ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు తూట్లు పొడిస్తే సహించం

హైదరాబాద్, 14 ఏప్రిల్‌ 2013: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై 'ఇందిరమ్మ కలలు' అంటూ ఆర్భాటంగా సమావేశాలు పెట్టి ఊదరగొడుతున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారని వైయస్‌ఆర్‌ సీఎల్పీ విమర్శించింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించని వైనాన్ని వేలెత్తి చూపింది. ఈ పథకాన్ని నీరుగార్చుతూ దళిత, గిరిజనులను మోసగించడం సహించరానిదని తీవ్రంగా ఖండించింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం తీసుకువచ్చినా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించకపోవడాన్ని తప్పుపట్టింది.  ప్రభుత్వం తీరుపై వైయస్‌ఆర్‌ సిఎల్పీ నాయకులు మేకతోటి సుచరిత, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కె. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిధులు ఇవ్వకుండానే దళిత, గిరిజనులను ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నామంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా చెప్పుకుంటుందని వారు ప్రశ్నించారు.

చట్టం ప్రకారం ఎస్సీలకు రూ. 9,626 కోట్లు (16.2%), ఎస్టీలకు రూ. 3,922 కోట్లు (6.6%) కేటాయించాల్సి ఉందని వైయస్‌ఆర్‌ సిఎల్పీ నాయకులు ఆ ప్రకటనలో తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు కేవలం రూ. 8,485 కోట్లు (14.44%), ఎస్టీలకు రూ. 3,666 కోట్లు (6.19%) ప్రతిపాదించి రూ. 1.296 కోట్లు కోత పెట్టడమేమిటని ప్రశ్నించారు. దళిత, గిరిజనుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీనితోనే తేటతెల్లం అవుతోందని తెలిపారు. చట్టం ప్రకారం తమకు రావాల్సిన నిధులను ఎందుకు కేటాయించలేదో దళిత, గిరిజనులు ముఖ్యమంత్రిని నిలదీయాలని వైయస్‌ఆర్‌ సిఎల్పీ నాయకులు పిలుపునిచ్చారు.

2013-14 బడ్జెట్‌లో ఎస్సీలకు ప్రతిపాదించిన రూ. 8,485 కోట్లలో రూ. 2,500 కోట్లు దారి మళ్ళించి చట్టానికి రాష్ట్ర‌ంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైయస్‌ఆర్‌ సిఎల్పీ నాయకులు దుయ్యబట్టారు. సాధారణ పథకాలను కూడా సబ్‌ ప్లాన్‌ కిందే చూపించడం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖలో రూ. 750 కోట్లు, కుటుంబ సంక్షేమ శాఖలో రూ. 296 కోట్లతో పాటు మరో ఆరు శాఖల్లో రూ. 2,000 కోట్లను దళితులు నష్టపోయిన వైనాన్ని వారు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకే ఉప ప్రణాళిక నిధులు ఖర్చుచేయాలని, సాధారణ సంక్షేమ పథకాల్లో ఖర్చు పెట్టిన నిధులను ఈ ప్లాన్‌లో చూపించకూడదని వైయస్‌ఆర్‌ సిఎల్పీ నాయకులు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల శాఖలో ఎస్సీలకు 7%, ఎస్టీలకు 3% నిధులు ఇవ్వాల్సి ఉండగా చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి నిధులు ఖర్చు చేయకుండా దారి మళ్ళించిన వారిపై చర్యలు తీసుకునేలా చట్టంలోని లోపాలను సవరించాలని వారు డిమాండ్‌ చేశారు. దళితులు, గిరిజనుల దీర్ఘ కాలిక అభివృద్ధికి తోడ్పడే విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలకు మాత్రమే ఉప ప్రణాళిక నిధులు ఖర్చు చేయాలే గాని సాధారణ రంగాలకు ఆ నిధులను మళ్ళించరాదని ప్రభుత్వాన్ని  వైయస్‌ఆర్‌ సిఎల్పీ తరఫున ‌సుచరిత, బాలరాజు, బాబూరాబు, శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టంలో పలు లోపాలు ఉన్నాయని, దళిత, గిరిజనులకు కేటాయించిన నిధులను ఒకచోట పూల్‌ చేసి నోడల్‌ ఏజెన్సీలకు అప్పగించాలనే అంశాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో లేవనెత్తినా.. వారి సంక్షేమం పట్ల ఏమాత్రమూ చిత్తశుద్ధి లేని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని విమర్శించారు. తమను మోసగిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్ల విజ్ఞలైన దళిత, గిరిజనులు అప్పమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దళిత, గిరిజనుల సంక్షేమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని, వారికి ఏమాత్రం అన్యాయం జరిగినా సహించబోదని ప్రభుత్వాన్ని పార్టీ శాసనసభా పక్షం హెచ్చరించింది.

తాజా వీడియోలు

Back to Top