సిబిఐ‌ తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫైర్

చంద్రబాబును రక్షిస్తున్న కాంగ్రెస్‌, సిబిఐ
'ఎమ్మార్‌'కు భూకేటాయింపులపై అనుమానాలు
వైయస్‌ కుటుంబం టార్గెట్‌గా సిబిఐ పనిచేస్తోంది
కోనేరు ప్రసాద్‌, స్టైలిష్‌ రంగారావులను ఎందుకు వదిలింది
జగన్‌తో దూరపు సంబంధం వల్లే సునీల్‌రెడ్డిని దోషిగా నిలబెట్టింది
ప్రభుత్వానికి తీవ్ర నష్టం వచ్చేలా చంద్రబాబు చేశారు
హైదరాబాద్, 17 సెప్టెంబర్‌ 2012: ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు ముగించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుమ్మెత్తిపోసింది. సిబిఐ దర్యాప్తు వ్యవహారం, మూడు చార్జిషీట్ల రూపొందించిన విధానం చూస్తుంటే అది కొందరినే లక్ష్యంగా చేసుకొని, కొందరిని రక్షించాలన్న ముందస్తు నిర్ణయంతో పనిచేసినట్లు స్పష్టమవుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె సిబిఐ తీరును తీవ్రంగా ఆక్షేపించారు.
 ఎమ్మార్ ప్రాపర్టీ‌స్ కేసులో సిబిఐ అసలు దోషులను వదిలివేసిందని‌ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎమ్మార్ ప్రాపర్టీ‌స్కు భూములు కేటాయించడం రియ‌ల్ ఎస్టే‌ట్ వ్యాపారాన్ని తలపిస్తోందన్నారు. కాంగ్రె‌స్ ప్రభుత్వాన్ని, చంద్రబాబుని సిబిఐ రక్షించిందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగన్మోహన్‌రెడ్డిని బదనామ్ చేసే విధంగా సిబిఐ వ్యవహరించిందని ఆరోపించారు. ‌యెల్లో మీడియాకు లీకులు ఇవ్వడం తప్ప సిబిఐ చేసింది ఏమీ లేదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఎమ్మార్‌ కేసులో సిబిఐ వేసిన చార్జిషీట్ల తలవంపులని, సిగ్గుచేటు అని పద్మ అభివర్ణించారు. 2000 సంవత్సరం నుంచి ఎమ్మార్‌ వ్యవహారాలపై సిబిఐ ఎందుకు దృష్టిపెట్టి దర్యాప్తు చేయలేదని ఆమె నిలదీశారు. దివంగత వైయస్‌ఆర్‌ కుంటుంబంతో ఎక్కడో దూరపు సంబంధం ఉందన్న ఒకే ఒక్క నెపంతో సునీల్‌రెడ్డిని దోషిగా చూపించేందుకు సిబిఐ తెగబడిందని ఆమె దుయ్యబట్టారు.
ఎమ్మార్‌ విల్లాల కుంభకోణం సూత్రధారి చంద్రబాబును, పాత్రధారులు కాంగ్రెస్‌ పెద్దలను వదిలేసిందని ఆరోపించారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు అతి చౌకగా ముందు 200 ఎకరాలు కేటాయించి అనంతరం ఒక్క నోట్‌ ఫైల్‌తో 535 ఎకరాలకు చంద్రబాబు పెంచేసిన విషయాన్న సిబిఐ ఎందుకు ప్రశ్నించి దర్యాప్తు చేయలేదని పద్మ నిలదీశారు.‌ హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న భూమిని ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు ఎకరం కేవలం రూ. 29 లక్షలకు ధారాదత్తం చేసిన వైనాన్ని సిబిఐ పట్టించుకోలేదేమని ఆమె నిప్పులు చెరిగారు. ఆ భూమికి అత్యంత సమీపంలోనే చంద్రబాబు అంతకు ముందే ఎకరం కోటి రూపాయలకు విక్రయించిన విషయాన్ని పద్మ గుర్తుచేశారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం కలిగించిన వారిని ఎందుకు రక్షించేందుకు సిబిఐ యత్నిస్తోందని ప్రశ్నించారు.
