హైదరాబాద్, 5 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, బెయిల్‌పై రివ్యూ పిటిషన్ వేస్తామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐ ఒక్కటయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని, కేవలం రాజకీయ కుట్రలతో ఆయనను ఇబ్బందులు పెడుతున్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అంబటి హెచ్చరించారు. జగన్‌కు బెయిల్ రావడానికి ఒక్కరోజు ముందు టీడీపీ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టే ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలకు స్పష్టంగా తెలిసిందన్నారు. ఏది ఏమైనా సరే పార్టీ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుందని అంబటి పేర్కొన్నారు. ఈ రోజు జగన్‌కు బెయిల్ రాలేదని పార్టీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. సోనియా గాంధీని ధైర్యంగా ఎదుర్కొనేందుకే జగన్ ముందుకు వచ్చారని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మహానేత వైయస్ అడుగుజాడల్లో ముందుకు సాగుతూనే ఉంటామని అన్నారు.
శుక్రవారంనాడే జగన్మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందని వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు, న్యాయవాదులు ఇలా ప్రతి ఒక్కరూ ఎదురుచూశామని అంబటి తెలిపారు. 132 రోజుల తరువాత జగన్ బయటికి వస్తున్నారని అందరూ ఆతృతగా ఉన్నారన్నారు. అయితే, ఆయన బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వస్తుందన్న ప్రతిసారీ టిడిపి, సిబిఐ ఏదో ఒక గందరగోళం సృష్టిస్తున్నాయని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సిబిఐ తన న్యాయవాదిని మార్చి విచారణను వాయిదా వేసిందన్నారు. సిబిఐ తన న్యాయవాదిని మార్చడాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ - కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయంటూ తనకు వత్తాసు పలికే పత్రికల ద్వారా ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.
సుప్రీంకోర్టులో శుక్రవారం వచ్చింది అంతిమ తీర్పు కాదని అంబటి పేర్కొన్నారు. ఇది కేవలం జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌కు సంబంధించింది మాత్రమే అన్నారు. అసలు కేసులో ఆయన నిర్దోషిగా బయటికి వస్తారని ధీమా వ్యక్తంచేశారు. మార్చి వరకూ మరోసారి బెయిల్ పిటిషన్ వేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందని, అప్పటి వరకూ పార్టీని ఎలా నడిపిస్తారని ఓ పత్రికా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాంబాబు సమాధానం ఇస్తూ, ఇంతవరకూ జగన్ జనంలోనే ఉన్నారన్నారు. ఆయన జైలులో ఉన్నా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో మరింత ధైర్యంగా ముందుకు నడిపిస్తామన్నారు. దివంగత మహానేత వైయస్ తమ అందరికీ అదే నేర్పారని చెప్పారు. కాంగ్రెస్, టిడిపి కుట్రలను తిప్పికొట్టే వరకూ పార్టీ నాయకులు, శ్రేణులు మరింత ఐకమత్యంతో పోరాటం చేస్తామన్నారు.
జగన్మోహన్‌రెడ్డి జనంలో ఉంటే తమకేదో అయిపోతుందన్న భయంతోనే ఆ రెండు పార్టీలూ ఏకమై జైలులో పెట్టించాయని అంబటి నిప్పులు చెరిగారు. ఆయనను లోపల పెట్టించి పాదయాత్రలు, ఇందిరమ్మబాటలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మారని మనిషి అని, ఆయన ఎన్ని యాత్రలు చేసినా ఓట్లు రాలే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. నక్కజిత్తుల చంద్రబాబు గురించి ఈ రాష్ట్ర ప్రజలకు చాలా బాగా తెలుసని అందుకే మాటి మాటికీ ఆయనను, ఆయన పార్టీని తిరస్కరిస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు.
చిదంబరాన్ని నిన్ననే టిడిపి ఎంపిలు ఎందుకు కలిశారు? ఆ వెంటనే ఈడీ ఎందుకు నోటీసులిచ్చింది? అని ఆయన నిలదీశారు. ఇదంతా జగన్‌కు బెయిల్ రానివ్వకుండా చేస్తున్న కుట్రే అన్నారు. దీనికి కాంగ్రెస్, టిడిపి, సిబిఐ, ఈడీ సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.