వర్షాలపై జగన్‌ గంట గంటకూ సమీక్ష

హైదరాబాద్, 24 అక్టోబర్ 2013:

రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో తాజాగా నెలకొన్న పరిస్థితిపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గంట గంటకూ ఆయా జిల్లాల పార్టీ కన్వీనర్లతో సమీక్షలు చేస్తున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, సహాయ పునరావాస చర్యలు చేపట్టడానికి స్థానిక అధికారుల తోడ్పాటు తీసుకుని ముందుకు సాగాలని జిల్లాల నాయకులను ఆదేశించారని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కొణతాల మాట్లాడారు.

‌ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని కొణతాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ఇప్పటికే లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగిందని తెలిపారు. రిజర్వార్ల దగ్గర గట్లు తెగిపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం అప్రమత్తమై, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కొణతాల డిమాండ్‌ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి మూడు రోజులుగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సంవత్సరం వర్షాకాలంలో బహుశా ఇవే పెద్ద వర్షాలు కావచ్చన్నారు. ఈ ఏడాది పంటలు ఎంతో బాగుంటాయని రైతులంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన తరుణంలో కురిసిన భారా వర్షాల కారణంగా చేతికి అందివచ్చిన పంట అంతా నీటిపాలైపోయిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విచారం వ్యక్తంచేశారు.‌ కొన్ని జిల్లాల్లో వర్షాలు ఇప్పటికీ కురుస్తున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 65, విజయనగరంలో 57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఈ భారీ వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, పొగాకు, పత్తి, చెరకు పంటలు భారీగా నష్టపోయాయన్నారు. ప్రాథమిక నివేదికల అంచనా ప్రకారం రాష్ట్రంలోని సుమారు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన తెలిపారు.

కోస్తా ఆంధ్ర, మహబూబ్‌నగర్‌, వరంగల్, కరీంనగర్ జిల్లాలలోని ప్రజలు వర్షం తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నారని కొణతాల ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని చోట్ల రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండడమే కాకుండా పొంగిపొర్లుతున్నాయన్నారు. కొన్ని రిజర్వాయర్లకు గండ్లు పడ్డాయని, మరి కొన్ని చోట్లు రోడ్లు ధ్వంసమైపోయాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద కారణంగా ఈ మూడు రోజుల్లోనే హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలో ప్రహారీ కూలిన ఘటనలో ముగ్గురు మరణించడంతో సహా సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ నదులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయని, ఏ నిమిషంలోనైనా వరద ముంచుకువచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని కొణతాల పేర్కొన్నారు. మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి కొణతాల విజ్ఞప్తిచేశారు.

నీలం తుపానుకు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇంకా పరిహారం అందించని పరిస్థితి ఉందని కొణతాల విచారం వ్యక్తంచేశారు. మొన్నటి పై లీన్‌ తుపానుకు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో కొబ్బరి, జీడిమామిడి తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయని, మత్స్యకారులు కూడా నష్టపోయారన్నారు. ప్రస్తుత వర్షాలకు కూడా మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉందని వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వర్షాల కారణంగా వరంగల్‌ లాంటి కొన్ని మార్కెట్‌ యార్డులలోని పొగాకు, పత్తి, మొక్కజొన్న నిల్వలు భారీగా నీటిపాలైపోయాయని కొణతాల ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాలో 75 వేల ఎకరాల్లో పత్తిపంట నాశనమైపోయిందని ప్రాథమిక అంచనాల్లో తెలిసిందన్నారు. గుంటూరు జిల్లాలో లక్ష ఎకరాల్లో నీరు నిలిచిపోవడంతో టమాటో, చిక్కుడు, బెండ లాంటి పంటలు నష్టపోయాయన్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ, కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో 40 క్వింటాళ్ళ పత్తి పూర్తిగా నీట మునిగి పాడైపోయిందన్నారు. వైయస్ఆర్‌ కడపజిల్లాలో సుమారు 6 కోట్ల రూపాయల విలువైన వేరుసెనగ పంట నష్టం జరిగిందన్నారు. అలాగే కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్లలో ఉంచిన వ్యవసాయ ఉత్పత్తులు వర్షాలకు దెబ్బతిన్నాయని తెలిపారు.

ముంపు ప్రాంతాల్లో శ్రీ జగన్‌ పర్యటన :
కోర్టు అనుమతి ఇస్తే.. ముంపు ప్రాంతాల్లో పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటిస్తారని, ముంపు బాధితులను పరామర్శిస్తారని కొణతాల ప్రకటించారు. ఒక వేళ కోర్టు అనుమతి రాకపోతే.. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పర్యటనకు వెళతారని తెలిపారు.

Back to Top