బాబుకు 'ఉగాది' పురస్కారం: భూమన సూచన

హైదరాబాద్, 10 ఏప్రిల్‌ 2013: అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వాన్ని కాపాడినందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఉగాది పురస్కారం ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సూచించారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ విప్‌ జారీ చేసి ప్రభుత్వానికి పూర్తి అండదండలు అందించిన ఘనత టిడిపికి, చంద్రబాబుకే దక్కుతుందని ఆయన బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరితో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షం టిడిపి తన బాధ్యతను విడిచిపెట్టి ప్రభుత్వానికి ఆపన్న హస్తం అందించి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రాణం పోసిన చంద్రబాబుకు 'ప్రాణమిత్ర' పురస్కారం ఇస్తే సముచితంగా ఉంటుందని ఆయన సూచించారు.

'నడక మిత్రుడు' బాబుకు సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి తన చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వాలని కోరుతున్నామని భూమన పేర్కొన్నారు.  చంద్రబాబుకు ఉగాది పురస్కారం ఇచ్చే విషయంలో తాము కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వం అవార్డు ఇవ్వకపోతే అందుకు అనేక సంస్థలు సిద్ధంగా ఉన్నాయని భూమన ఎద్దేవా చేశారు.


Back to Top