'అభినవ నీరోలు కిరణ్‌ కుమార్, చంద్రబాబు'

హైదరాబాద్‌, 4 అక్టోబర్‌ 2012: రాష్ట్రంలో చట్టబద్ధమైన ప్రభుత్వమే నడుస్తోందా అన్న అనుమానాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట నీట మునిగిపోయిందని పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక పక్కన పంటలు వాననీటిలో మునిగిపోయి, మరో పక్కన ఎరువులు అందుబాటులో లేక అన్నదాత కన్నీరు మున్నీరవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. మరో పక్కన రకరకాల వ్యాధులతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని, సరైన వైద్య సదుపాయాలు లేక గిరిజనులు మృత్యువాత పడుతున్నారని విచారం వ్యక్తం చేసింది. అయితే, రాష్ట్రంలో ఇలాంటి ఎన్నెన్నో సమస్యలతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పట్టించుకోకుండా జీవ వైవిధ్య సదస్సు గురించి సమీక్ష నిర్వహించారని, ప్రభుత్వం తీరును ఎప్పటికప్పుడు నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర పేరుతో కాలక్షేపం చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం గురించి ఆ శాఖ మంత్రి అస్సలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ ప్రసాద్‌ గురువారం సాయంత్రం పార్తీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడిని ఉతికి ఆరేశారు. వీరి తీరు చూస్తే 'రోమ్‌ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్న చందంగా' ఉందని దుయ్యబట్టారు.

మహానే డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మహాప్రస్థానం యాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు చంద్రబాబు దాన్ని కాపీ కొట్టి 'వస్తున్నా.. మీ కోసం' అంటూ పాదయాత్ర చేసి సిఎం అయిపోవాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు సిఎం అయినప్పుడు కిలో 2 రూపాయల బియ్యాన్ని రూ. 5.25 చేశారని, మద్యపాన నిషేధాన్ని రద్దు చేశారని,‌ క్లింటన్ తప్ప రాష్ట్ర ప్రజలెవరూ ఆయన కళ్ళకు కనబడలేదని జనక్‌ ప్రసాద్‌ ఎత్తి చూపారు. అప్పుడు బాబు పాలనలో ఇబ్బందులు చవిచూశారు గనుకే ప్రజలు 2004, 2009 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని, అనంతరం జరిగిన పలు ఉప ఎన్నికల్లో కూడా తిప్పి కొట్టారని తెలిపారు. జనాన్ని ఎలా ఏమార్చాలని సినిమావారి సలహాలు తీసుకున్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.

వైయస్‌ఆర్‌ సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ వస్తుందనుకున్నప్పుడల్లా కాంగ్రెస్‌- టిడిపిలు కుమ్మక్కైపోయి ఆయనను ఎలా అడ్డుకోవాలా అని కుయుక్తులు పన్నుతున్నాయని జనక్‌ ప్రసాద్‌ ఆరోపించారు. టిడిపి నాయకుడు దాడి వీరభద్రరావు తాజాగా బుధవారంనాడు జగన్‌పై మళ్ళీ అసత్యాలు మాట్లాడారని జనక్‌ ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌- వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కయ్యాయని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. టిడిపి నాయకులు చీకట్లో చిదంబరాన్ని కలవడాన్ని, తమ పార్టీ నాయకులు అందరినీ బయటికి పంపించేసి చంద్రబాబు నాయుడు ప్రధానితో రహస్య సమాలోచనలు చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ కేసు శుక్రవారంనాడు తుది దశకు వస్తుందనుకుంటున్న సమయంలో టిడిపి ఎంపీలు గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంతో సమావేశం కావడాన్ని, సాయంత్రం హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో భేటి అవుతున్నారంటూ వచ్చిన వార్తలను జనక్‌ ప్రసాద్‌ ఉటంకించారు. దీనినేమంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ - టిడిపి కుమ్మక్కయ్యాయనడానికి ఇంతకంటే ప్రత్యక్ష తాజా ఉదాహరణ ఇంకేమి కావాలని ఆయన నిలదీశారు. జగన్‌ మీద కుట్రలు చేయడం తప్ప వారికి ఈ సమయంలో కేంద్ర మంత్రులతో సమావేశం కావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చించేందుకే తాము భేటి అయ్యామని చెప్పినా అవి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అని అన్నారు.

ప్రజా సమస్యలు పట్టని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పరిపాలించే అర్హత లేదని జనక్‌ ప్రసాద్‌ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ప్రభుత్వం ప్రజా ద్రోహి అంటూ ఇప్పుడు విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టలేదని నిలదీశారు. లక్షా 76 వేల కోట్ల 2జి స్ప్రెక్ట్రమ్‌ కుంభకోణం జరిగినప్పుడు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఎందుకు ఒక్క మాట కూడా అనలేదని, బొగ్గు కుంభకోణం ‌గురించి గాని, గ్యాస్ విషయంలో గాని, ఎఫ్‌డిఐలపై గాని ఒక్క మాట కూడా చంద్రబాబు పల్లెత్తి మాట్లాడలేదని జనక్‌ ప్రసాద్‌ ఆరోపించారు. పైపెచ్చు కేంద్రప్రభుత్వంపై మమతా బెనర్జీ అవిశ్వాసం పెడతానని అన్నప్పుడు అలా ఆమె చేయదని, ఒకవేళ మమత అవిశ్వాసం పెట్టించినా ములాయం సింగ్‌ యాదవ్‌ మద్దతివ్వరంటూ చంద్రబాబు అనడాన్ని తప్పుపట్టారు. ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో 
చంద్రబాబు ఈ చర్యలను గమనిస్తున్న ప్రజలే తేలుస్తారని ఆయన హెచ్చరించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై ఆయన కేబినెట్‌లోని మంత్రులే కేంద్రానికి లేకలు రాస్తారని, ఆ పార్టీ ఎంపీలే కవాతులో పాల్గొంటామంలూ మీ క్యాంప్ కార్యా‌లయం ముందు ధర్నా చేస్తారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్‌రెడ్డి బయట ఉండి ఉంటే ఈ పాదయాత్రలు, ముఖ్యమంత్రి ఆటలు సాగేవా అని జనక్‌ ప్రసాద్‌ సూటిగా ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి రేపో ఎల్లుండో బెయిల్‌పై బయటికి వస్తారని, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌, టిడిపిల బండారం కక్కిస్తారని జనక్‌ ప్రసాద్‌ హెచ్చరించారు.

ఎనిమిది కిలోమీటర్లు నడిచి పిక్కలు పట్టేశాయంటున్న చంద్రబాబుపైన, ఆయన పాదయాత్రపైనా ప్రజలకు విశ్వసనీయత లేదన్నారు. అద్వానీ తొలిసారి చేసిన రథయాత్ర, మహానేత వైయస్‌ చేసిన పాదయాత్ర విజయవంతం అయ్యాయన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు వాతలే మిగులుతాయన్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, ఎవరు సమర్థులైన నాయకులో వారిని జనం తప్పకుండా సమర్థిస్తారని జనక్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.
Back to Top