రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా విభజించకూడదు

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్ర‌ ప్రభుత్వం మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు ఆరోపించారు. రాజ్యాంగంలోని 3వ అధికరణం ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సోమవారం ఆయన సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారంనాడు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగంలోని 3వ అధికరణం ద్వారా పార్లమెంటుకు దఖలు పడిన మాట వాస్తవమే. కానీ ఆ అధికారాన్ని, అందు కోసం ఏర్పరచిన విధివిధానాలకు అనుగుణంగా ఉపయోగించాలే తప్ప వివక్షా పూరితంగానో, ఇష్టారాజ్యంగానో వాడకూడదు. ప్రభుత్వ చర్యలేవైనా చెల్లుబాటు కావాలంటే అవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంకుశ పోకడలకు లోనై తీసుకున్నవి అయి ఉండకూడదు. ఇదే మనల్ని పాలించే న్యాయ పాలన వ్యవస్థ మౌలిక పునాది. రాజ్యాంగంలోని 14వ అధికరణం సారాంశం కూడా ఇదే’ అని సోమయాజులు స్పష్టం చేశారు.

ఇంత వరకూ రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలన్నీ మొదటి ఎస్సార్సీ సిఫార్సుల మేరకు గానీ, లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ కోరిక మేరకు జేవీపీ కమిటీ, దార్ కమిటీ, లేదా వాంచూ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా గానీ ఏర్పడ్డవేనని సోమయాజులు గుర్తుచేశారు. ‘దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదే‌శ్‌ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఇలాంటి ప్రాతిపదిక ఏదీ లేదు. పెపైచ్చు, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే అత్యుత్తమ పరిష్కారమని పేర్కొన్న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులకు కేంద్రం నిర్ణయం పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగవిరుద్ధం’ అని‌ ఆయన పేర్కొన్నారు.

కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీ వంటివాటి నివేదికో, లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీల తీర్మానమో తప్పనిసరి అని జస్టిస్ సర్కారియా, జస్టి‌స్ పూంచీ వంటి ఉన్నత స్థాయి జ్యుడీషియ‌ల్ కమిటీలే కుండబద్దలు కొట్టాయని ఆయన వివరించారు. కేంద్రమే ఏర్పాటు చేసిన పలు కమిటీలు, కమిషన్లు ఈ దిశగా చేసిన సిఫార్సులు తదితరాలను తన వాదనకు మద్దతుగా‌ సోమయాజులు ఉటంకించారు.
‘ఇంతవరకూ ఏర్పాటైన కొత్త రాష్ట్రాలన్నీ సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానం ద్వారా గానీ, అందు కోసం ఏర్పాటైన కమిషన్ల సిఫార్సుల ద్వారా గానీ ఏర్పాటైనవేనని సర్కారియా కమిషన్ 1988లో తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. విభజన కోరుతూ సంబంధిత రాష్ట్రం నుంచి ప్రతిపాదన వస్తే తప్పించి, ఆ రాష్ట్రంలోని ఏవో కొన్ని ప్రాంతీయ సమూహాలు డిమాండ్ చేశాయనే కారణంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను కేంద్రం ఆమోదించజాలదని కేంద్ర- రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన జస్టిస్ పూంచీ కమిషన్ కూడా 2010లో సమర్పించిన నివేదికలో కుండబద్దలు కొట్టింది. బీజేపీ ‌నాయకుడు ఎల్‌కే అద్వానీ కూడా, ‘విభజన కోరుతూ సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తేనే దాన్ని పరిశీలించాలని మేం (ఎన్డీఏ ప్రభుత్వం) నిర్ణయించా’మని 2000 ఆగస్టు 1న కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో ప్రకటించారు’ అని సోమయాజులు పేర్కొన్నారు.

వీటన్నింటికీ మించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు 2009 డిసెంబర్ 9న ప్రకటించిన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం కూడా, ‘ఈ మేరకు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది’ అని స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆకాంక్షలను గుర్తిస్తున్నామని 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రె‌స్ పార్టీ కూడా, ‘దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి డిమాండ్లు తలెత్తుతున్నందున వీటన్నింటికీ అత్యుత్తమ పరిష్కారం రెండో ఎస్సార్సీ ఏర్పాటే’నని స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు.

Back to Top