కాపులపై కూటమి ప్రభుత్వ వేధింపులు

మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ఫైర్‌

అంబటి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు రేపు కాపు నేతల యాత్ర 

విశాఖపట్నం: కాపు సామాజిక వర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్ష్యతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆరోపించారు. కాపు నేతలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ  ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమరనాథ్, కాపు నాయకుడు వంగవీటి రంగాను హత్య చేయడం నుంచి ముద్రగడ పద్మనాభాన్ని అనేక విధాలుగా వేధించడం వరకు కాపు వర్గంపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు పై దాడి చేసి, ఆయనపై తప్పుడు కేసులు పెట్టడం కూడా అదే ధోరణి భాగమని అన్నారు.

రేపు కాపు నేత‌ల చ‌లో గుంటూరు
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు తాము రేపు ఉదయం వెళ్లనున్నట్లు అమరనాథ్ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అంబటి రాంబాబు పై నమోదు చేసిన కేసుల విషయంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. తాము చేపడుతున్నది సంఘీభావ యాత్ర మాత్రమేనని, దీనికి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. టీటీడీ లడ్డూ అంశంపై మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో జంతు కొవ్వు కలవలేదని తేలిన తర్వాత కూడా మరో కమిటీ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించేందుకు చంద్రబాబు కమిటీ వేశారా? లేక వైయ‌స్ఆర్‌సీపీపై నెపం నెట్టేందుకు మరో కమిటీ ఏర్పాటు చేస్తున్నారా? అని అమరనాథ్ ప్రశ్నించారు. లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా ప్రశ్నలు అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో తాను నాస్తికుడినని ప్రకటించుకున్న నాగేంద్రబాబు, ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో మాట్లాడడం ఎలా సాధ్యమవుతుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. నాగబాబు చేసిన ట్వీట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయని గుర్తుచేశారు. కల్తీ లడ్డూ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఎప్పటికప్పుడు మారుతుందని విమర్శించారు.

 వైయ‌స్ఆర్‌సీపీ నేత కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, కాపులను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. కాపు నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం ఆందోళనకరమని అన్నారు. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులు అందరూ అండగా ఉంటారని తెలిపారు. రేపు ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలంతా కలిసి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు కరణం ధర్మశ్రీ వెల్లడించారు. అంబటి రాంబాబు పై అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారని, ఆయనను చంపేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించాయని ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
 

Back to Top