కాలంచెల్లిన సరుకు టిడిపి: శోభా నాగిరెడ్డి

హైదరాబాద్, 1 అక్టోబర్‌ 2012: తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లిపోయిందని, రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. అదే కాలం చెల్లిన వస్తువును ఇప్పుడు మళ్ళీ అమ్మాలని అదే సేల్సుమన్‌ ప్రజల మధ్యకు వస్తున్న విధంగా చంద్రబాబు పాదయాత్ర ఉందని ఎద్దేవా చేసింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పా‌ర్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సోమవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అవసరానికో విధానం అనుసరించే చంద్రబాబు నాయుడిని చూసి రాష్ట్ర ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. మహాలయ పక్షాల్లో అందునా మంగళవారంనాడు ఎవ్వరూ కార్యక్రమాలను ప్రారంభించరని ఇలాంటి రోజుల్లో చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించాలనుకోవడమే ఆయనకు భగవంతుడు కూడా అనుకూలంగా లేడన్నది తేటతెల్లం అవుతోందని అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు.

చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీ కోసం' అంటూ రేపటి నుంచి ప్రారంభించనున్న పాదయాత్రతో రాష్ట్ర ప్రజలను భయపెడుతున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పాదయాత్ర చేసుకోవడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండబోదన్నారు. అయితే, ఆయన పాదయాత్రపై ప్రజలకు తలెత్తుతున్న పలు ప్రశ్నలు, అనుమానాలను ముందుగా నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందన్నారు. 63 ఏళ్ళ వయస్సులో గొప్ప త్యాగం చేసి తాను పాదయాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. అయితే, అంత త్యాగం చేస్తూ, ఎంతో 
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాబు సినిమా దర్శకుల నుంచి సలహాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించాలని నిలదీశారు. జనంలో ఎల కలిసిపోవాలి, వారి భుజాలపై చేతులు ఎలా వేయాలి ఇలాంటి అంశాల్లో సిని దర్శకుల డైరెక్షన్‌ను బాబు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. నాయకుడన్నవాడికి జనంతో ఎలా కలవాలి, వారి మనస్సుల్లో ఎలా స్థానం పొందాలన్నది దానంతట అదే వస్తుందని కాని సినిమా తీరులో చేస్తే వస్తుందా? అని నిలదీశారు. పాదయాత్ర అంటే మీరేమైన సినిమా తీస్తున్నామనుకుంటున్నారా అని ప్రజలనుకుంటున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు వెళ్తున్నది సినిమా తీయడానికా లేక ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికా అని ఆమె ప్రశ్నించారు.

అసలు 'వస్తున్నా... మీ కోసం' అన్నదే జనం భయపడేలా ఉందని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాట వింటేనే ప్రజలు చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో పడిన కష్టాలను గుర్తుకు తెచ్చుకుని హడలిపోతున్నారన్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన అవే విషయాలను గుర్తు చేస్తారేమో అని జనం బెంబేలెత్తుతున్నారన్నారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పినప్పుడు విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని వంకరగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తన పాదయాత్రలో అదే విషయాన్ని గుర్తు చేస్తారా అని అన్నారు. ఎన్టీ రామారావు 50 రూపాయలకు హార్సు పవర్‌ అందజేస్తే మీరు ఆ బిల్లులు పెంచేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని చెబుతారా అని నిలదీశారు. విద్యుత్‌ బిల్లులు కట్టలేని అన్నదాతల చేతులకు బేడీలు వేసిన విషయాన్ని మళ్ళీ ప్రజలకు చెప్పేందుకు పాదయాత్రకు వస్తున్నారా? అని శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. విద్యుత్‌ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కాల్పులు జరిపించి, ఇద్దరి ప్రాణాలు తీసిన మీ ఘనకార్యాన్ని జనానికి చెబుతారా అన్నారు. ఆ కాల్పుల్లో మరణించిన రైతులను కాకుండా కాల్పులు జరిపిన పోలీసులను పరామర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనంలోకి పాదయాత్ర చేస్తారని నిలదీశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులు జీతాలు పెంచమని కోరితే, ప్రతిపక్షంలో అయినా కూర్చుంటాను గానీ జీతాలు పెంచేది లేదని భీష్మించిన విషయాన్ని వారికి మరోసారి గుర్తుచేసేందుకు పాదయాత్రకు బయలుదేరుతున్నారా? అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాదయాత్ర అనగానే
తమను మళ్ళీ నిద్రపోనివ్వనని చెప్పేందుకే వస్తున్నారా అని ఉద్యోగులు ఉలిక్కిపడుతున్నారన్నారు.

కరవు - కాటకాలకు బ్రాండ్‌ అంబాసడర్ చంద్రబాబు:
మన రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు రెండు రకాల అంశాలకు బ్రాండ్‌ అంబాసడర్లుగా ప్రజలు గుర్తుంచుకుంటారని శోభా నాగిరెడ్డి అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు కరవు - కాటకాలకు బ్రాండ్‌ అంబాసడర్‌గా జనం భయపడుతుంటారని, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్షాలకు, పాడి పంటలకు బ్రాండ్‌ అంబాసడర్‌గా నిలుస్తారన్నారు. బాబు వస్తే కరవు తాండవిస్తుందని రాష్ట్ర వాసుల్లో అలజడి మొదలైందన్నారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిలా మారిపోయి గతంలో తమను చంద్రబాబు నాయుడు ఎలా ఇక్కట్ల పాలు చేసిందీ తలచుకొని తల్లడిల్లిపోతున్నారన్నారు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని 5 రూపాయలకు పెంచేయడమే కాకుండా మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబు పాదయాత్ర అంటేనే ప్రజల్లో ఆందోళన మొదలవుతోందన్నారు.

