పరాకాష్టకు చేరిన కుమ్మక్కు రాజకీయం

హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి న్యాయస్థానాలలో బెయిల్ పిటిష‌న్ పెట్టుకున్న ప్రతిసారీ ‌చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని లేదా తన పార్టీ నాయకులను పంపిస్తారని, దర్యాప్తు అధికారులతో వారు సమావేశమవడం పరిపాటిగా మా‌రిపోయిందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ ‌మహిళా నాయకురాళ్ళు తీవ్ర స్థాయిలో నిప్పలు చెరిగారు. తప్ప‌నిసరిగా ఏదో ఒక సెన్సేషన్ వచ్చేలా.. న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా.. ఏదో ఒక నోటీసును వారు ఇప్పిస్తున్నారని, బెయిల్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని పార్టీ శాసనసభా పక్ష ఉపనేత మేకతోటి సుచరిత, కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, అధికార ప్రతినిధి ఆర్.కె. రోజా సెల్వమణి మంగళవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపిలు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరిపోతున్నాయని వారు మండిపడ్డారు.

ప్రకటన పూర్తి పాఠం :
‘ఏ నేరమూ చేయకపోయినా 16 నెలలుగా నిర్బంధంలో ఉన్న శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి మీద చంద్రబాబు నాయుడు, ఆయన యెల్లో మీడియా మళ్లీ దుష్ర్పచారం ప్రారంభించాయి. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడంతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారు బెయిల్ కోసం‌ కోర్టును అభ్యర్థించారు. సిబిఐ చార్జిషీట్లు వేస్తోంది. ఈ రెండూ గమనించిన చంద్రబాబు, యెల్లో మీడియా తమదైన శైలిలో దుష్ర్పచారాన్ని మళ్ళీ అందుకున్నారు.  శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద ఎక్కడా, ఏ కేసూ లేకపోయినా దీన్ని వారు ఒక కేసులా చూపిస్తున్నారు. ఒక పరిశ్రమ వారు విస్తరణ చేపట్టి అందు కోసం నీరు వాడుకున్నా, వారే నీరు అడిగినా, ప్రభుత్వం ఆ  నీరు ఇచ్చినా దాన్ని తప్పు పడుతున్నారు. నీరు, కరెంటు వంటివి కూడా పరిశ్రమలకు ఇవ్వకపోతే ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా పరిశ్రమలు వస్తాయా? అలాంటి అంశాలను కూడా తప్పుపట్టే అన్యాయమైన పరిస్థితిని ఈ రోజు మనమంతా చూస్తున్నాం.

చంద్రబాబు దుష్టబుద్ధికి నిదర్శనం :
ఒక వ్యక్తి తన భూమిలో సొంత డబ్బుతో హోటల్ కట్టుకొన్నా, సర్వ సాధారణంగా అందరికీ ఇచ్చే అనుమతినే ఆ హోట‌ల్‌కు ఇచ్చినా తప్పులుపట్టే దారుణమైన పరిస్థితులలో ఈ రోజు ఈ విచారణ జరుగుతున్న తీరును చూస్తున్నాం. ఇరికించడానికి ఇక ఏమీ లేదన్నా, కొన్ని ఆరోపణల్లో ఏమీ లేదన్నా అది కూడా చంద్రబాబుకు, యెల్లో మీడియాకు నచ్చడం లేదు. ఇంకా దర్యాప్తు  కొనసాగించాలి.. ఏమీ లేకపోయినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద దర్యాప్తు కొనసాగించాలి..  నేరం రుజువు కాకపోయినా, చట్ట ప్రకారం మూడు నెలల్లో రావాల్సిన బెయిల్ ఇవ్వకపోయినా... రాజకీయంగా‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అణగదొక్కవచ్చని, ఆయనను ఇంకా ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంచాలన్న దుష్టబుద్ధి చంద్రబాబుది, యెల్లో మీడియాది, ఈ కుమ్మక్కు రాజకీయాలది.

