చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన

హైదరాబాద్, 13 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనపై కేంద్రాన్ని తొందరపెట్టింది చంద్రబాబు నాయుడే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆయన ఆరోపించారు. సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ టిడిపి ఉండాలన్న స్వార్థంతోనే చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని తూర్పారపట్టారు. చంద్రబాబుది అంతా కపట నాటకం అన్నారు. వెన్నుముకలు లేని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడి అసమర్థత వల్లే రాష్ట్రంలో ప్రస్తుత దౌర్భాగ్య పరిణామాలకు చంద్రబాబే కారణం అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని నాని డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు.

ఇరు ప్రాంతాలకూ అన్యాయం జరగకూడదన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానం అని నాని అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్లీనరీలో కానీ, మూడవసారి జరిగిన అఖిలపక్షంలో కాని, ఇప్పుడు కానీ తమ పార్టీ చెప్పిందొకటే అన్నారు. ఒక తండ్రి స్థానంలో ఉండి ఇరు ప్రాంతాలకూ అన్యాయం జరగని విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పిందన్నారు. అలా చేయలేని పక్షంలో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని, ప్రస్తుత పరిస్థితినే యథాతథంగా కొనసాగించమని కోరిందన్నారు.

రాష్ట్ర విభజన ప్రకటన జూలై 3౦న వెలువడుతుందని తెలిసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు అదే నెల 25నే తమ పదవులకు రాజీనామాలు చేసిన వైనాన్ని కొడాలి నాని గుర్తుచేశారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలచుకున్నారో ముందుగా ప్రకటించి ఆ తరువాతే నిర్ణయం తీసుకోండని కోరారన్నారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు కూడా లేఖలు రాసి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారన్నారు. తొందరపడి కాంగ్రెస్ తీసుకున్న‌నిర్ణయం కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారుతున్నాయని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకోవద్దని ఈ నెల 5న వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి‌ రాజీనామా చేశారన్నారు. కాంగ్రెస్‌ తొందరపాటు నిర్ణయం వల్ల సీమాంధ్రులకు నీరు, రాజధాని విషయంలో అన్యాయం జరుగుతోందని, ఆ ప్రాంతాల వారంతా ఆందోళనలు చేస్తున్నారని ఈ నెల 10వ తేదీన శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేశారన్నారు.

ఆ రోజున వారు రాసిన లేఖను చంద్రబాబునాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పట్టుకువచ్చి కాపీరాయుడి లాగా అవే మాటలు మీడియా సమావేశంలో చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితు రావడానికి రాజకీయ ప్రయోజనాలు ఆశించిన చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే అని కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర నినాదంతో 2004లో ఎన్నికలకు వెళ్ళిన వైనాన్ని నాని గుర్తుచేశారు. అనంతరం అధికారంలో ఉన్న వైయస్ఆర్‌ను పదవి నుంచి దింపేయడానికే టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని, తెలంగాణకు తాము అనుకూలం అని కేంద్రానికి లేక ఇచ్చారన్నారు. తరువాత తెలంగాణ ఇస్తామని డిసెంబర్‌ 9న కేంద్రం ప్రకటిస్తే.. అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం వల్ల సీమాంధ్రలో ఆందోళనలు వచ్చాయని పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించారన్నారు. తాము తెలంగాణకు అనుకూలం అని మళ్ళీ మాట మార్చారన్నారు.

గత ఏడాది అక్టోర్‌ 2 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుని తెలంగాణపై ఆయన విధానం ఏమిటని తెలంగాణ ప్రజలు అడుగుతారని దానిని తప్పించుకునేందుకే ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి సెప్టెంబర్‌ 27న ఒక లేఖ రాశారని నాని తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తే.. దానిలో తమ పార్టీ నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతామని ఆ లేఖలో పేర్కొన్నారన్నారు. చంద్రబాబును నమ్మి కేంద్రం అఖిలపక్ష సమావేశం పెడితే.. 'మీరు తెలంగాణను విడగొట్టండి.. మేం కట్టుబడి ఉన్నాం. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరు రెండు రాష్ట్రాలు చేసినా మా పార్టీ స్వాగతిస్తుంది. తెలంగాణపై చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలి' అని అఖిలపక్షానికి చంద్రబాబు పంపిన లేఖలో రాశారన్నారు.

