'అబద్ధాలతో అందలం ఎక్కాలనుకుంటున్న బాబు'

హైదరాబాద్‌, 8 అక్టోబర్‌ 2012: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అబద్ధాలతోనే అందలం ఎక్కాలనుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఆయన నోరు విప్పితే అన్నీ అబద్ధాలే మాట్లాడతారని ఎద్దేవా చేసింది. నిజం చెబితే తల వేయి ముక్కలయిపోతుందనే ముని శాపం ఏదైనా చంద్రబాబుకు ఉందేమో అని అభిప్రాయపడింది. టిడిపి పరిపాలనా కాలంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర కేవలం 180 రూపాయలే ఉందని, తన తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ హయాంలో అది కాస్తా రూ.450 అయిపోయిందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు చేప్పేదంతా పచ్చి అబద్ధం అని తేల్చింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి కొన్ని రోజుల పాటు బెయిల్‌ రానివ్వకుండా టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు అడ్డుపడగలవేమో కాని, వచ్చే ఎన్నికల్లో ఆయన చేతికి అధికారం అందకుండా చేయడం వాటి తరం కాదని ధీమా వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై చండ్ర నిప్పులు చెరిగారు.

'చంద్రబాబు పాదయాత్ర ఆరవ రోజుకు చేరిందట. వంద కిలోమీటర్లు పూర్తయిందట. ఈ ఆరు రోజుల్లో ఆయన అనేక అబద్ధాలు మాట్లాడారు. అబద్ధాలాడి అందలం ఎక్కాలనుకుంటున్నారాయన. తన హయాంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర కేవలం రూ.180 ఉంటే ఇప్పుడది ఏకంగా రూ. 450 అయిందట.' అంటూ రాంబాబు పత్రికా ప్రతినిధుల సమావేశం ప్రారంభించారు. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సిలిండర్‌ ధర రూ. 115 ఉండేదని, ఆయన పరిపాలన పూర్తయ్యే నాటికి అది రూ. 305 అయిందని అంబటి గుర్తు చేశారు. అంటే రెట్టింపు పెంచారని వివరించారు.

చంద్రబాబు అనంతరం సీఎం అయిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించే వరకూ అదే రేటుకు గ్యాస్‌ సరఫరా అయ్యేలా చేశారన్నారు. ఒక్క రూపాయి కూడా ధర పెంచకుండా సరఫరా చేయించిన ఘనత వైయస̴్దే అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్‌ ధర పెరిగితే అది కేంద్రం పెంచిందని సాకు చెప్పి పారిపోయారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. అదే వైయస్‌ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్‌ ధర రూ. 50 పెరిగితే దాన్ని సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చి అమలు చేసిన వైయస్‌ను ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరచిపోరన్నారు. మాటకు నిలబడిన వ్యక్తి మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యుత్‌ కోతలను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు గతంలో తాను చెప్పిందే ఇప్పుడు నిజమైందని అన్నారని, అసలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడమంటేనే ఆయనకు ఇష్టం లేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌పై 'నీ మనసులో మాట'లో చెప్పిందేమిటో గుర్తు చేసుకోమని చంద్రబాబూ అని ప్రజలంతా అడుగుతున్నారని అన్నారు. మనసులో మాటలో వ్యవసాయం దండగ అని, వేరే వృత్తుల్లోకి వెళ్ళిపొమ్మని చంద్రబాబు ప్రజలకు సలహా ఇచ్చిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోగలరని అంబటి అన్నారు. విద్యుత్‌ హార్సు పవర్‌ ధర పెంచివేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. మీరు పెంచేసిన బిల్లులు కట్టలేకపోయిన రైతులపై కేసులు పెట్టేందుకు, జైళ్ళలో తోసేందుకు ప్రత్యేక పోలీసు స్తేషన్లు, కోర్టులు ఏర్పాటు చేసింది చంద్రబాబే అని గుర్తుచేశారు. పెంచిన విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక, చంద్రబాబు దాష్టీకాలకు తాళలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వైనాన్ని ఈ సందర్భంగా అంబటి ఉటంకించారు.

