ప్రతి ప్రభుత్వ పథకం డోర్‌ డెలివరీ


–మహానేత హయాంలో 35 వేల ఇళ్లు కట్టించారు..
–చంద్రబాబు హయాంలో ఊరికి 4,5 ఇళ్లు కూడా కట్టించడం లేదు..
–తిత్లీ తుపానుతో ఉద్దానం దయనీయం..
–చంద్రబాబు సాయం చేసింది ఆవగింజంత..
–ప్రచారం మాత్రం కొండంత..
–టీడీపీ నాయకులు మాత్రం భారీగా పరిహారం కొట్టేశారు..
–వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులను ఆదుకుంటాం
–ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.3వేలు ఇస్తాం..
–నష్టపోయిన జీడితోటకు హైక్టారుకు రూ.50వేలకు పెంచి ఇస్తాం..
–ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు కట్టించి ఇస్తాం..
–కిలో జీడిపప్పు ధర రూ.600కు పడిపోయింది..
–చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో మాత్రం జీడిపప్పు కేజీ రూ.1150
–బాబు హయాంలో నత్తనడకన మహేంద్ర తనయ రిజర్వాయర్‌ పనులు
–నిర్మాణ ఖర్చు రూ.127 కోట్లను ఏకంగా 4వేల 70 కోట్లకు పెంచేశారు..
–కమిషన్లు,లంచాల కోసం రేట్లు పెంచేశారు..
–చంద్రబాబుకు కష్టమొచ్చినప్పుడల్లా పవన్‌ ప్రత్యక్షమవుతాడు..
–చంద్రబాబు ఏదో ఆదుకున్నట్టు ఎల్లో పత్రికల్లో ప్రచారం.
–కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబు చేసిందేమిటీ..?
–వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కిడ్నీ స్పెషాలిటీ రీసెర్చ్‌ ఆసుప్రతి ఏర్పాటు
–కిడ్నీ పేషేంట్లకు నెలకు రూ.10వేలు ఇస్తాం..
–మత్స్యకారులకు నిషేధ సమయంలో ఇచ్చే భృతి 4 నుంచి 10వేలకు పెంచుతాం..
–రాష్ట్రంలో కరవు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు..
–రాజధాని పేరుతో చంద్రబాబు సినిమాలు చూపిస్తున్నారు..
–శాశ్వత కట్టడాలకు ఒక్క ఇటుక కూడా పడలేదు..
–రాజధాని పేరుతో బాహుబలి సినిమా సెట్టింగులు చూపిస్తారు..
–ఎన్నికలు 3నెలల్లో ఉన్నాయంటే బాబుకు బిసిలు గుర్తుకొస్తారు..
–నాలుగు కత్తెర్లు,ఇస్తీ్రపెట్టెలు ఇచ్చి కపటప్రేమ చూపిస్తారు..
–ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.550కోట్లు బకాయిలు పడ్డారు.
–బకాయిలు చెల్లించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు..
–గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా..
–ఇసుక నుంచి మట్టి వరుకు అవినీతి..
–ఏపీకి ప్రత్యేకహోదాకు మద్దతి ఇస్తామని కేసీఆర్‌ చెబితే 
   చంద్రబాబు రాజకీయం చేస్తారు..
–25 మంది ఎంపీలకు మరో 17 మంది ఎంపీలు తోడయ్యారని..
ఎవరైనా సంతోషిస్తారు.. కాని చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తారు..
–42 ఎంపీలతో కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి..రాజకీయాలా?


శ్రీకాకుళం: చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందలేదని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రభుత్వ పథకాన్ని డోర్‌ yð లివరీ చేయిస్తామని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి దానికి గ్రామ వాలంటీర్‌ను అనుసంధానం చేస్తామని, ప్రతి పథకం ఇంటికే నేరుగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలాస కేటీ రోడ్డులో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే ఇక్కడి ప్రజలు నాతో అన్నమాటలు ఏంటో తెలుసా..ఇక్కడ రుచికరమైన జీడిపప్పుకు ఫేమస్‌. కానీ ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో మా నియోజకవర్గం మాత్రం టీడీపీ సర్వీస్‌ ట్యాక్స్‌లకు ఫేమస్‌ అంటున్నారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో మేం చూసింది ఏమిటంటే మా నియోజకరవర్గం వసూళ్లకు ఫేమస్‌ అంటున్నారు. మా ఎమ్మెల్యే గారి అల్లుడి గారి గిల్లుడి ఎక్కువైందన్నా..మా ఎమ్మెల్యే అల్లుడు వెంకన్న 
– పలాసలో జీడిపప్పు జీఎస్టీ పోయి టీడీపీ ట్యాక్స్‌ వచ్చిందన్నా..పది కేజీల డబ్బా మీదా లోకల్‌ ట్యాక్స్‌ ఏకంగా రూ.10 వసూలు చేస్తున్నారన్నా..అడిగే నాథుడు లేడన్నా..ఇవ్వకుంటే అధికారులతో దాడులు చేయిస్తున్నారని చెబుతున్నారు.
