హైదరాబాద్, 15 అక్టోబర్ 2012: నాయకుడన్నవాడికి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న సంకల్పం మనసులోంచి రావాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో చేయాలని పేర్కొంది. ఇంతకు ముందు తాను తీవ్రంగా వ్యతిరేకించిన అంశాలనే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పడు పాదయాత్ర సందర్భంగా హామీల చిట్టా విప్పుతున్నారని విమర్శించింది. 'మనసులో మాట'లో చెప్పిన విషయాలు తప్పని మనస్ఫూర్తిగా ఒప్పుకుని ఆయన ప్రజల్లో తిరగాలని, వాగ్దానాలు చేయాలని సూచించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు కొణతాల రామకృష్ణ, డి.ఎ. సోమయాజులు మాట్లాడారు. తనకు అధికారం అప్పగిస్తే అది చేస్తా, ఇది చేస్తా అంటూ హామీలు గుప్పిస్తుండడాన్ని ప్రజలు క్విడ్ కో ప్రో అని భావిస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వసనీయత ఎప్పుడో కోల్పోయారని కొణతాల అన్నారు. ఇంతకు ముందు తన పాలనాకాలం తొమ్మిదేళ్ళలో వ్యవసాయ రంగానికి తాను ఏమి చేశానో చంద్రబాబు గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆయన చెప్పిన కార్యక్రమాల్లో ఏ ఒక్కటైనా అమలు చేసి ఉంటే ఆయన పట్ల కొంతమందికైనా విశ్వసనీయత వచ్చి ఉండేదన్నారు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యం గల వ్యవసాయాన్ని దండగ అని నిర్లక్ష్యం చేసిన ఈ పెద్దమనిషి ఇప్పుడు రైతుల గురించి మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్ముతారని అన్నారు. ఆయన హయాంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కరవు తాండవించిందన్నారు. పంటలు లేక అన్నదాత, నేసిన బట్టలకు మార్కెట్ లేక నేతన్న, చేసేందుకు పని లేక కార్మికులు, కూలీలు, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి ఇలా ఎందరో కుల వృత్తుల వారు ఆత్మహత్య చేసుకున్నారని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు.
బతకలేక ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని అయినా చంద్రబాబు పరామర్శించారా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతన్న కుటుంబానికి పరిహారం చెల్లించడానికి చంద్రబాబు వ్యతిరేకించిన విషయాన్ని ఉటంకించారు. నష్టపరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడిన చంద్రబాబు తీరును కొణతాల ఎండగట్టారు. వ్యవసాయం దండగ అని ఒక పుస్తకం కూడా ఆయన రాశారని, వ్యవసాయం కన్నా టూరిజమే మంచిదని చంద్రబాబు అందులో పేర్కొన్నవిషయాన్ని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో ఇప్పటికీ 70 శాతం మంది ఆధారపడి ఉన్న వ్యవసాయం అనే పదాన్నే పలికేందుకు కూడా ఆయన ఇష్టపడేవారు కాదని ఆరోపించారు. ఎంతసేపూ ఎన్నిసార్లు దోవోస్ వెళ్ళాం, ఎన్నిసార్లు పార్ట్నర్ సమ్మిట్‌లు పెట్టాం, బిల్ క్లింటన్ లాంటి విదేశీ నాయకులను ఎన్నిసార్లు ఆహ్వానించాం అనే దానిపై చంద్రబాబు దృష్టిపెట్టేవారని దుయ్యబట్టారు.
గతంలో ప్రధాన మంత్రిని, రాష్ట్రపతిని తానే ఎంపిక చేశానని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా రైతుల రుణాలు రద్దు చేశారా? అని కొణతాల ప్రశ్నించారు. తననే ప్రధానిగా ఉండమన్నారని చంద్రబాబు చెప్పుకున్నారని, అయితే తాను త్యాగం చేశానని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రుణాలు రీ షెడ్యూలు చేయాలని గాని, వడ్డీ మాఫీ చేయాలని గాని కేంద్రాన్ని కోరారా అని నిలదీశారు. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించని విషయాన్ని గుర్తుచేశారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో 36 మంది ఎంపీలను లోక్‌సభకు పంపించినా ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకుండా రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఆ సమయంలో ఒక్క ప్రాజెక్టును అయినా ఎందుకు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ ప్రారంభించిన కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని రూ. 5.25 చేయడమే కాకుండా మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎత్తివేసిన విషయాన్ని ఉటంకించారు. హార్స్ పవర్ విద్యుత్‌ను 50 రూపాయలకే ఇస్తామని ఎన్టీఆర్ హామీ ఇచ్చారని, దాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆరు వందలో ఆరు వందల యాభై రూపాయలో చేశారని విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఐదు వేల కోట్ల రూపాయలు పన్నుల భారం వేసి రాష్ట్ర ప్రజల జీవనంపై దెబ్బకొట్టింది చంద్రబాబే అని ఆరోపించారు. ఆ నాడు ప్రతిపక్షంలో ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి ఇలాంటి ఎన్నెన్నో రైతు సమస్యలపై పోరాడిన విషయాన్ని కొణతాల గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం కోసం మరో మాట చెప్పే ద్వంద్వ ప్రమాణాలు చంద్రబాబువి అని ఆరోపించారు.
అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానంటూ చెబుతున్న చంద్రబాబు ఇంతకు ముందు వైయస్ ఇదే పథకాన్ని ప్రకటించినప్పుడు విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. ఉచిత విద్యుత్‌పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయంటూ పాదయాత్ర సందర్భంగా చెబుతున్న చంద్రబాబులో దానిపై స్పష్టతే లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అసలు ఉచిత విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉన్నారా లేక అది అనవసరం అన్న ముందరి వ్యాఖ్యలకు బద్ధుడై ఉంటారా నిర్ణయించుకోవాలని సూచించారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి దృఢమైన నిర్ణయంతో ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి చూపించిన వైనాన్ని కొణతాల తెలిపారు.
