్యాప్‌కు అనుగుణంగా పని చేస్తున్నారు.

ఆ లెక్కలు ఎక్కడివి?:
    లేని సమస్యను ప్రస్తావించి, ఉద్యమిస్తున్నట్లు చెబుతున్నారు. చాలా విచిత్రంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలో 500కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలలో కూడా రైతులు చనిపోయారంటూ ఏవో లెక్కలు చెబుతున్నారు. అసలు ఆ లెక్కలు పవన్‌కళ్యాణ్‌కు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఆయన ఎక్కడ సర్వే చేశారు? ఏ సమాచారం తీసుకున్నారు? రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతులను బెంబేలెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.
    నిజానికి వ్యవసాయాన్ని ఒక పండగలా చేసేందుకు సీఎం జగన్‌గారు పని చేస్తుంటే, వ్యవసాయం దండగ అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు.

శాపనార్థాలు పని చేస్తాయా?:
    ఇంకా పవన్‌కళ్యాణ్‌ పెట్టిన శాపనార్థాలు. 2019 ఎన్నికల ముందు చెప్పారు. ఎప్పటికీ జగన్‌గారు సీఎం కారు అని పవన్‌ చెప్పారు. ఆ వీడియో ఇప్పటికీ ఉంది. కానీ ఏం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో జగన్‌గారు గెల్చారు. మళ్లీ ఇప్పుడు అదే మాట అంటున్నారు. జగన్‌గారు సీఎం కారు కారు అంటున్నారు. ఒక వ్యక్తి చెప్పినంత మాత్రాన ఏదీ జరగదు. ప్రజలు అనుకుంటేనే అవుతుంది.
    ప్రజలు జగన్‌గారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి, ఆయనను ఎలాగైనా బలహీన పర్చాలన్న టీడీపీ రోడ్‌ మ్యాప్‌కు అనుగుణంగా పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారంటూ ఈనెల 12 నుంచి ఆయన రైతు భరోసా యాత్ర అని మొదలు పెడుతున్నారట.

పబ్లిసిటీ కోసం యాత్ర!:
    నిజానికి రైతులకు పెట్టుబడి సాయంగా ఈ ప్రభుత్వం మొదలు పెట్టిందే రైతు భరోసా. అలాగే రైతులకు అడుగడుగునా అండగా ఉన్నవే రైతు భరోసా కేంద్రాలు. కానీ మీరు రాజకీయ ఎత్తుగడలో భాగంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ యాత్ర మొదలు పెడుతున్నారు. 
పబ్లిసిటీ కోసం పార్టీకి చందా ఇచ్చినట్లు చూపించి, దాన్ని కూడా ప్రచారానికి వాడుకుంటూ, ఇప్పుడు యాత్ర చేస్తామంటున్నారు.

మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే..:
    నిజానికి పవన్‌కళ్యాణ్‌ గతంలో కూడా రైతుల ఆత్మహత్యలపై స్పందించి ఉంటే, ఆయనకు చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు. కానీ 2014 నుంచి 2019 వరకు ఆయన ఏనాడూ రైతుల ఆత్మహత్యలపై స్పందించలేదు. అప్పట్లో రైతుల ఆత్మహత్యలను అప్పటి టీడీపీ ప్రభుత్వం చాలా తక్కువ చేసి చూపించింది. కానీ ఏనాడూ ఆయన వాటి గురించి మాట్లాడలేదు. అసలు రైతుల బలవన్మరణాలే లేవన్నట్లు వ్యవహరించారు.

