ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్, టీడీపీల వివక్ష


హైదరాబాద్, 5 డిసెంబర్ 2012:

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు అనుసరిస్తున్నదళిత, గిరిజన వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు.  ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించేందుకు జరిగిన శాసన సభ ప్రత్యేక సమావేశాల్లో కాంగ్రెస్, టీడీపీలు అనుసరించిన తీరును ఎండగడుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ బిల్లు ద్వారా ఎన్నికల్లో రాజకీయ లబ్దిపొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అసెంబ్లీలో ఆ రెండు పార్టీల నేతలు ఆడిన గేమ్ ప్లాన్‌ను ప్రజలకు వివరిస్తామన్నారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ సమావేశం బుధవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. పార్టీ ప్రజాప్రతినిధులు, పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కె.శ్రీనివాసులు, సుచరిత, మాజీ మంత్రి మారెప్ప, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్య ప్రకాష్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం ఎగ్జిక్యూటివ్ కమిటి సమవేశం జరుగుతుందని, ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని ప్రజల్లోకి వెళుతామన్నారు.

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు, విద్య, ఉద్యోగ అవకాశాలను గణాంకాలతోసహా ప్రజల ముందు పెడుతామని గొల్ల బాబూ రావు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్, టీడీపీ పాలనలో దళితుల పట్ల చూపిన వివక్షను కళ్లకు కట్టినట్టు చూపిస్తామన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి దళిత, గిరిజనుల కోసం దాదాపు 75 సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందన్నారు. తొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం పాలనలో బడుగు, బలహీన వర్గాలకు మొండి చేయి చూపారన్నారు.

     డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి దళితులకు సమన్యాయం జరిగేలా చూస్తారని బాబూరావు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్టీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. వర్గీకరణకు సంబంధించి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు తీర్మానాలు చేశారని, వాటికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్, టీడీపీలు వర్గీకరణ అంశాన్ని లేవనెత్తుతున్నాయని ఆరోపించారు.

Back to Top