'సహకార' అక్రమాలపై దర్యాప్తునకు డిమాండ్

‌హైదరాబాద్‌, 3 జనవరి 2013: సహకార సంఘాల ఓటర్ల నమోదులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. పాత తేదీలతో సహకార సంఘాల ఓటర్లను నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సొంత జిల్లాలో ఈ అక్రమాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించింది. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికలను స్వతంత్ర ఎన్నికల సంస్థ నిర్వహించిన తీరులోనే సహకార ఎన్నికలు కూడా నిర్వహించాలని పార్టీ సలహాదారు, కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ. సోమయాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‌సహకార సంఘాలను కాంగ్రెస్‌, టిడిపిలు నిర్వీర్యం చేస్తున్నాయని సోమయాజులు దుమ్మెత్తిపోశారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కైపోయి కొన్ని సంఘాలు మేం పంచుకుంటాం, కొన్నింటిని మీరు పంచుకోండనే విధానం అవలంబిస్తున్నాయని ఆరోపించారు. సహకార సంఘాల ఓటర్ల నమోదులో సర్కార్ అక్రమాలకు పాల్పడుతున్న‌దని సోమయాజులు ఆరోపించారు.

సాధారణ ఎన్నికల్లో జరిగే ఓటింగ్‌లో పది శాతం కూడా సహకార సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ ఉండబోదని, వాటిలో గెలిచినా, గెలవక పోయినా పార్టీలకు పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా కాంగ్రెస్‌, టిడిపిలు తుది గడువు దాటిపోయినా విపరీతంగా ఓటర్లను చేర్పించుకుంటున్నాయని సోమయాజులు ఆరోపించారు. సహకార సంఘాల ఓటర్ల జాబితా ప్రకటించకపోవడమే ఇలాంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం ఇస్తోందన్నారు. మోసాలు జరుగుతున్నాయి కాబట్టి సహకార ఎన్నికలను రద్దుచేయాలని తాము కోరుకోవడం లేదని, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని, అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ అర్హులకు ఓటు హక్కు కల్పించాలని మాత్రమే వైయస్‌ఆర్‌సిపి డిమాండ్‌ చేస్తున్నట్లు సోమయాజులు వివరించారు. సహకార సంఘాల ఓటర్ల నమోదు ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ప్రతి రోజూ పత్రికల్లో, మీడియాలో కోకొల్లలుగా వార్తలు, కథనాలు వస్తూనే ఉన్నాయన్నారు. వాటిని గవర్నర్‌ కార్యాలయం సిబ్బంది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారని ఆయన తెలిపారు.

రాజీవ్‌ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోనే అధికారంలో ఉందని సోమయాజులు వ్యాఖ్యానించారు. అయితే, రెండేళ్ళుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేయడం సరికాదని ఆయన విమర్శించారు. ఏవేవో సాకులు చూపించి మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సోమయాజులు ఆరోపించారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సహకార సంఘాల ఎన్నికలను కూడా స్వతంత్ర సంస్థ ద్వారా నిర్వహించాలని రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్పష్టం చేస్తున్నా దాన్ని పక్కన పెట్టి గడువు దాటిపోయినా ఓటర్ల నమోదు ప్రక్రియను కాంగ్రెస్‌, టిడిపిలు దొంగచాటుగా చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికీ పలు చోట్ల సహకార సంఘాల మాజీ అధ్యక్షులు కార్యాలయాలకు వస్తూనే ఉన్నారని, వారి అదుపాజ్ఞలలోనే కార్యాలయం సిఇఓలు, సిబ్బంది విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొన్నదని సోమయాజులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత పాలక వర్గాలకు చెందిన వారంతా కార్యాలయాల్లో తిష్ట వేసి, ఓటర్ల నమోదును నియంత్రిస్తున్నారని, దీనితో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు.

ఓటర్ల నమోదు గడువు ముగిసిపోయి చాలా రోజులు అయినా ఈ రోజుకూ వారు రహస్యంగా నమోదు కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. సహకార సంఘాల ఓటర్ల జాబితా ప్రకటించకపోవడమే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. గడువు ముగియడానికి ఒక రోజు ముందు 10 లక్షల మంది ఓటర్లను నమోదు చేసినట్లు చూపిస్తున్నారని, నమోదు కొనసాగిస్తుండడంతో అనర్హులతో ఓటర్ల జాబితా మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సోమయాజులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కవులు రైతులు ఎక్కువగా ఉంటారన్నారు. అయితే, కాంగ్రెస్‌, టిడిపి కుట్రల ఫలితంగా మిగతా జిల్లాల్లోనే ఎక్కువ మంది కవులు రైతులు ఉన్నట్లు నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
Back to Top