బస్సు చార్జీలు పెంచొద్దు: విజయమ్మ

హైదరాబాద్, 22 సెప్టెంబర్‌ 2012: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తల పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చార్జీలు పెంచే యోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఒక ప్రకటనలో ఆమె డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాలను తూతూ మంత్రంగా నడిపించిన రాష్ట్ర ప్రభుత్వం సభలో ఒక్క సమస్యపైన కూడా చర్చించకుండా తప్పించుకుపోయిందని విజయమ్మ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన కొద్ది సేపటికే బస్సు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడాన్ని బట్టి ఈ సర్కార్‌కు ప్రజల సమస్యలంటే లెక్కే లేదని మరోమారు నిరూపించుకున్నదని విమర్శించారు.

అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రోజుకో ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకోవటం ఈ మధ్య కాలంలో రివాజుగా మార్చుకున్నాయని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఐదేళ్ళ మూడు నెలల కాలంలో ఒక్క నయాపైసా ఆర్టీసీ చార్జీలు గానీ, విద్యుత్‌ చార్జీలు గానీ, పన్నులు గానీ పెంచని విషయాన్ని గుర్తుచేశారు. ఒక వంక కేంద్ర ప్రభుత్వం పెట్రో సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయంటూ ఈ వారంలోనే డీజిల్‌ ధరను దారుణంగా పెంచిందని, వంట గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీపై పరిమితిని విధించిందని, కేంద్రం తీసుకున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని అదనుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ మీద వ్యాట్‌ పేరు చెప్పి లీటరుకు సుమారు. రూ. 1.50 లు ప్రజల నుంచి వసూలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా డీజల్‌పై సంవత్సరానికి రాష్ట్ర ప్రజల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500 కోట్ల రూపాయలు అదనంగా దండుకుంటోందని విజయమ్మ దుయ్యబట్టారు. వ్యాట్‌ పేరుతో దోచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ డీజిల్‌ ధర పెంపును సాకుగా చూపి ఆర్టీసీ చార్జీల పెంపునకు తెగించడం దారుణం అన్నారు.

మహానేత వైయస్‌ఆర్‌ మరణించిన కొద్ది రోజుల్లోనే రోశయ్య ప్రభుత్వం, తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలను పలు దఫాలు పెంచిందని, విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంటుకు కోతలు పెట్టి చంద్రబాబు నాటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు తలపిస్తున్నదని విజయమ్మ తన ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలకు కేవలం ఖజానా నింపుకోవాలన్న యావే తప్ప ప్రజలు ఎలా బతుకుతారన్నది పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

రైతుకు, పరిశ్రమకు, ఇళ్ళకు ఇవ్వాల్సిన విద్యుత్తులో కోత పెట్టిన కాంగ్రెస̴్ ప్రభుత్వం మరో వంక కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, తద్వారా 'తక్కువ కరెంటు - ఎక్కువ బిల్లు' అనేది తన విధానంగా మార్చుకున్నదని విజయమ్మ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని సర్వనాశనం చేసి, లక్షలాది ఉద్యోగాలను ఈ ప్రభుత్వం ఇప్పటికే మింగేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ విధానాల కారణంగా కోట్లాది మంది ప్రజల బతుకు భారంగా మారిపోయిందని ఆవేదన చెందారు. ఎరువుల ధరలను 300 నుంచి 800 శాతానికి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచేసి రైతులపై తనకు ఎలాంటి ప్రేమా లేదని నిరూపించుకున్నదని పేర్కొన్నారు.

మొత్తం మీద దేశ ప్రజలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇలాంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగడానికి వీలు లేదని భావిస్తున్నారని విజయమ్మ తన ప్రకటనలో తెలిపారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అసలు ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలా? ప్రభుత్వ ఖజానా నింపేందుకు ప్రజలు సర్వనాశనమైపోయినా పరవాలేదా? అని విజయమ్మ ప్రశ్నించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను మహానేత వైయస్‌ వారసులుగా, ప్రజల పక్షాన నిలిచే పార్టీగా, జన నేత జగన్మోహన్‌రెడ్డి అభిప్రాయాల మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని విజయమ్మ స్పష్టం చేశారు.
Back to Top