ప్రజా సమస్యలపై వైయస్‌ఆర్‌సిపి మరో యాత్ర

హైదరాబాద్, 10 అక్టోబర్‌ 2012: ప్రజా సమస్యలపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతలు ప్రజ‌లతో మమేకమై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను పూర్తిచేసే దిశగా ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కొణతాల మీడియా సమావేశంలో మాట్లాడారు. వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం 40 మంది వరకూ తమ తమ అభిప్రాయాలు వెల్లడించారన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్‌, భూమా నాగిరెడ్డి కూడా పాల్గొన్నారు.

పాదయాత్రకే ఎక్కువ మంది మొగ్గు:
సమావేశంలో మాట్లాడిన వారిలో ఎక్కువ మంది ప్రజాసమస్యలపై పాదయాత్ర చేయాలని సూచించారని కొణతాల రామకృష్ణ తెలిపారు. మధ్యలో నిలిచిపోయిన ఓదార్పు యాత్రను కొనసాగించాలని మరి కొందరు అభిప్రాయపడ్డారని, బస్సు యాత్ర చేయాలని కూడా కొందరు అభిప్రాయపడ్డారన్నారు. ఢిల్లీ వెళ్ళి పార్లమెంటు భవనం ముందు నిరసనలు తెలపాలని మరి కొందరు సూచించారని ఆయన చెప్పారు. వైయస్‌ కుటుంబ సభ్యులలో ఒకరు పాదయాత్ర చేస్తే బాగుంటుందని కొందరు సూచించినట్లు తెలిపారు. అయితే, పాదయాత్రపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. యాత్ర చేస్తే ఎక్కడ నుంచి చేయాలి, ఎలా చేయాలనే అనేది గురువారం నిర్వహించే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. నేటి సమావేశంలో వచ్చిన అన్ని సూచనలను క్రోడీకరించి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితో చర్చించిన తరువాత యాత్రలో ఎవరు పాల్గొనాలనే దానిపైన కూడా ఒక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

పాదయాత్ర అంటే ముందుగా గుర్తుకు వచ్చే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలా చేయాలన్నది తమ పార్టీ నిర్ణయం అన్నారు. అది ఇడుపులపాయ నుంచి ప్రారంభించాలని సమావేశంలో కొందరు సూచించారని కొణతాల పేర్కొన్నారు. కొందరు చేవెళ్ళ నుంచి మొదలుపెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారన్నారు. పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆరోగ్యం దృష్ట్యా విజయమ్మను చేయవద్దని తామంతా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశామన్నారు.

పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై చర్చించినట్లు కొణతాల రామకృష్ణ చెప్పారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల మీద, ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయకుండా తప్పించుకు తిరుగుతున్న టిడిపి విషయంపైనా చర్చించామన్నారు. ముఖ్యంగా రైతులకు విత్తనాలు, ఎరువులు తదితరాలు అందించి సకాలంలో పనులు చేసుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించడంలేదని ఆయన ఆరోపించారు. అదే వైయస్‌ హయాంలో అన్నదాతలకు కల్పించిన సౌకర్యాల గురించి వివరించేందుకు రైతులతో కలిసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు కొణతాల తెలిపారు.‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి 9 గంటలు ఉచితంగా విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తే ప్రస్తుత ప్రభుత్వం 7 గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశ్రమల ప్రొడక్షన్‌ హాలిడే :
అన్నదాతలు 'క్రాప్‌ హాలిడే' ప్రకటించిన మాదిరిగానే విద్యుత్‌ సరఫరా లేక చిన్న చిన్న పరిశ్రమల యజమానులు 'ప్రొడక్షన్‌ హాలిడే' ప్రకటించాల్సిన దుస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. చివరికి చిన్న పరిశ్రమల యజమానులు కార్మికులుగా కూడా మారిపోయిన వైనం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు విలయతాండవం చేస్తుంటే, అన్ని రంగాలలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. 'రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్న చందం'గా కిరణ్‌ తీరు ఉందని కొణతాల దుయ్యబట్టారు. ఇక రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దానికదే పరిష్కారం అవుతుందిలే అన్న నిర్లిప్త ధోరణిలో సిఎంలో పెరిగిపోయిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌ చేయకుండా లక్షలాది విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన దుస్థితిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిందని కొణతాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రధాన ప్రతిపక్షం దారుణంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. చివరికి తక్కువ నిధులతో పనులు చేస్తే పూర్తయి, మరికొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పథకాలను కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా పక్షంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ సమస్యలన్నింటిపైనా ప్రజాపోరాటం చేయాలని తమ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు ప్రకటించారు. మహానేత వైయస్‌ రూపొందించి అమలు చేసిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, ఫీజు చెల్లింపు లాంటి అనేక ప్రజా ప్రయోజన పథకాలను నీరుగారుస్తున్న కిరణ్‌ ప్రభుత్వం తీరుపై ప్రజల్లోకి వెళ్ళి వారితో మమేకమై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నప్పటికీ పార్టీ నాయకులు, శ్రేణులంతా నిరంతరం ప్రజల మధ్యే ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఎప్పటికప్పుడు తమకు పిలుపునిస్తున్నారని కొణతాల వివరించారు.