ఈ భూముల విషయంలో 2000 సంవత్సరంలో ఎపిఐఐసి ఒక నోటిఫికేషన్‌ ఇచ్చిందని, మళ్ళీ 2001లో మరో నోటిఫికేషన్‌ ఇచ్చిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. రెండోసారి నోటిఫికేషన్‌కు పలు సంస్థలు బిడ్లు వేశాయన్నారు. ఎమ్మార్‌ సంస్థకే భూమిని అప్పనంగా దోచిపెట్టడానికి మిగిలిన సంస్థలకు ఇతర పనులు అప్పగించిన విషయాన్ని ఆమె వెల్లడించారు. ప్రభుత్వానికి లాభం వచ్చే చోట్ల వాటాలను ఎందుకు తగ్గించారని, నష్టం కలిగే చోట్ల ఎందుకు ఎక్కువ వాటాలు కేటాయించారన్న అంశంపై సిబిఐ నిలదీయలేదేమని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడికి కోనేరు ప్రసాద్‌ అత్యంత సన్నిహితుడు, బినామీ అన్నది జగమెరిగిన సత్యమే అని పద్మ అన్నారు. 2004 ఎన్నికలకు ముందే అత్యంత ఎక్కువగా లాభం పొందాలనే చంద్రబాబు ఎమ్మార్‌ భూముల కుంభకోణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇంత పెద్ద కుంభకోణానికి చంద్రబాబు తెరతీసే థర్డ్‌ పార్టీ కొలాబరేషన్‌ ఒప్పందానికి బాబు పాల్పడినా సిబిఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని పద్మ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడ బయటికి వచ్చినా సిబిఐ పట్టించుకోకపోవడాన్ని ఆమె తూర్పారపట్టారు. ఎమ్మార్‌ భూములను కోనేరు ‌ప్రసాద్, స్టైలిష్‌ రంగారావు ద్వారా గజం 5 వేలకు విక్రయించినట్లు రికార్డుల్లో చూపించి మిగతా సొమ్మంతా చంద్రబాబు దోచుకున్నారని పద్మ ఆరోపించారు. అలాంటి చంద్రబాబుకు సిబిఐ రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ఎమ్మార్‌ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులను విడిచిపెట్టి జగన్మోహన్‌రెడ్డిని ఇరుకున పెట్టాలని సిబిఐ ఎందుకు ఉత్సాహం చూపుతోందని వాసిరెడ్డి పద్మ నిలదీశారు.
ఒక్కరి చేతయినా సర్టిఫికెట్‌ ఇప్పించగలరా? :
రెండున్నర ఎకరాల ఆసామి ఇన్నివేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం సక్రమమే అని టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కుంటుంబ సభ్యులు ఒక్కరి చేత అయినా సర్టిఫికెట్‌ ఇప్పించాలని చంద్రబాబు నాయుడిని వాసిరెడ్డి పద్మ సవాల్‌ చేశారు. గతంలో కోట్ల రూపాయల విలువ ఉన్న అస్తులు ఇప్పులు లక్షల్లోకి ఎలా వచ్చాయని చంద్రబాబును ఆమె నిలదీశారు. రెండున్నర ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉంటూ ఇన్ని వేల కోట్లు ఏ విధంగా సంపాదించారని ప్రశ్నించారు. అందుకే మీ అస్తులు సక్రమమైనవే అని మీ సొంత తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేత గాని, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి చేత గాని, బావమరిది హరికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి గాని సర్టిఫికెట్‌ ఇప్పించగలరా అని ఆమె నిలదీశారు. 
ఎవరడిగారని మీరు మీ ఆస్తులను ప్రకటించారని పద్మ అన్నారు. మీరిచ్చిన ఆస్తుల వివరాల్లోని తేడాలను సాక్షి మీడియా ద్వారా మేం బయట పెడితే మీ వంది మాగధుల చేత అవాకులు చెవాకులు మాట్లాడించడం తగదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఇలా చవకబారు ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజలకు దూరమైన బాబు టివి కెమెరాలకు దగ్గరయ్యారని, నిరంతరం అబద్ధాలు మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.  వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆస్తుల లెక్క కావాలంటే చంద్రబాబు స్వయంగా వస్తే చూపిస్తామన్నారు. చంద్రబాబు 2004లో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ కరె‌క్టా? లేక తాజాగా ప్రకటించిన ఆస్తులు నిజమో సమాధానం చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు.
Back to Top