చంద్రబాబు పరిపాలనా కాలంలో వర్షాలు లేక, ఆయన విధానాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరవు ఏర్పడిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన అనంతపురం జిల్లాలో వైయస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 300 గంజి కేంద్రాలు ఏర్పాటు చేస్తే, పనికి ఆహారం పథకం ఉన్నందున గంజి కేంద్రాలు వద్దని చంద్రబాబు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు.

తాను అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ. 1500 పెన్షన్‌ ఇస్తానంటూ చంద్రబాబు తన పాదయాత్రలో హామీలు ఇవ్వడాన్ని అంబటి ఖండించారు. గతంలో ఆయన అధికారంలో ఉన్న అన్నేళ్ళూ కేవలం 75 రూపాయలే ఇచ్చిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారని గుర్తుచేశారు. అప్పుడెందుకు వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు అతి తక్కువ పెన్షన్‌ ఇచ్చారని నిలదీశారు. అదీ కేవలం 19 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మహానేత వైయస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు రూ. 500, రూ. 200 పెన్షన్‌ను 69 లక్షల మందిరి అందజేశారని పేర్కొన్నారు. అప్పుడు రూ. 75 ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న తాపత్రయంతోనే రూ. 1500 ఇస్తానని ప్రలోభ పెడుతున్నారన్నారు. బాబు ఈ ధోరణి హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. 

తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని అంబటి తీవ్రంగా ఖండించారు. పిల్ల కాంగ్రెస్‌ దెబ్బ రుచి చూసినందుకే కదా దిమ్మదిరిగి ఇప్పుడు చంద్రబాబు గింగిరాలు తిరుగుతున్నారని గుర్తుచేశారు. పిల్ల కాంగ్రెస్‌ దెబ్బకు చంద్రబాబు ఎంతలా బెదురుతున్నారో ఆయన పాదయాత్రతోనే ప్రజలందరికీ ఇట్టే అర్థమైందన్నారు. చంద్రబాబూ! ఇంతకు ముందు ఎప్పుడైనా పాదయాత్ర చేశావా? ఏనాడైనా చిన్నపిల్లలను ఎత్తుకుని ముద్దాడావా? వృద్ధులను ఆలింగనం చేసుకున్నావా? పిల్ల కాంగ్రెస్‌ దెబ్బకే కదా అవన్నీ మీకు గుర్తువచ్చాయని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎక్కడికి, ఏ కార్యక్రమానికి వెళ్ళినా విక్టరీ సింబల్‌ చూపించే మీరు వంగి వంగి నమస్కారాలు చేసే సంస్కృతిని ఎందుకు అలవాటు చేసుకున్నారని అంబటి అభినయ పూర్వకంగా ప్రశ్నించారు. ఇదీ పిల్ల కాంగ్రెస్‌ దెబ్బ వల్లే కదా అన్నారు. టిడిపిని, వృద్ధ కాంగ్రెస్‌ను పిల్ల కాంగ్రెస్సే తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని ఆయన హెచ్చరించారు.

చిదంబరాన్ని, ప్రధానిని టిడిపి ఎంపీలు కలిస్తే తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే, వారికి తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వడం తప్పు అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అంబటి సమాధానం చెప్పారు.  ఈ రోజు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలుసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. అది మర్యాదపూర్వకమైనదే అన్నారు. ఆయన రాష్ట్రపతి అయిన తరువాత అభినందించేందుకే ఆమె ప్రణబ్‌తో భేటి అయ్యారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులు, సిబిఐ వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రస్తావన వచ్చిందని మరో ప్రశ్నకు వివరణ ఇచ్చారు.

జైలులో ఉన్న కారణంగా జగన్మోహన్‌రెడ్డి మధ్యలో విరామం ఇచ్చిన ఓదార్పు యాత్ర చేయాలా లేక పాదయాత్ర చేయాలా అది విజయమ్మ చేయాలా? లేక జగన్‌ సోదరి షర్మిల చేయాలా అనే అంశాలు పదవ తేదీన తమ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం జరుగుతుందన్నారు. ఆ వివరాలు మీడియాకు వివరంగా చెబుతామన్నారు. కాగా, సోమవారం జరగాల్సిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశం రాష్ట్రపతి అపాయింట్‌ దొరికినందువల్లే వాయిదా పడినట్లు తాను భావిస్తున్నానన్నారు.

తాజా వీడియోలు

Back to Top