– పని చేసే వాహనాలకు పెట్రోలు, డీజిల్‌ కూడా ఎమ్మెల్యే అల్లుడి బంకులోనే కొట్టించుకోవాలట. ఈ నియోజకవర్గంలో అంగన్‌వాడీ పోస్టులు అమ్ముకుంటున్నారన్నా..ఈ ప్రాంతంలో ఏ ఒక్క రోడ్డు వేసినా కూడా ఎమ్మెల్యే అల్లుడి ప్లాన్‌లోనే వేయాలట.
– అన్నా..పలాస నియోజకవర్గంలో నాన్నగారి హయంలో అక్షరాల 35 వేల ఇళ్లులు కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌ది అని చెప్పుకొస్తూ..టీడీపీ పాలనలో ఊరికి నాలుగు  ఇళ్లు కూడా కట్టించడం లేదని చెప్పుకొచ్చారు.
– శ్రీకాకుళం జిల్లాలో ఉధ్దానం ప్రాంతం తిత్లీ తుపాను దాటికి రైతులు కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ రోజు విఫత్తును అడ్డుపెట్టుకొని చంద్రబాబు సహాయం చేసింది ఆవగింజంతా..పబ్లిసిటీ చూస్తే ఏ ఆర్టీసీ బస్సు చూసినా చంద్రబాబు ప్లెక్సీలే అన్నా అంటున్నారు. పంట నష్టపరిహారం చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులు పరిహారం కాజేశారని చెబుతున్నారు.
– ఇదే నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్న మాటలు..అన్నా..చంద్రబాబు తిత్లీ తుపాను తరువాత చెక్కులు ఇచ్చారన్నా..ఆ చెక్కులపై చంద్రబాబు తన సుందర ముఖాన్ని వేయించారన్నా..ఆ చెక్కు బ్యాంకుకు తీసుకెళ్తే డబ్బులు ఇవ్వడం లేదన్నా అంటున్నారు. ఇంతటి దారుణంగా సీఎం ఫోటోలు వేసి మోసం చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరేమో..చంద్రబాబు తప్ప. తమకు ఇస్తున్న పరిహారం సరిపోవడం లేదని కొబ్బరి, జీడి రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు.
– తిత్లీ తుపానులో రూ.3435 కోట్ల నష్టం వాటిల్లిందని స్వయంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తే..నేను అందరి తరఫున అడుగుతున్నాను..అయ్యా చంద్రబాబు నీవు ఎంతిచ్చావ్‌. చంద్రబాబు ఇచ్చింది ఎంతో తెలుసా..ఈయన కేవలం 15 శాతము మాత్రమే ఇచ్చారు. ఏ ఆర్టీసీ బస్సును వదిలిపెట్టడం లేదు. ఆ బస్సుపై చంద్రబాబు ఫోటోలు వేయించుకొని తిత్లీ బాధితులు జేజేలు కొడుతున్నట్లు వేయించుకుంటారు. ఎవరైనా చనిపోతే శవాన్ని భుజాన వేసుకొని వెళ్తుంటే కొంత మంది బంధువులు శవంపై చిల్లర వేరుకుంటారు. చంద్రబాబు తీరు చూస్తే మాత్రం ఆ శవంపై చిల్లర ఏరుకుంటున్నట్లుగా ఉంది. బాధితులను ఆదుకోకుండా ఆయన చేయని పనిని చేసినట్లుగా గొప్పగా పబ్లిసిటీ చేయించుకుంటూ అన్యాయం చేస్తున్నారు.
