జగన్ సంధించిన పాశుపతాస్త్రం షర్మిల

హైదరాబాద్

7 నవంబర్ 2012 : షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాద యాత్ర గత 20 రోజులలో 93 గ్రామాల గుండా సుమారు 12 లక్షల మందితో కలిసి సాగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు షర్మిల తన పాదయాత్రలో 265 కి.మీల మేరకు నడిచారని ఆయన తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర ప్రజాహీనమై కృష్ణపక్ష చంద్రునిలా నానాటికీ తీసికట్టు అవుతుండగా, షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమౌతోందని ఆయన వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజాసమస్యలపై ఆలోచించే జగన్ సంధించిన పాశుపతాస్త్రమే షర్మిల అని భూమన అన్నారు. ప్రజాసమస్యలు తెలుసు కుంటూ, కన్నీళ్లు తుడుస్తూ, భవిష్తత్తుపై భరోసా కల్పిస్తూ షర్మిల పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోందన్నారు. దుర్మా ర్గపు పన్నులతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తోన్న ఈ ప్రభుత్వాన్నీ, దీనికి కొమ్ముగాస్తున్న టిడిపి నిర్వాకాన్నీ సమంగా ఎండగడుతూ షర్మిల తన సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు. కుట్రలు చేసి ప్రజాస్వామ్య గొంతుక  జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించి ఫాసిస్టు ప్రభుత్వం పైశాచికానందం పొందుతున్నా, జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే ప్రజలు ఆదరాభిమానాలు వర్షిస్తున్నారని ఆయన అన్నారు.
ఎక్కడ చూసినా నెత్తురు మండే శక్తులు నిండే సైనికులంతా..కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ..జనం షర్మిల పాదయాత్రకు జేజేలు పలుకుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి బెయిలు కూడా రానివ్వకుండా కుట్రలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్న ప్రధాన ప్రతిపక్షం టిడిపి వైనాన్నీ చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు మోకాటి యాత్రలు చేసినా  పొర్లుదండాలు పెట్టినా ప్రజలు విశ్వసించరన్నారు. షర్మిలకు ఏ అధికార పదవులూ లేకపోయినా కూడా ప్రజలు అజేయంగా, అఖండంగా ఆదరిస్తున్నారన్నారు.
అవిశ్వాసం పెట్టగలిగివుండి కూడా ప్రభుత్వం బతకాలని కోరుకుంటూ లాలూచీ పడుతున్నందునే తాము అధికారంపక్షంతో పాటు టిడిపిని కూడా సమానంగా ఎండగడుతున్నామని భూమన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. తెలంగాణ జిల్లాలతో సహా ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ వైయస్ కుటుంబం పట్ల సమానమైన ఆదరాభిమానాలుంటాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వాతావరణాన్ని కోరుకునేవారెవరైనా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసిన చారిత్రక అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బషీర్‌బాగ్‌ కాల్పుల కేసులో సురవరం సుధాకర్‌రెడ్డి, బీవీ రాఘవులు, పుణ్యవతి, గుమ్మడి నర్సయ్య వంటి 22 మంది నాయకులపై సీఐడీ చార్జ్‌షీట్‌ వేస్తుండటాన్ని ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డిగారి సువర్ణయుగం కోరుకునేవారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన వలసలపై వ్యాఖ్యానించారు. తమ పక్షం బలపడినప్పుడు తాము తప్పక ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని భూమన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Back to Top