ఆయనపై అసలు దర్యాప్తే జరగదు !:
ఎమ్మార్ కేసులో శెనక్కాయలకు, పప్పులకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూమిని చంద్రబాబు‌ ఎందుకు కట్టబెట్టారు? ఎందుకంటే.. విలాసవంతమైన బంగ్లాలు కట్టుకొని అమ్ముకునేందుకు... శ్రీమంతులు ఆడుకునే గోల్ఫు కోర్సు కట్టుకునేందుకు! ఆ భూములు చంద్రబాబు ఇచ్చింది పరిశ్రమలకకూ కాదు.. ఉద్యోగులకు అంతకన్నా కాదు. అన్ని నిబంధనలూ అతిక్రమించి చంద్రబాబు ఆ భూముల్ని పప్పు బెల్లాల్లా పంచి ఇచ్చినా దర్యాప్తు చేస్తున్న సిబిఐకి అది కనపడదు. ఐఎంజి కేసు అయితే మరీ దారుణం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటూ, ఆ నిర్ణయం కేబినెట్ ముందుకే వెళ్ళకపోయినా ఒక బోగ‌స్ కంపెనీకి చంద్రబాబు రాజధాని నడిబొడ్డున చిల్లర పైసలకు 850 ఎకరాల భూమిని ఇచ్చేశారు. అయినా చంద్రబాబు మీద దర్యాప్తే జరగదు.

ఐఎంజి కేసుపై విచారణ చేయండి అని సిబిఐకి హైకోర్టు గడువు ఇస్తే, ఇదే సిబిఐ నెలరోజులు గడువు దొరికినా కనీసం చంద్రబాబును పిలవను కూడా పిలవలేదు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయంగా ఈ వ్యవస్థలో నడుస్తున్నప్పుడు, 'దొంగే దొంగ.. దొంగ...’ అని అరుస్తూ ప్రజలను తప్పు దోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు... చీకట్లో చిదంబరాన్ని కలుస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నప్పుడు, విభజన గొడవ ఇంతగా జరుగుతున్నప్పుడు, ఆ విభజన ప్రస్తావనను పక్కదారికి మళ్ళించడం కోసం ఇలాంటి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నప్పుడు... ఏమనుకోవాలి ఈ చంద్రబాబును, ఈ తెలుగుదేశం పార్టీని, ఈ యెల్లో మీడియాను చూసి! కాంగ్రెస్ (శంకర్‌రావు), టిడిపి (అశోక్ గజపతి‌ రాజు, ఎర్రన్నాయుడు తదితరులు)- ఈ రెండు పార్టీల వారూ కలిసి కోర్టులకు వెళతారు! కోర్టులలో ఇద్దరూ కలిసి ఒక వ్యక్తి చనిపోయిన తరువాత, చనిపోయిన దాదాపుగా ఏడాదిన్నర తరువాత, ఆ వ్యక్తి లేనప్పుడు... ఆ వ్యక్తి మీద కేసులు వేస్తారు. అది కూడా, ఆ వ్యక్తి కొడుకు ఒక మాట కోసం కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత ఆ కేసు వేస్తారు!

‌ప్రభుత్వం స్పందించలేదేం ?:
హైకోర్టు 1 నుంచి 12 వరకూ ప్రభుత్వానికి సంబంధించిన శాఖలను ప్రతివాదులుగా చేస్తూ జవాబు ఇమ్మని కోరితే, శ్రీ జగన్మోహన్‌రెడ్డి 52వ ప్రతివాది అయినా, కోర్టు అడిగిన దానికి సమాధానం చెబితే అంతా కరెక్టుగా జరిగింది అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకపోయినా చనిపోయిన వ్యక్తి మీద కోర్టు విచారణకు ఆదేశించింది. ఎమ్మార్‌ కేసులలోనూ, ఐఎంజి కేసులోనూ నేరుగా నేరం కనిపిస్తున్నా చంద్రబాబుతో ఒక తరహాలో వ్యవహారం సాగింది. ‌రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత ఆయన మీద ఉన్న బోఫోర్సు కేసు నుంచి రాజీవ్ గాంధీ పేరును తీసేయడం, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు అంటూ రాబ‌ర్టు వాద్రాను, డింపుల్ యాద‌వ్‌ను కేసుల నుంచి తీసేయడం అందరికీ కనిపిస్తూనే ఉంది.

