కడప అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలి

హైదరాబాద్, 21 ఫిబ్రవరి 2013: ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బాహాటంగా ఖూనీ చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సహకార ఎన్నికల్లో తామే గెలిచామని, రైతులు తమ పక్షాన ఓటు వేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు భజన చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగించామని, అన్ని ఎన్నికలు నిర్వహిస్తామని వారం రోజులుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఊదరగొడుతోందని, అయితే సహకార సంఘాలకు నిర్వహించిన తీరులోనే అప్రజాస్వామిక విధానాల్లో నిర్వహిస్తారా? అని ఆయన నిలదీశారు. సహకార ఎన్నికల్లో రైతులు తమ పక్షాన ఓటు వేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారని, అయితే వారికి ఎందుకు ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు. రెండు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయనందుకు వేశారనుకుంటున్నారా? లేక ఎరువుల ధరలు 300 నుంచి 500 శాతం పెంచినందుకు వేశారనుకుంటున్నారా? తమ పిల్లలకు ఇస్తున్న ఫీజు రీయింబర్సుమెంటు తీసేసి, రైతుల కుటుంబాలను రోడ్డున పడేసినందుకు ఓటేస్తారా? అన్నది వారు తెలుసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం నాడు నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు, చంద్రబాబు వైఖరిపై తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

ఒక్కరోజులోనే దొంగచాటుగా 11 లక్షల ఓట్లను కాంగ్రెస్‌ నాయకులు ఎక్కించుకున్నారని, ఆ రికార్డులను ఎవ్వరికీ ఇవ్వకుండా వారు పాల్పడిన అక్రమాలపై గవర్నర్‌కు కూడా తాము ఫిర్యాదు చేశామని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అక్రమాలకు పాల్పడి తాము గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో డిసిసిబి చైర్మన్‌ ఎన్నిక విషయంలో బుధవారం చోటుచేసుకున్న సంఘటనలు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంతగా ఘోరాలకు పాల్పడ్డారో స్పష్టంగా తెలిసిందన్నారు. కడప సంఘటనపై రాష్ట్ర స్థాయి అధికారితో విచారణ చేయిస్తే వాస్తవాలన్నీ బయటికి వస్తాయన్నారు.

కాంగ్రెస్‌ ఎన్ని అవాంతరాలు తెచ్చినా మాదే మెజారిటీ :
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు గెలిచే అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌ నాయకులు స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. అయినప్పటికీ ఎన్నికలు జరిగిన స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులే 32 చోట్ల మెజారిటీ సంఖ్యలో విజయాలు సాధించిన విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అప్పుడు కూడా 'డీ ఫాల్టర్లు' అనే జిఓ తెచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులను అనర్హులను చేశారన్నారు. డీ ఫాల్టు కుట్ర చేసిన తరువాత కూడా మెజారిటీ తమ పార్టీ అభ్యర్థులకే ఉందన్నారు. కడప జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పాల్పడిన అక్రమాలను తాను స్వయంగా చూశానన్నారు. ఇదే విధమైన అప్రజాస్వామిక విధానాలను రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పాల్పడి సహకార ఎన్నికల్లో గెలిచామని అనిపించుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ క్షమాపణలు చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎన్నెన్ని అక్రమాలో..:
కడప డిసిసిబి చైర్మన్‌ ఎన్నిక జరగాల్సిన మంగళవారంనాడు కాంగ్రెస్‌ పార్టీ డైరెక్టర్లు గైర్హాజరై కోరం లేదనే సాకుతో వాయిందా వేయించారన్నారు. ఈ లోగా డైరెక్టర్లను ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టారన్నారు. బుధవారం తప్పకుండా చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని తామంతా ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో ఎన్నికల అధికారి డిసిఓను అపహరించి, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి రెండవ రోజునా అడ్డుపడ్డారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయిలో కమిషనర్ హామీ మేరకు గురువారం ఎన్నిక తప్పకుండా జరుగుతుందని ఆశించామన్నారు. చివరికి శాంతి భద్రతల సమస్యను చూపించి ఎన్నికను కలెక్టర్ ఈ నెల 28వ తేదీకి వా‌యిదా వేశారన్నారు. అర్ధరాత్రి స్టే తీసుకువచ్చి ఎన్నికను వాయిదా వేయించిన ఘనులు కాంగ్రెస్‌వారని దుయ్యబట్టారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమకు మెజారిటీ రాదనుకుంటే కొత్త కొత్త అడ్డదారుల్లో ఇలాంటి ట్రిక్కులు చేసే అవకాశం లేకపోలేదని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.