అన్ని కుటుంబాలను ఆదుకున్నాం:
    ఆ క్రమంలో అవి అసలు ఆత్మహత్యలే కాదని అప్పటి ప్రభుత్వం కొట్టిపారేస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 773 కేసులకు సంబంధించి తిరిగి విచారణ చేయిస్తే, వాటిలో 469 కేసులు.. రైతుల బలవన్మరణాలే అని తేలడంతో, ఆ మొత్తం కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది జగన్‌గారి ప్రభుత్వం. ఆ మొత్తాన్ని బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకోకుండా, ఆ కుటుంబాలకు నేరుగా ఆ పరిహారం ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకోసం ప్రతి కలెక్టర్‌ వద్ద కోటి రూపాయల ప్రత్యేక నిధి కూడా ఉంచాం.
    నిజం చెప్పాలంటే రైతులు ఆత్మహత్య చేసుకోకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే విత్తనాల మొదలు పంటల అమ్మకం వరకు అడుగడుగునా రైతులకు అండగా నిలుస్తున్నాం. కాదని చెప్పండి.

కౌలు రైతులకూ అండగా..:
    సీసీఆర్‌సీ చట్టం గురించి కూడా జనసేన నాయకులు మాట్లాడారు. కానీ ఈ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా మేలు చేసే విధంగా, ఈ మూడేళ్లలో 12.11 లక్షల కార్డులు ఇప్పించాం. అంతే కాకుండా, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సహాయం చేస్తున్నాం. కౌలు రైతులకు కూడా ఒక్క రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్‌ ఇస్తున్నాం. వారికి కూడా వడ్డీ లేని రుణాలు అందేలా చూస్తున్నాం. సీసీఆర్‌సీ కార్డులు లేకున్నా రైతు గ్రూప్‌లకు రుణాలందేలా చర్యలు చేపట్టాం. ఈనెల 1 నుంచి నెల రోజుల పాటు ప్రతి ఆర్బీకేలో కార్యక్రమం చేపట్టి, కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇస్తున్నాం.

కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు?:
    నేను సూటిగా పవన్‌కళ్యాణ్‌ను ఒక్కటే అడుగుతున్నాను. పీఎం కిసాన్‌ పథకంలో కేంద్రం కౌలు రైతులను కవర్‌ చేయడం లేదు. కానీ ఇక్కడ జగన్‌గారు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తోంది. మీరు ఏ నాడైనా కౌలు రైతులకు ఆ సాయం చేయాలని కేంద్రాన్ని అడిగారా? కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అందుకే టీడీపీ రోడ్‌ మ్యాప్‌లో నడుస్తున్నారని చెబుతున్నాం. మీ రాజకీయం కోసమే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు అని యాత్ర చేపడుతున్నారు.

ఆ ట్రాప్‌లో పడకండి:
    ఎల్లో మీడియాలో బాగా హైలైట్‌ చేస్తారని పార్టీ కార్యక్రమాలు ఎత్తుకుంటే, వారి అవసరం తీరాక తీసి పక్కన పడేస్తారు. జగన్‌గారిని, వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తిడితే మిమ్మల్ని హైలైట్‌ చేస్తారు. ఒక్కసారి చంద్రబాబును, లోకేష్‌ను తిట్టండి. వారి స్పందన ఎలా ఉంటుందో చూడండి.

ఎన్‌సీఆర్‌బీ వివరాలు ప్రామాణికం కాదు:
    ఇప్పటి వరకు చూస్తే.. కొన్ని జిల్లాలలో.. రైతుల ఆత్మహత్యలు చూస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో 19 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డుల్లో ఉంటే, అక్కడ 50 మంది చనిపోయారని మీరు ప్రచారం చేస్తున్నారు. మీరు ఏ డేటా తీసుకున్నారు? ఎవరెవరిని కలిశారు? ఆ వివరాలు ఇస్తే మేము కూడా దర్యాప్తు చేస్తాం కదా? ప్రతి చోటా ఎన్‌సీఆర్‌బీ వివరాలు ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. 

మీ చర్యల వల్ల రైతులకు నష్టం:
    మీరు రాజకీయాల కోసం రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని మీరు ప్రచారం చేయాలని చూస్తే, నిజంగా నష్టపోయేది రైతులే. మీ చర్యలు రైతుల ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తున్నారు. గతంలో ఎన్‌సీఆర్‌బీ వివరాలు బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో.. సరిగ్గా ఇప్పుడు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. మీ వల్ల రైతులకు నష్టం జరుగుతుంది.
    పంట నష్టం జరిగితే కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తున్నాం. ఈ విధంగా ఇన్ని పనులు చేస్తుంటే, ఎందుకు కౌలు రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.

