కాంగ్రెస్ వైఖరి ముందే చెప్పాలి:మైసూరారెడ్డి


హైదరాబాద్, 22 డిసెంబర్ 2012:

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మొదట తన వైఖరి చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపిందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వైఖరి చెప్పనవసరంలేదని అనడం సమంజసంకాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీయేనని, తమ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని మైసూరారెడ్డి సూచించారు.

     రాష్ట్రంలోని అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మెజారిటీ ఉన్నందున మొదట ఆ పార్టీయే నిర్ణయాన్ని వెల్లడించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పార్టీలన్నీ చెప్పిన తర్వాత తమ వైఖరి చెపుతామనడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు జడ్జీలు కాదన్నారు. అవగాహన కోసమే అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శమన్నారు. గతంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాల్లో పార్టీల నిర్ణయాలు, శ్రీకృష్ణ కమిటీ నివేదికలు హోంశాఖ వద్ద ఉంటాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రులు మారినప్పుడల్లా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం మంచి పద్దతి కాదన్నారు.

     ఎఫ్‌డీఐలపై పెట్టిన తీర్మానంలో ఓడిపోకుండా కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడలో భాగంగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఎం.వి.మైసూరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులను బుజ్జగింపు కోసం ఆడిన డ్రామా అని అన్నారు. స్పష్టమైన వైఖరి చెప్పాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదని, రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను మాత్రమే అడుగుతున్నామన్నారు. ఒక వేళ కేంద్రం నిర్ణయం తీసుకుంటే పార్లమెంటుకు జవాబుదారిగా ఉండాల్సి వస్తుందన్నారు. తెలంగాణపై ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అఖిలపక్షంలో కూడా తమ వైఖరిని స్పష్టంగా చెపుతామన్నారు.

Back to Top