అసహనంతోనే ఇలాంటి వ్యాఖ్యలు

హైదరాబాద్, 4 డిసెంబర్ 2012:

ముఖ్యమంత్రి పదవి కోసం చివరి అస్త్రంగా పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మతి భ్రమించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర జనం లేక వెలవెలబోతోందనీ, ఆయన నడవలేని స్థితిలో ఉన్నారనీ ఎద్దేవా చేశారు. ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు అసహనానికి గురవుతున్నారనీ, ఈ క్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను  లక్ష్యంగా చేసుకుని మాట్టాడుతున్నారని ఎద్దేవా చేసింది.

శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ గల్లంతవుతుందనే భయంతో విలీనం మాట ఎత్తుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు రామచంద్రరావు మాట్టాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పని అయిపోయిందంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పని అయిపోయిందో ప్రజలు కళ్లకు కట్టినట్టు చూపించారని ఆయన అన్నారు.

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుకు చెందిన 7 కోట్ల రూపాయలు దొరికాయని, వాటిని నాణేల్లోకి మారిస్తే కొన్ని వందల ఎండ్ల బండ్లు అవసరమవుతాయన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకు లేదని స్పష్టంచేశారు.

వాస్తవాలను జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో అవాకులు-చెవాకులు మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రోజు రోజుకు జనాదరణ తగ్గుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తన మానసిక స్థితిని మెరుగు పరుచుకునేందుకు చంద్రబాబు నాయుడు చికిత్స చేయించుకుంటే మంచిదని గట్టు సలహా ఇచ్చారు.

జీవోలు కరెక్టు అయితే కేసులు ఎందుకు?

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలు, కుతంత్రాల వల్లే శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన విషయం ప్రజలకు అర్థమైందన్నారు. 26 జీవోలు సక్రమమేనని మంత్రులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లే వారి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ సమాధానాలు అప్పుడే ఇచ్చి ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లేవారు కాదన్నారు. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన నేతృత్వంలోని పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.

శాసన సభ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని గట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కొనసాగే హక్కు లేదంటూనే చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టడానికి జంకుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అవిశ్వాసం పెడితే తాము మద్దతు తెలుపుతామని గట్టు స్పష్టం చేశారు.

దాడులు చేయడం తగదు


'మరో ప్రజా ప్రస్థానం'  పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలపై రాళ్లు విసరడం మంచి పద్దతి కాదని గట్టు హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరుగొచ్చని అన్నారు. ఈ దాడులకు టీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. దాడులు చేసిన వారిని శిక్షించాలనీ, పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమనీ గట్టు హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top