చంద్రబాబు ఏ ఒక్కటైనా ఇచ్చారా?:
    మీ ప్రసంగాలకు మేము భయపడడం లేదు. అది మా లక్షణం కాదు.
పవన్‌కళ్యాణ్‌ను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 469 కుటుంబాలకు మేము సహాయం చేశాం. మరి ఆనాడు మీరు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?
    నిజానికి చంద్రబాబు ఆరోజు రైతులకు ఏం ఇచ్చారు? పెట్టుబడి సాయం చేశారా? పంట నష్ట పరిహారం ఇచ్చారా? ఉచిత ఇన్సూరెన్స్‌ ఇచ్చారా? ఏ ఒక్కటైనా ఇచ్చారా చెప్పండి. కానీ మేము దేవాలయాల భూములు సాగు చేసే కౌలు రైతులకు కూడా అన్ని పథకాలు వర్తింప చేస్తున్నాం. రైతులతో పాటు, కౌలు రైతులను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. అయినా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, చంద్రబాబు ఇస్తున్న రోడ్‌ మ్యాప్‌ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అదే నేను ప్రశ్నిస్తున్నాను.

అవి మీ వైఖరి చూపుతున్నాయి:
    నిజానికి మీరు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ కోసం కూడా ఆగడం లేదు. ఎవరి వల్ల మీకు ప్రయోజనం ఉందో వారి రోడ్‌ మ్యాప్‌ ప్రకారం పని చేస్తున్నారు.
    మీరు ఎన్ని శాపనార్థాలు అయినా పెట్టుకోండి. మీ శాపనార్థాలు మీ వైఖరిని చూపుతున్నాయి. 2019 ఎన్నికల ముందు చెప్పారు. జగన్‌గారు సీఎం కారు అని. కానీ ఏం జరిగింది? ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నారు.
    అదే మా నాయకుడికి క్లియర్‌ రోడ్‌ మ్యాప్‌ ఉంది. అది ఎవరో ఇచ్చింది కాదు. ఆయన సొంతంగా రూపొందించుకున్నది. అందుకే రైతుల కోసం ఎన్నెన్నో చేస్తున్నారు.

వాస్తవాలు గుర్తించండి:
    రాష్ట్రంలో చంద్రబాబు అన్ని పార్టీలను తానే నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వామపక్షాలతో పాటు, మరోవైపు రైటిస్టులను.. ఇంకో పక్క మిమ్మల్ని కూడా ఆపరేట్‌ చేస్తున్నారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించండి.
    రైతులు, కౌలు రైతులను ఆదుకోవడంలో ఈ దేశంలో జగన్‌గారిని మించిన వారు లేరు. అయినా ఇంకా ఏమేం చేయాలనేది ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు.
    వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఏటా బడ్జెట్‌ పెంచుతున్నాం. 
ఏకంగా రూ.16 వేల కోట్లతో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు, కోల్డ్‌ రూమ్‌లు, ఎస్సేయింగ్‌  ఎక్విప్‌మెంట్, గ్రేడింగ్‌ సార్టింగ్‌ ఎక్విప్‌మెంట్, బీఎంసీయూలు, ఫిషరీస్‌కు సంబంధించిన జెట్టీలు.. ఇలా అన్నీ చేస్తున్నాం. ఇప్పటికే మొదటి దశ పనులు జరుగుతున్నాయి.
    ఇవే కాకుండా ఎప్పటికప్పుడు పథకాల్లో సహాయం చేస్తూనే ఉన్నాం. అందుకే రైతులను ఆదుకోవడంలో జగన్‌గారికి ఎవరూ సాటి రారని స్పష్టం చేస్తున్నారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే, అదే సీజన్‌లో పరిహారం కూడా ఇస్తున్నాం.. అని మంత్రి శ్రీ కె.కన్నబాబు వివరించారు.

Back to Top