కాంగ్రెస్ చేతిలో రసవత్తర డ్రామాగా విభజన

హైదరాబాద్, 21 నవంబర్ 2013:

రాష్ట్ర విభజనను రసవత్తర నాటకంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. సమైక్యానికి సైంధవుడిలా అడ్డుపడింది ముఖ్యమంత్రి కిర‌ణ్ కాదా అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలపై కాంగ్రెస్ అధిష్టానం బజారు స్థాయి చర్చలు నడుపుతోందని విమర్శించారు. సీఎం కిరణ్, స్పీకర్‌ మనోహర్‌ మధ్య ఏదో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందంటూ కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న కలరింగ్‌ చూస్తుంటే విస్మయం కలుగుతోందని అన్నారు. ఇలాంటి కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టాలన్నారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తే విభజన ఆగేది కాదా అని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్కుమా‌ర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజ్యాంగ సంక్షోభం సృష్టించమంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు నోరు మెదపటం లేదేమని వాసిరెడ్డి‌ పద్మ సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కాంగ్రెస్ పార్టీ వివాదంలోకి లాగుతోందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ మురికి నిర్ణయాలకు రాజ్యాంగ వ్యవస్థలు బలి కావాలా‌? అని ‌నిలదీశారు. విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం జరగాలనే అంశంపై జాతీయ పార్టీల్లో ఒక అభిప్రాయాన్ని తీసుకు రావడం కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న వైనాన్ని పద్మ ప్రస్తావించారు. రాష్ట్రాల విభజనకు అసెంబ్లీ తీర్మానాన్ని తప్పనిసరి చేయాలని, ఆర్టికల్‌ 3ని సవరించాలంటూ సమైక్యాన్ని కోరుకునే రాజకీయ పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పోరాడుతోందన్నారు.

ముఖ్యమంత్రి, స్పీకర్‌ సమైక్యాన్ని కోరుకుంటుంటే ఇంక ఎవరు విభజనను కోరుకుంటున్నారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విభజనకు చేయాల్సిందంతా చేస్తూ.. సీడబ్ల్యూసీ చెప్పిందల్లా చేస్తూ.. ఇంకా మసిపూసి మారేడుకాయ చేయాలని ఎందుకు చూస్తున్నారని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆమె నిలదీశారు. సమైక్యం కోసం చింతాకంత ప్రయత్నమైనా కిరణ్‌కుమార్‌రెడ్డి చేసే వారే అయితే.. కేబినెట్‌ నోట్‌కు ముందే అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో చెబుతున్నా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రోరోగ్‌ కాని అసెంబ్లీని సమావేశపరచడానికి కిరణ్‌ ఎందుకు తాత్సారం చేశారని అన్నారు. సీఎంకు చీమూ నెత్తురూ ఉందా? అని తూర్పారపట్టారు. సమైక్య ఉద్యమాన్ని అన్ని రకాలుగా సీఎం కిరణ్ నీరుగార్చారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ క్రూరమైన ఆట ఆడుతున్నట్లు వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. విభజన నిర్ణయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డిసెంబర్‌ నెలంతా కీలకంగా మారుతోందని, రాష్ట్రంలో ఏదో జరగబోతోందని, అసెంబ్లీలో మహా కురుక్షేత్రమే జరగబోతోందనే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకువస్తోందన్నారు.‌ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఈ వివాదంలోకి లాగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన మురికిపనికి మిగిలిన వాళ్ళంతా బురద పూసుకునే పరిస్థితి కల్పించిందన్నారు.