12 మందితో ఓటు వేయించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదా?: 
నిజానికి 12 మంది డైరెక్టర్లతో ఓటు వేయించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదా? అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తే అత్యధిక స్థానాల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులే గెలుస్తారని అన్నారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి కడప డిసిసిబి చైర్మన్‌ ఎన్నిక జరగకుండా అర్ధరాత్రి స్టే తీసుకురావడం దారుణం అని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అధికారులను భయపెట్టడం, వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తొడగొట్టి శివాలెత్తిపోవడం శాంతి భద్రతలను నిర్వహించే పరిస్థితి లేదని చెప్పడానికేనా అని నిలదీశారు. అసలు భవిష్యత్తులో ఏ ఎన్నికలనైనా నిష్పక్షపాతంగా నిర్వహిస్తారా? అనే విషయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేయాలన్నారు. అక్రమ మార్గాల్లో గెలిచామనిపించుకునే బదులు పదవులను తమకు నచ్చిన వారిని నామినేట్‌ చేసుకోవాలన్నారు. కడప డిసిసిబి చైర్మన్‌ ఎన్నిక విషయంలో జరిగిన దారుణాలపై ప్రజాస్వామ్య వాదులు, మానవవ హక్కుల వారు, మేధావులు ఆలోచన చేయాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

‌ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో పంటలకు మద్దతు ధర లేదని, ఎరువుల ధలు పెరిగాయని, విద్యుత్‌ సరఫరా సరిగా లేక వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని, దానితో లక్షలాది మంది కార్మికులు, 7 లక్షల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తీను కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయాయన్నారు. చంద్రబాబు సలహాలతో నడుస్తున్న కిరణ్‌ ప్రభుత్వం 'దుష్టపాలన - 2' గా మార్చారని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు అప్పుడు అందుకే రుణ మాఫీ చేయలేదా?:
అవినీతిని రూపుమాపితే రుణాల మాఫీ చేయవచ్చని చంద్రబాబు ఇటీవల చెబుతున్న విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంటే తన హయాంలో అవినీతి ఎక్కువగా ఉంది కనుకే రుణ మాఫీ చేయలేదా? అని నిలదీశారు. తన హయాంలో అవినీతి ఉందని ఆయన ఒప్పుకున్నట్లేనా అన్నారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన రెండు ప్రజోపయోగ హామీలనే తుంగలో తొక్కేసిన చంద్రబాబు ఇప్పుడు హామీలు ఇవ్వడంలో ఔచిత్యం ఏమి ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజారంజకంగా పరిపాల కొనసాగించారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. మనసున్న మనిషి అధికారంలో ఉంటేనే తమ కష్టాలు తీరతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమ కష్టాలు తీర్చి, రాజన్న రాజ్యాన్ని తెచ్చేది వైయస్‌ఆర్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అని వారంతా విశ్వసిస్తున్నారన్నారు.

చెప్పులు వేయించే సంస్కృతి వైయస్‌ఆర్‌సిపిది కాదు: 
ప్రత్యర్థుల కార్లపై చెప్పులు వేయించే సంస్కృతి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది కాదని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు శ్రీకాంత్‌రెడ్డి బదులిచ్చారు. కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కయ్యాయన్న విషయం పలు సందర్భాల్లో స్పష్టం అయిందని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. కడప డిసిసిబి ఎన్నిక సంఘటనపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. ముద్దాయి అని సిబిఐ నమోదు చేసినా ధర్మాన ప్రసాదరావు ఈ రోజు విధులకు ఎందుకు హాజరయ్యారని నిలదీశారు. ఒకే కేసుకు సంబంధించి‌ శ్రీ జగన్‌కు ఒక న్యాయం, ధర్మానకు మరో న్యాయమా అన్నారు. పత్రిక పెట్టిన ప్రతి ఒక్కరిపైనా సిబిఐ విచారణ చేయించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని మరో ప్రశ్నకు శ్రీకాంత్‌రెడ్డి సమాధానం చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top