– ఇదే ఉద్దానం ప్రాంత ప్రజలందరికీ ఒక్కటే చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ..జగన్‌ అనే నేను..మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.3 వేలు  ఇస్తామని, నష్టపోయిన ప్రతి జీడీ తోట రైతుకు చెబుతున్నాను. రూ.50 వేలకు పరిహారం పెంచుతామని హామీ ఇస్తున్నాను. తుపాను వల్ల నష్టపోయిన పట్టించుకోని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాను. తుపానులో నష్టపోయిన ప్రతిపేదవాడికి చెబుతున్నాను. రేపు పొద్దున ప్రతి పేదవాడిని నేను కట్టిస్తాను ఇళ్లు అని హామీ ఇస్తున్నాను.
–  ఇదే నియోజకవర్గంలో అత్యధికంగా పండే కొబ్బరి, జీడి పంటలకు గిట్టుబాటు ధర లేదు. క్వింటాల్‌ జీడి పిక్కిలకు రూ.15 వేలు ఉంటే గిట్టుబాటు అవుతుంది. అలాంటిది ఇవాళ రూ.12 వేలకు పడిపోయింది. కిలో జీడి పప్పు ధర కనీసం రూ.800 ఉంటే రైతుకు కాస్తో కూస్తో మిగులుతుంది. ఇవాళ కిలో జీడి పప్పు రూ.600 పడిపోయింది. చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో జీడీపప్పు ధర ఎంతో తెలుసా? కేజీ.రూ.1120  చొప్పున అమ్ముతున్నారు. పలాస జీడిపప్పు దేశంలోనే ఫేమస్‌. ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు షాపుల్లో మాత్రం రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దళారులను కట్టడి చేసి రైతులకు మేలు చేయాలి. చంద్రబాబు తానే దళారీలకు నాయకుడయ్యారు. రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, దాన్ని నాలుగు రేట్ల లాభాలకు అమ్ముకుంటున్నారు. ఇక దళారీ వ్యవస్థ ఎలా కట్టడి అవుతుంది.
– వరి పంటకు కనీస మద్దతు ధర కరువైంది. క్వింటాల్‌ రూ.1100 కొనుగోలు చేసే నాథుడు లేడు. రైతులు ధాన్యం అమ్ముకున్న తరువాత చంద్రబాబు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారులకు మేలు చేస్తున్నారు.
– మహేంద్రతనయ రిజర్వాయర్‌ను నాన్నగారు బతికున్నప్పుడు యుద్ధప్రాతిపాదికన మొదలుపెట్టారు. చంద్రబాబు వచ్చే సరికి 40 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకనా సాగుతున్నాయి. అప్పట్లో రూ.120 కోట్ల ప్రాజెక్టును చంద్రబాబు లంచాలకు కక్కుర్తి పడి ఏకంగా రూ.400 కోట్లకు పెంచేశారు. కమీషన్ల కోసం రేట్లు పెంచారు. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించడం లేదు. 2013 చట్టాన్ని అమలు చేయడం లేదని చెబుతున్నారు. ఎకరాకు రూ.2.50 లక్షలు ఇస్తున్నారంటే నిజంగా వీళ్లు మనుషులేనా?. ప్రతి నిర్వాసితుడికి హామీ ఇస్తున్నాను. 2013 భూసేకరణ చట్టం అమలు చేసి పరిహారం పూళ్లలో పెట్టి ఇస్తామని మాట ఇస్తున్నాను. ఊర్లు ఖాళీ చేసే వారికి చెబుతున్నాను. అయ్యా చంద్రబాబు నీవు అసలు మనిషివేనా? చాలా మంది అర్హులకు ఇప్పటికీ పరిహారం అందడం లేదు. నిర్వాసితులను గుర్తించాలంటే లంచాలు అడుగుతున్నారు.