ప్రజల్లో పెల్లుబుకుతున్న ఇలాంటి అనుమానాలన్నింటికీ చంద్రబాబు పాదయాత్ర చేయాలని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఫ్యాన్‌ గుర్తు కేటాయించినప్పుడు 'ఇప్పుడు ఫ్యాన్లకు కాలం చెల్లిందని, అంతా ఏసీలదే హవా' అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని శోభా నాగిరెడ్డి గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇళ్ళల్లో ఏసీలు ఉన్నాయో, ఎంత మంది ఫ్యాన్ల గాలినే నమ్ముకొని ఉన్నారో ఈ పాదయాత్ర ద్వారా అయినా చంద్రబాబుకు స్పష్టం కావాలని శోభా నాగిరెడ్డి అన్నారు.

జగన్‌ సహజ నాయకుడు : అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి :
జనంలోంచి వచ్చిన సహజ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అని రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అభివర్ణించారు. అలాంటి జగన్‌ను ఇబ్బందుల పాలు చేయడానికే కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కయి జైలుకు పంపాయని దుమ్మెత్తిపోశారు. జనం తిరస్కరించిన కాంగ్రెస్‌ పార్టీలో కలవాల్సిన అగత్యం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టలేదన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీయే తమలో కలుస్తుందన్నారు. ప్రజలను ఎలా ఆదరించాలనేది నాయకుల మనస్సుల్లోంచి రావాలన్నారు. ప్రజలు సహజత్వాన్నే ఆదరిస్తారు. ఆస్వాదిస్తారన్న విషయం చంద్రబాబు తెలుకోవాలని హితవు పలికారు. లేక పోతే వారి చీత్కారాలే దక్కుతాయని హెచ్చరించారు.

ధరలు పెరిగిపోయి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పట్టించుకోవడంలేదని అమర్‌నాథ్‌రెడ్డి దుయ్యబట్టారు. కుర్చీని ఎలా కాపాడుకోవాలా అని కాంగ్రెస్‌ పార్టీ, అధికార పీఠాన్ని ఎలా దక్కించుకోవాలా అని టిడిపి ఎత్తులు పైయెత్తులు వేస్తున్నాయన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సమయాన్నంతా ఆ రెండు పార్టీలూ కూడబలుక్కుని వృథా చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సమస్యలనైనా పరిష్కరించాలని తమ పార్టీ చేసిన యత్నాలకు అవి అడ్డం పడ్డాయన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం రోజున చంద్రబాబు పాదయాత్ర చేయడం మంచిదే అయినా నేటి నుంచి 15 రోజుల వరకూ మహాలయ పక్షాలని, ఈ రోజుల్లో ఎవ్వరూ ఏ కార్యక్రమాన్నీ ప్రారంభించరన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో దేవుడు కూడా ఆయన పక్షాన లేడని స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు పాదయాత్ర శవయాత్ర కావచ్చు. పాడె యాత్ర కావచ్చన్నారు. ఈ విషయంలో ఆయనకు సహకరించేది శుభాలు జరిపించే పూజారులు కాదని, క్షుద్ర పూజలు చేసేవారేమో అని వ్యాఖ్యానించారు.

జగన్‌కు బెయిల్‌ వస్తుందనుకున్నప్పుడల్లా కాంగ్రెస్‌లో వైయస్‌ఆర్‌సిపి విలీనం అవుతోందని, అందుకే బెయిల్ వస్తోందంటూ టిడిపి దుష్ప్రచారం చేస్తోందని అమర్‌నాథ్‌రెడ్డి దుయ్యబట్టారు. టిడిపికి వంత పాడే కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఆ విషయాన్నే పదే పదే ప్రసారం చేస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక పక్కన టిడిపికి డిపాజిట్లు కూడా రావడం లేదు. దీనికి తమ నియోజకవర్గం రాజంపేటలో జరిగిన ఉప ఎన్నికే తాజా ఉదాహరణ అన్నారు. అత్యంత విలువైన 850 ఎకరాల భూమిని అతి చౌకగా ఐఎంజి సంస్థకు అప్పనంగా కట్టబెట్టిన చంద్రబాబు విషయంలో దర్యాప్తు చేయడానికి సిబ్బంది కొరత సాకు చూపిన సిబిఐ జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఆగమేఘాల మీద దర్యాప్తు ప్రారంభించిందని, ఆస్తులపై దాడులు చేసిందని అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకుని తప్పుకోవాలని చూడకూడదని, ధైర్యం ఉంటే విచారణకు ముందుకు వచ్చి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు. 

జగన్‌ ఒక్కడి వల్లే మహానేత వైయస్‌ఆర్‌ పథకాలు అమలవుతాయని అమర్‌నాథ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్‌, ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలను అమలు చేయాలని తానే ముందుగా అనుకున్నానని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. కాకినాడ పోర్టును మలేసియా ప్రధాని కుమారుడికి ధారాదత్తం చేసింది చంద్రబాబు కాదా? అని అమర్‌నాథ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శోభా నాగిరెడ్డి సమాధానాలు చెప్పారు. ప్రశాంతంగా ఉద్యమిస్తున్న వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆమె పోలీసుల ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఆ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో పార్టీ అభిప్రాయాన్ని ముందే స్పష్టం చేసిందని మరో ప్రశ్నకు సమాధనం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top