ఎన్టీఆర్ జిల్లా : వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు ఎదురైనా ప్రజల మద్దతు మాత్రం అలుపెరుగని ప్రవాహంలా కొనసాగుతోంది. అభిమాన నేతను చూసేందుకు ప్రజలు ఆంక్షలను దాటుకొని స్వచ్ఛందంగా తరలి రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్న గుంటూరు పర్యటన తర్వాత ఇవాళ ఇబ్రహీంపట్నంలోనూ వైయస్ జగన్ పర్యటనకు అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వైయస్ జగన్ పర్యటనకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తోంది. అయినప్పటికీ ప్రజలు వెనుకడుగు వేయకుండా వైయస్ జగన్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైయస్ జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురవుతోంది. ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పర్యటనకు సంబంధించి చివరి నిమిషంలో రూట్ మార్చాలని నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనం. జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. చంద్రబాబు ఆదేశిస్తే పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజలను ఆయన వెంట వెళ్లకుండా పోలీసులు చెక్‌పోస్టులు, బారికేడ్స్ ఏర్పాటు చేశారు. తాడేపల్లి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌లో వస్తున్న వాహనాలను పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం వద్దకు కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైయస్ జగన్ ర్యాలీని అడ్డుకునేందుకు ఏకంగా ప్రెషర్ గన్‌లను కూడా సిద్ధం చేశారు. వైయస్ జగన్ పర్యటనకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ శ్రేణులను మైలవరంలో పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన కొనసాగిస్తోందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రచారాలు, దాడులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలు నడిపిస్తోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే వైయస్ జగన్ వెంట పెద్ద ఎత్తున నడుస్తున్నారు.