కేవలం అధికారం కోసమే పాదయాత్ర చేస్తూ, మాయమాటలతో ప్రజలను మరోసారి తప్పుదారి పట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలని కొణతాల రామకృష్ణ హెచ్చరించారు. ఏదో విధంగా అధికారంలోకి వచ్చి, ఆపైన ప్రజలను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు అంటే విశ్వసనీయత లేదన్నారు. వైయస్ ఏ పథకాన్ని ప్రారంభించినా దారుణంగా వ్యతిరేకించిన చంద్రబాబు నేడు అవే పథకాలను తానూ అమలు చేస్తానంటూ హామీల చిట్టా విప్పుతున్నారని ఎద్దేవా చేశారు.
జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా కేంద్రం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా చూస్తానని చంద్రబాబు నాయుడు క్విడ్ ప్రో కో చేసుకున్నారా? అని కొణతాల ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులిచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పే అసత్యాల కారణంగానే రాజకీయ నాయకులను విశ్వసించే పరిస్థితి ప్రజల్లో లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఈ మూడు రంగాలనూ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సమన్వయంతో నడిపించి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ గుర్తుచేశారు.
ప్రభుత్వ వైఫల్యాలు వివరించి, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మేమున్నాం అని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు షర్మిల పాదయాత్రకు వెళుతున్నారని మీడియా ప్రశ్నకు కొణతాల బదులిచ్చారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా షర్మిల పాదయాత్రకు వెళుతున్నారని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆమె పాదయాత్రను పార్టీ అధికారికంగా ఆమోదించిందన్నారు. పాదయాత్ర సందర్భంగా వచ్చే సమస్యలపై షర్మిల ఇచ్చే హామీలన్నింటి పైనా కృషిచేసేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
రుణాల రద్దు మహానేత వైయస్ ఘనతే
రాష్ట్రంతో పాటు దేశంలోని ఐదు కోట్ల మంది రైతులకు రూ. 74 వేల కోట్ల రుణాలను రద్దు చేయించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిదే అని డి.ఎ. సోమయాజులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి మంది లబ్ధి పొందారన్నారు. ‘2001-04 మధ్య కాలంలో రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని కరువు ఏర్పడింది. వైయస్ అధికారంలోకి రాగానే కరువు వల్ల రాష్ట్రంలో రైతులు నష్టపోయారని రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని పదే పదే ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మీ ఒక్క రాష్ట్రానికే ప్యాకేజీ అంటే ఎలా? అని ప్రధాని ప్రశ్నించినపుడు దేశవ్యాప్తంగా ఇలాంటి జిల్లాలు ఇంకా ఏమైనా ఉంటే ఎంపిక చేసి వాటికి ప్యాకేజీ ఇవ్వాలని వైయస్ రాజశేఖరరెడ్డి అడిగారు. దానివల్లనే దేశవ్యాప్తంగా కరువు పీడిత ప్రాంతాలుగా 31 జిల్లాలను గుర్తించి ప్యాకేజీని ఇచ్చారు. అందులో రాష్ట్రానికి చెందిన 16 జిల్లాలు వచ్చాయి’ అని ఆయన వివరించారు.
2001లో 160 లక్షల టన్నుల ఆహార పదార్థాలు ఉత్పత్తి అయిన మన రాష్ట్రంలో 2002 - 03 నాటికి 106 లక్షల టన్నులకు పడిపోయిందని సోమయాజులు తెలిపారు. అంటే కనీసం 33 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. వ్యవసాయం కుంటుపడితే దానిపై ఆధారపడిన ఇతర కుల వృత్తుల వారు సుమారు 70 శాతం మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించారని దుమ్మెత్తిపోశారు. వృత్తుల వారు జీవించే పరిస్థితి లేని సమయంలో రైతుల రుణాలు మాఫీ చేయాలని గాని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇమ్మని గాని చంద్రబాబు ఒక్క లేఖనైనా కేంద్రానికి రాసిన పాపాన పోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చేందుకే తాను పాదయాత్ర మొదలుపెట్టానని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న డాక్టర్ రాజశేఖరరెడ్డి మొట్టమొదటి ప్రకటన చేశారని గుర్తుచేశారు.
రుణాల రీషెడ్యూలింగ్ వల్ల తగ్గిన వడ్డీ భారం రెండు వేల కోట్లు అయితే అందులో వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించిందని అన్నారు. మళ్లీ 2009 వరకూ ప్రధానిని, శరద్‌పవార్‌ను పలుమార్లు కలిసి కనీసం వంద లేఖలైనా రాసి రుణ మాఫీకి వైయస్ కారణమయ్యారు. ఈ మాఫీ వల్ల రాష్ట్రంలో రూ. 12 వేల కోట్ల మేర రైతుల రుణాలు రద్దయ్యాయన్నారు. రుణాలు చెల్లించిన రైతులకు కూడా కొంతయినా మేలు చేద్దామనే ఉద్దేశంతో ఐదు వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా రైతులకు ఇచ్చిన ఫలితంగా రూ. 1,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు. అంతేకాకుండా ప్రధాని ప్యాకేజ్‌లో కొత్త రుణాలు కూడా ఇప్పించగలిగారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు ఎందుకు చేయలేదని నిలదీశారు. వైయస్ చేసిన కార్యక్రమాల ఫలితంగానే ఆహార ధాన్యాల ఉత్పత్తి విశేషంగా పెరిగిందన్నారు.