రాష్ట్ర విభజనపై జూలై 30న తెలంగాణపై అడ్డగోలు నిర్ణయం వస్తే.. మరుసటి రోజు 31 వ తేదీ మధ్యాహ్నం వరకూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి 4, 5 లక్షల కోట్లు ఇస్తే హైదరాబాద్‌ను మించిన రాజధానిని సీమాంధ్రలో కడతానని చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుజాతి ఉంటుందని, రెండు చోట్లా తమ పార్టీ ఉంటుందని చంద్రబాబు చెప్పిన ప్రెస్‌మీట్‌ క్లిప్పింగ్‌ను నాని మీడియాకు ప్రదర్శించి చూపించారు. తరువాత శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారు రాసిన లేఖను పట్టుకువచ్చి దానిలోని అంశాలనే ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పారని ఆక్షేపించారు. తాను చేసిన తప్పులను చంద్రబాబు నాయుడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మీద, ఇతర పార్టీల మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల ముందు టిఆర్ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది.. ఎన్నికలైపోయాక వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కలుస్తుందంటూ చంద్రబాబు ఈ రోజు మీడియా సమావేశంలో రాజకీయ ఉపన్యాసం చేశారని తప్పుపట్టారు. సీమాంధ్రలోని ఉద్యోగ సంఘాలు, విద్యార్థి, వ్యాపార సంఘాలు ఉధృతంగా ఉద్యమిస్తున్న తరుణంలో ఏమి చేయాలో తోచక మంగళవారం మీడియా సమావేశం పెట్టినట్లు చంద్రబాబు మాటల్లోనే స్పష్టం అయిందన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మీద, డాక్టర్‌ రాజశేఖరరెడ్డి మీద, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మీద విషం కక్కే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు కాపీ కొట్టడం బాగా అలవాటనీ.. గతంలో రాజశేఖరరెడ్డిగారు ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి ఇప్పుడు తానూ ఉచిత విద్యుత్‌ ఇస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాలను తాను చేస్తానంటూ చెబుతున్నారని అన్నారు.

హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని కొడాలి నాని తప్పు పట్టారు. '1998లో ఆయన మెట్రో రైలు తీసుకువచ్చారట. సంవత్సరం క్రితమే మెట్రో రైలుకు శంకుస్థాపన జరిగిన విషయాన్ని నాని ప్రస్తావించారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తానే కట్టించానని చంద్రబాబు చెబుతున్నారని.. దానికి శంకుస్థాపన చేసిందీ ఆయన కాదని, ప్రారంభోత్సవం చేసిందీ ఆయన కాదన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకూ చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని, ప్రారంభించలేదన్నారు. ఈ 60 ఏళ్ళలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన వారిలో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాత్రే ఎక్కువగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలోని అందరూ బాగుండాలన్న సదుద్దేశంతో సుమారు 80 ప్రాజెక్టులకు వైయస్ఆర్‌ రూపకల్పన చేసి పనులు ప్రారంభించారన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి సింగపూర్, మలేసియా రోడ్లపై తిరిగానని  చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని కొడాలి నాని తప్పుపట్టారు. ఆయన ఆ దేశాల రోడ్ల మీద తిరగకుండా రాష్ట్రంలోని గ్రామాల్లో తిరిగి ఉంటే ప్రస్తుత విభజన సమస్య వచ్చి ఉండేదే కాదన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన విధానాలు నచ్చక ఆయన శిష్యుడు కేసీఆర్‌ బయటికి వెళ్ళి తెలంగాణ సమస్యను తీసుకువచ్చారని, ఆ తరువాత టిడిపిలో నెంబర్‌ 2 గా ఉన్న దేవేందర్‌గౌడ్‌ కూడా బయటికి వెళ్ళి మరింతగా ఈ సమస్యకు ఆజ్యం పోశారని నాని తెలిపారు.
ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయమని గాని, కలిపి ఉంచమని కానీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పలేదని కొడాలి నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యను ఇద్దరికీ అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా పరిష్కరించాలని కోరామన్నారు. ఇరు ప్రాంతాల వారి సమస్యలను వినేందుకు ఒక కమిటీ వేసి, చర్చించి ఇద్దరికీ సామరస్య పూర్వకమైన వాతావరణంలో నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో యథాతథంగా కొనసాగించమని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. ఎన్టీఆర్ గాని, మహానేత వైయస్ఆర్‌ గాని బ్రతికి ఉంటే విభజనపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీకి వెన్నులో వణుకు పుట్టేదని నాని అన్నారు. ఏమి చేసినా ఈ అసమర్థ నాయకులు నోరు మూసుకుని పడి ఉంటారనే కాంగ్రెస్‌ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని అన్నారు.

ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలచుకున్నారు? కలిపి ఉంచదలచుకున్నారా? విడగొట్ట దలచుకున్నారా? సీమాంధ్రులకు ఏమి అన్యాయం జరుగుతోంది? దాని గురించి మీరేమి చేయదలచుకున్నారు? స్పష్టంగా చెప్పాలని చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డికి నాని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్ర విభజనపై జూలై 30న ప్రకటన వస్తుందని తెలిసిన చంద్రబాబు నాయుడు అంతకు ముందే రాజీనామా చేసి ఉంటే ఈ నిర్ణయం వచ్చేది కాదన్నారు.

Back to Top