కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు

హైదరాబాద్, 19 జనవరి 2013: కేంద్ర మంత్రి వాయలార్‌ రవి చేసిన పొత్తు ప్రస్తావన 'వన్‌సైడ్ లవ్'! లాంటిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి అభివర్ణించారు. వందేళ్ళు దాటి, వయస్సు ఉడిగిన కాంగ్రెస్‌ పార్టీతో యువకుడైన శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో దూసుకుపోతున్నతమ పార్టీ పొత్తు కుదుర్చుకునే అగత్యం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతున్న నావలాంటిదని ఆయన అన్నారు. మునిగిపోయే పడవ మీద ఎవరైనా ఎక్కుతారా? అని ఆయన ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా వంద సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేని ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం తమకు ఎందుకు వస్తుందన్నారు. డీజిల్‌ ధరల పెంపును ఖండిస్తూ శనివారం వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌ సందర్భంగా కేంద్ర మంత్రి వాయలార్‌ రవి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయాన్ని ప్రస్తావించడంపై మీ స్పందన ఏమిటని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు మైసూరారెడ్డి పై విధంగా సమాధానం ఇచ్చారు.

వయస్సు మళ్ళిన కాంగ్రెస్‌ పార్టీకి యువకుడైన తమ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితో పొత్తు పెట్టుకోవాలని ఉన్నా ఆయన ప్రాధాన్యతలు వేరే విధంగా ఉంటాయని మైసూరా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే శ్రీ జగన్‌ సిఎం అవుతారు, కేంద్ర మంత్రిని చేస్తారన్నారు. ఆ పార్టీకి దూరమైతే అక్రమ కేసులు పెట్టి, జైలులో నిర్బంధిస్తారని ఎద్దేవా చేశారు. శ్రీ జగన్‌ను అన్యాయంగా జైలులో పెట్టి ఇప్పటికి సుమారు 8 నెలలు కావస్తోందన్నారు. ఆయనకు బెయిలు వస్తుందన్న ప్రతిసారీ సిగ్గూ ఎగ్గూ లేకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడుతోందని విమర్శించారు. శ్రీ జగన్‌ కేసులపై తాము న్యాయపరంగానే పరిష్కరించుకుంటామన్నారు.

తెలంగాణపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిందని మైసూరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీయే రెండు విధాలుగా వ్యవహరించిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులుగా వచ్చిన ఇద్దరూ తమ ప్రాంతాల అభీష్టాలకు అనుగుణంగా అభిప్రాయం చెప్పారని, చివరకు తమ పార్టీ అధిష్టానం చెప్పే అభిప్రాయానికే ఇరు ప్రాంతాల నాయకులు కట్టుబడి ఉంటామని చెప్పారన్నారు. అయితే, కాంగ్రెస్‌ అధిష్టానం గాని, యుపిఎ ప్రభుత్వం గాని ఒక అభిప్రాయం అంటూ ఇంత వరకూ వెల్లడించలేదని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ డ్రామాలు ఆడుతోందని మైసూరారెడ్డి దుయ్యబట్టారు.

కాగా, వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే జి. గుర్నాథరెడ్డి చేసిన సమైక్య వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఆయనే చెప్పిన విషయాన్ని మైసూరారెడ్డి ఉటంకించారు. గుర్నాథరెడ్డి వ్యాఖ్యలు పార్టీ వ్యాఖ్యలని తానెలా చెబుతానని మరో విలేకరి ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ నెల 28 లోగా తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అన్న విలేకరికి దానిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారు కదా అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ విషయంలో టిడిపి తెర వెనుక ఒకలా ఉంటుందని, తెర ముందు మరో నాటకం ఆడుతుందని మైసూరారెడ్డి విమర్శించారు. టిడిపికి సిగ్గుంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఆయన మరోసారి సవాల్‌ చేశారు. కేంద్రంలో లౌకక పార్టీలకు మెజారిటీ వస్తే వాటితో కలిసి పనిచేస్తామని మరో ప్రశ్నకు మైసూరా బదులిచ్చారు. అలా కాకపోతే, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Back to Top