కానీ శ్రీ జగన్మోహన్‌రెడ్డి విషయానికి వచ్చేసరికి, ఆయన 2009 మే ముందు వరకు రాజకీయాలలో లేకపోయినా, తాను అసలు హైదరాబాద్‌లోనే నివాసం ఉండకుండా బెంగళూరులో ఉంటున్నా.. మహానేత రాజశేఖరరెడ్డిగారు మరణించి అప్పటికి ఏణ్నర్థం అవుతున్నా.. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టి, శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కేసులలోకి తీసుకువచ్చారు. ఎప్పుడు అంటే, 10 నెలలు మౌనంగా ఉండి, ఆ సమయంలో పిలవను కూడా పిలవకుండా, 3 చార్జిషీట్లు వేసేసిన తరువాత, ఎన్నికల్లో బురదజల్లేందుకు ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు అరెస్టులు చేస్తారు.

బురదజల్లడమే పని :
సిబిఐ విషయాలను కో ఆర్డినేట్ చేస్తూ అత్యున్నత స్థానంలో ఉన్న సాక్షాత్తూ జాయింట్ డెరైక్టరే దాదాపుగా ఐదారు‌ వందల ఫోన్ కా‌ల్సు యెల్లో మీడియాకు చేస్తారు.. అదీ తాను ఎంచుకున్న మీడియా సంస్థలకు! తాను ఎంచుకున్న నెగెటివ్ వార్తలను నాణేనికి రెండవ కోణం చూపకుండా, ఒక మనిషిని అభాసుపాలు చేయాలి అన్న దురుద్దేశంతో ‌సిబిఐ రూల్సును అతిక్రమించి దురుద్దేశంతో లీకులు ఇస్తారు. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి కాకపోయినట్టయితే బెయిల్ ఇవ్వాలి అని చట్టం స్పష్టంగా చెపుతున్నా, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ, ప్రతిపక్ష ఎం‌పి అన్న సంగతిని కూడా పక్కన పెట్టి, అధికారంలో లేడు అన్న సంగతిని కూడా పక్కన పెట్టి.. ఆయనకు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదంటారు. అధికారంలో ఉన్ వారికి మాత్రం బెయిల్‌ ఇస్తారు. బెయిల్‌ను అడ్డుకోరు. అధికారంలో లేని శ్రీ జగన్‌గారికి మాత్రం బెయిల్‌ రాకుండా అడ్డుకుంటూ వస్తారు.

నాలుగేళ్లుగా కుమ్మక్కు కుట్రలు:
నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వారు కలిసి కుమ్మక్కయి కేసులు వేస్తారు, మరో వంక తమ మీద మాత్రం విచారణ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్టీఐ కమిషనర్ల పదవులు పంచుకొంటారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎలక్షన్సులో కూడా కుమ్మక్కయి కలిసి పోటీ చేస్తారు. ఎఫ్‌డిఐ ఓటింగుల్లో రైతులను, చిన్న వర్తకులను గాలికి వదిలేసి చంద్రబాబు కుమ్మక్కై తన ఎంపిలను కాంగ్రెస్‌కు అనుకూలంగా రాజ్యసభలో గైర్హాజరయ్యేలా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 32,000 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై కరెంటు చార్జీల్ని బాదితే... రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, చంద్రబాబు మాత్రం ఏకంగా వి‌ప్ జారీ చేసి.. మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రె‌స్ ప్రభుత్వాన్ని కాపాడతారు.

కుమ్మక్కుకు నిదర్శనం:
చివరికి ఈ కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే, కోట్ల మంది ప్రజలకు శాశ్వతంగా అన్యాయం చేస్తూ ఓట్లూ సీట్ల కోసం రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే, అన్యాయం జరుగుతోందని స్పష్టమైన మరుక్షణం, కాల‌ర్ పట్టుకుని వ్యతిరేకించాల్సిన చంద్రబాబు, విభజనకు మద్దతు తెలుపుతారు! తానిచ్చిన లేఖను వెనక్కు తీసుకోని చంద్రబాబు, తాను రాజీనామా చేయకుండా, తన ఎమ్మెల్యేలు, ఎంపిల చేత రాజీనామా చేయించకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెడుతున్న ఈ పెద్దమనిషి కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారా? లేక నిజాయితీతో కూడిన రాజకీయాలు చూపిస్తూ కష్టాల్లో ఉండి కూడా జైల్లో ఉన్నా, ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీకి, ‌ఆ పార్టీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు విరుద్ధంగా ఉద్యమిస్తున్న శ్రీ జగన్ కాంగ్రె‌స్‌తో కుమ్మక్కు అయ్యారా? ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ఇంతకన్నా వేరే చెప్పాలా?’

Back to Top