జగన్‌ ప్రభంజనం ముందు వారి ఆటలు సాగవు:
జగన్‌ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌, టిడిపిలకు నూకలు చెల్లాయని కొణతాల వ్యాఖ్యానించారు. అందుకే జగన్‌ బయట ఉంటే తమ ఆటలు సాగవన్న భయంతోనే ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై ఆయనను జైలులో పెట్టించాయన్నారు. జగన్‌ను జైలుకు పంపించి ఒకరు పాదయాత్ర అంటూ, మరొకరు ఇందిరమ్మ బాట అంటూ ప్రజలను ఏమార్చడానికి బయలుదేరారన్నారు.‌ వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 192 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఎన్‌డిటివి సర్వేలో తేలిన విషయాన్ని కొణతాల ఉటంకించారు. అందుకే జగన్‌ను ప్రజల మధ్య నుంచి దూరం చేశారని ఆరోపించారు. దానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిబిఐని అస్త్రంలా ప్రయోగించిందని నిప్పులు చెరిగారు. ఒకే కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారి పట్ల ఒకలా లేని వారి విషయంలో మరొకలా వ్యవహరిస్తోందన్నారు.

కాంగ్రెస్‌కు, టిడిపికి ఒకే అధిష్టానం:
మన రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో ఒకే అధిష్టానం ఉందని, అది కాంగ్రెస్‌ అధిష్టానం కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్‌ను బయటికి రానివ్వకుండా పాదయాత్రలు, ఇందిరమ్మబాటలు నిర్వహించుకుంటున్న టిడిపి, కాంగ్రెస్‌ పార్టీల తీరును తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థ మీద తమకు అచంచలమైన విశ్వాసం ఉందని, జగన్మోహన్‌రెడ్డికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

విజయమ్మ పిలుపు :
ప్రజా సమస్యలపై పార్టీ నిత్యం పోరాటాలు చేయాలని విస్తృత సమావేశానికి అధ్యక్షత వహించిన విజయమ్మ పిలుపునిచ్చారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కొణతాల సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని తాము నమ్ముతున్నామని, అందుకే కార్యక్రమాలు ఎలా నిర్వహించాలన్న అంశంపై అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటున్నామని మరో ప్రశ్నకు బదులిచ్చారు.

ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నాయకుడన్న వాడికి ఎలా సహాయం చేయాలన్న నిర్ణయం మనసులోంచి నిజాయితీగా రావాలని కొణతాల అన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయననే అడిగి తెలుసుకుంటే మంచిదని అన్నారు. ప్రజలతో ఎలా నటించాలి అన్న విషయంలో సినిమా వాళ్ళ సలహాలు తీసుకుని పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో చెప్పకనే చెబుతోందని అన్నారు.

జగన్మోహన్‌రెడ్డి ముందే చెప్పారు :
వచ్చే మూడేళ్ళూ చాలా గడ్డుకాలం అని, కష్టాలు, నష్టాలను భరించే వారే తనతో కలిసి రావచ్చని పార్టీని పెట్టినప్పడే జగన్మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారని ఒక విలేకరి ప్రశ్నకు కొణతాల సమాధానం చెప్పారు. ప్రజా సమస్యలే తమ పార్టీ చేపట్టబోయే యాత్రకు ప్రధాన ఎజెండా అని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు భూముల పందేరంపై ముందుగానే విచారణ చేయించి ఉండేదన్నారు. ఈ విషయమై విజయసాయిరెడ్డి, ఎబికె ప్రసాద్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన తరువాత ఆ క్రెడిట్‌ను తాను పొందాలన్న ఉద్దేశంతోనే అనంతరం విచారణకు ముందుకు వచ్చిందన్నారు. రాబర్ట్‌ వాద్రా వ్యవహారంపైన కూడా తమ పార్టీ విస్తృత సమావేశంలో చర్చకు వచ్చిందని, అయితే, ఎలాంటి తీర్మానమూ చేయలేదని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. జగన్‌ విషయంలో ఒక న్యాయం, రాబర్ట్‌ వాద్రా విషయంలో ఒక న్యాయం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి సొమ్ములు వారి వారి పేర్ల మీదనే వాటాలుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
Back to Top