విభజన నిర్ణయ పాపం సోనియా గాంధీదైతే.. కొబ్బరికాయలా రాష్ట్రాన్ని పగలగొట్టమని చంద్రబాబు అడుగుతున్నారని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడంలేదని ముఖ్యమంత్రిని చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారన్నారు. సోనియాను విమర్శిస్తే ఏ ఐఎంజీ కేసులోనో జైలుకు వెళతానని చంద్రబాబు నాయుడికి భయమని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. సోనియాను విమర్శిస్తే.. సీబై కేసులు తన మీదకు వస్తాయని హడల్‌ అన్నారు. సమైక్యం అన్న ఒక్కమాట మాట్లాడటానికి బాబూ... మీ నాలుక మడత పడుతోందా అన్నారు. కిరణ్, చంద్రబాబు తెలుగు ప్రజల పాలిట చీడపురుగులని ఆమె నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని విభజించాలనుకున్న వాళ్ళంతా ఒక వైపున ఉంటే.. సమైక్యంగా ఉంచాలంటూ శ్రీ జగన్‌ ఒక్కరే మరో పక్కన ఉన్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు.

కేంద్ర మంత్రులు ప్యాకేజ్‌ అడగడమేంటి? విభజనకు ఒక పక్కన సహకరిస్తూనే సీఎం కిరణ్‌ సమైక్యం అనడం ఏంటి? అసెంబ్లీలో ఏదో జరగబోతోందంటూ పెద్ద డ్రామా తీయమేంటి? అని పద్మ ప్రశ్నించారు. ఇవేవీ చంద్రబాబు నాయుడికి పట్టడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఏది అడిగితే అది కాంగ్రెస్‌ అధిష్టానం చేస్తోందని విమర్శించారు. ప్రజా గర్జన పేరు మీద ప్రజల్లోకి వెళ్ళి పిల్లికూతలు కూయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని ఎద్దేవా చేశారు. సమైక్యం గురించి అన్ని ఆంక్షలనూ ఒక్కొక్కటిగా సడలించుకుంటూ జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద బండలు వేయడానికి మాత్రం వీళ్ళంతా ఒకే మాట మీద ఉంటున్నారని పద్మ ఆరోపించారు. నిర్బంధం నుంచి బయటికి వచ్చి ఇటలీకి వెళ్ళిపోతావా అంటూ సోనియా మీద సమైక్య సింహంలా గర్జించింది శ్రీ జగన్‌ కాదా ఆమె ప్రశ్నించారు.

శ్రీ జగన్‌ చేస్తున్న ప్రయత్నం వల్ల రాజ్యాంగంలోని 3ని సవరించాల్సిన అవసరంపైన, ఆర్టికల్‌ 4 కానీ, 371 డీ కానీ చర్చనీయాంశమయ్యాయన్నారు. ఏ రాష్ట్రం విడిపోవడానికైనా అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేయాలని ఇప్పుడు చర్చ జరుగుతోందని పద్మ అన్నారు. రాష్ట్ర విభజనకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శలు, కుట్రలకు కిరణ్, చంద్రబాబు, కేంద్ర మంత్రులు సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా మదిలో పుట్టిన రాష్ట్ర విభజన ఆలోచనకు వాళ్ళంతా తందానతాన అన్నందువల్లే ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా వచ్చిందని పద్మ నిప్పులు చెరిగారు. ఒకచేత్తో సీఎం కిరణ్‌ను, మరొక చేత్తో కేంద్ర మంత్రులను, ఇంకో చేత్తో సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులను, మరో చేత్తో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సోనియాగాంధీ ఆడిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రాన్ని కొబ్బరికాయలా పగలగొట్టండి అంటున్న చంద్రబాబును కుప్పం ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలని పద్మ విజ్ఙప్తి చేశారు. తన నియోజకవర్గంలోకి శ్రీ జగన్‌ వెళితే ప్రజలను హాజరు కావద్దని చెప్పే దయనీయమైన, నీచమైన స్థితిలోకి చంద్రబాబు వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ అంపశయ్య మీదే కాదు అంత్యక్రియలకు సిద్ధమవుతోందని చంద్రబాబు మాటల ద్వారా వెల్లడవుతోందన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెనుక 75 శాతం మంది రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆమె అన్నారు. పెత్తందారీ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.

Back to Top