– కిడ్నీ బాధితులు ఇదే ప్రాంతంలో కలిశారు. కిడ్నీ బాధితులకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా వచ్చి పోరాటం చేశాను. నిద్రపోతున్న చంద్రబాబును లేపినా ఆయన బయటకు రావడం లేదు. పురాణాల్లో ఓ రాక్షససుడు ఉండేవాడు. ఆయన కుంభకర్ణుడు. ఆయన జాతికి చెందిన వాడు ఇక్కడ నారాసుడు ఉన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే వైయస్‌ఆర్‌సీపీ మద్దతుగా నిలిచింది. అప్పట్లో చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాన్‌  ఇక్కడికి వచ్చారు. చంద్రబాబుకు ఎప్పుడు కష్టం వచ్చినా పవన్‌ ముందుకు వస్తారు. తానేదో కొత్తగా కనిపెట్టినట్లు పవన్‌ అంటే చంద్రబాబు వెంటనే పరిష్కరిస్తానని స్టేట్‌మెంట్‌ ఇస్తారు. ఎల్లోమీడియా వెంటనే చంద్రబాబును భుజాన వేసుకొని తాటికాయంత అక్షరాలతో గొప్పగా ఆదుకున్నట్లు ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మరో మూడు నెలల్లో వెళ్లిపోతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. కిడ్నీ బాధితులకు చంద్రబాబు చేసింది ఏమిటీ? టెక్కలి, పలాస, ఇచ్చాపురంలో వేలాది మంది కిడ్నీ బాధితులు ఉంటే కేవలం 370 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. అది కూడా రూ.2500 ఇస్తున్నారు. అదే కిడ్నీ బాధితులకు మందుల కోసం నెలకు రూ.8 వేలు ఖర్చు అవుతుంది. 
– ఇదే జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేసుకునే వారు 4 వేల మంది ఉన్నారు. ఇక్కడ ఉచితంగా డయాలసిస్‌ అందుకునేది 1400 మంది మాత్రమే. ఎవరికైనా డయాలసిస్‌ జరగాలంటే ఒకరు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. అయ్యా చంద్రబాబు కిడ్నీ బాధితులకు నీవు చేసింది ఏమిటీ? జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూస్తే ఒకే ఒక నెప్రాలజీస్టు ఉన్నాడంటే వీరికి కిడ్నీ బాధితులపై ప్రేమ ఉందా అని అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఒక్క ఇటుక అయినా వేశారా? చంద్రబాబుకు మానవత్వం లేదు. ఈయన చేస్తారన్న నమ్మకం ఏ ఒక్కరికి లేదు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కిడ్నీ బాధితులకు చెబుతున్నాను.  ఇదే ప్రాంతంలో ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉండేందుకు కిడ్నీ స్పెషలిటి రిసెర్చ్‌ ఆసుపత్రి కట్టిస్తాం. రెండేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయిస్తానని మాట  ఇస్తున్నాను. డాక్టర్లను అందుబాటులోకి తీసుకొస్తాం. గ్రామాలకు వెళ్లి రక్త పరీక్షలు అక్కడే చేసేలా చర్యలు తీసుకుంటాం. నివారణకు చర్యలు తీసుకుంటాం. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మాట ఇస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తానని హామీ ఇస్తున్నాను.
– కిడ్నీ బాధిత ప్రాంతంలో ఎందుకు వస్తున్నాయంటే..మనం తాగే నీరు కలుషితమవుతున్నాయి. దీన్ని శాశ్వతంగా నివారణ చేసేందుకు వంశాధార నుంచి పైప్‌లైన్‌ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తాం. ప్రతి గ్రామానికి మంచినీరు   అందిస్తాం.
– ఇదే నియోజకవర్గంలో మత్స్యకారులు కలిశారు. అన్నా..మా ప్రాంతంలో పోర్టు వస్తోంది. చంద్రబాబు మత్స్యకారులకు జెట్టీలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 
యాజమాన్యాల కోసం లంచాలు పుచ్చుకొని పోర్టు అప్పజెప్పాడని చెబుతున్నారు. ఆ పోర్టు కోసం భూముల రేట్లు తగ్గించి కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో రూ.4 వేలు చేపల వేట విశ్రాంతి సమయంలో ఇవాల్సి ఉంది. చంద్రబాబు వచ్చాక రూ.4 వేలు ఇవ్వడం మానేశారు. మనందరి ప్రభుత్వం వచ్చాక వేట మీద ఆధారపడ్డ మత్స్యకారులకు చెబుతున్నాను. వేట నిషేద కాలంలో రూ.10 వేలు చెల్లించి అండగా ఉంటాను. పోర్టు పక్కనే జెట్టీ కట్టి మత్స్యకారులకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
– చంద్రబాబు పాలన ఎలా ఉందని ఈ నియోజకవర్గం చూస్తే అర్థం అవుతుంది. రాష్ట్రం వైపు ఒక్కసారి చూడండి. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పరిపాలన ఎలా ఉందో గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన  చేయండి. మనకు ఎలాంటి నాయకుడు కావాలో మీ మనసాక్షిని అడగండి. మన బతుకులు మారాయా? మేలు జరిగిందా? ఆలోచన చేయండి.
– చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రుణాల మాఫి లేదు, సున్నా వడ్డీలు, పావలా వడ్డీలు లేవు. కరువు, తుపాను వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఖరీఫ్‌ అయిపోయింది. రబీ వచ్చినా ఇంతవరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. మన ప్రాంతంలో తుపాను వచ్చినప్పుడు చూశాం.ఈ పెద్ద మనిషి చేసిన సాయం చూశాం. ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల సమయంలో ఏమన్నారు. మహిళ రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. దాదాపుగా ఐదేళ్లు అయిపోయింది..బ్యాంకుల్లో బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి.  సున్నా వడ్డీ రుణాలు  అందుతున్నాయా? . పంటలకు గిట్టుబాటు ధరలు ఉన్నాయా? 
– ఎన్నికలప్పుడు ఏమన్నారు..జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే నెల నెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి రూ.1.10 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డారు. ఎప్పుడైనా కనిపిస్తే గట్టిగా అడగండి.
– చంద్రబాబు చేస్తున్నది ఏంటో తెలుసా? పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటంటే..పునాదులు దాటి ముందుకు సాగడం లేదు. కానీ చంద్రబాబు ఇస్తున్న బిల్డప్‌ ఏంటి? డ్యాంకు గట్టు లేదు. ఇంకా డిజైన్‌ కూడా రూపొందించలేదు. 45 గేట్లలో ఒక్కటి పెట్టి హంగామా చేసి పోలవరంపై సినిమా చూపిస్తున్నారు. రాజధాని అని మరో సినిమా చూపిస్తున్నారు. ఐదేళ్ల కిందట చంద్రబాబు మన వద్దకు వచ్చినప్పుడు గ్రాఫిక్స్‌ చూపించారు. ఇవాల్టికీ పర్మినెంట్‌ పేరుతో  ఒక్క ఇటుక కూడా వేయలేదు. రాజధాని ఎలా ఉందని అడిగితే బాహుబలి సినిమా చూడండి అంటారు. మోసం చేయడంలో ఒ క్క అడుగు ముందుకు వేసి రాజధాని ప్రాంతంలో రెండెకరాల్లో రూ.50 కోట్లు ఖర్చు చేసి బొమ్మ బిల్డింగ్‌లు చూపించడానికి మన ఊర్ల నుంచి బస్సులు వేస్తారట. ఇంతకంటే 420 నాయకుడు ఎవరైనా ఉంటారా? యువనేస్తం అంటూ యువమోసం చేస్తున్నారు.
– ఐదేళ్ల పరిపాలనను ఒక్కసారి చూడండి. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు బాదుడే బాదుడు. ఆర్టీసీ చార్జీలు బ్లాక్‌ టికెట్లలో అమ్ముతున్నారు. ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నీరుగారిపోయింది. బీసీలపై ప్రేమ అని చంద్రబాబు అంటున్నారు. ఈయనకు బీసీలపై ప్రేమ ఎన్నికలకు మూడు నెలల ముందే. నాలుగు కత్తెర్లు, నాలుగు ఇస్తీ్ర పెట్టెలు నాసిరకమైనవి ఇస్తారు. బీసీలపై ప్రేమంటే ఎలా ఉందో చూపించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే. ఏ పేద వాడు తన బిడ్డలను చదివించేందుకు అప్పులపాలు కాకుడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ఇంజినీరింగ్‌ చదవాలంటే ఏడాదికి లక్ష ఫీజులు చెల్లించాలి. చంద్రబాబు ఇచ్చేది ముష్టి వేసినట్లు రూ.35 వేలు ముష్టి వేసినట్లు ఇస్తున్నారు. మిలిగిన డబ్బులు చెల్లించేందుకు ఆ పేదవాడు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. 
– ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్స్‌ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ సేవలు అందక ప్రజలు బాధపడుతున్నారు. చంద్రబాబు పాలనలో 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. 
– ఇవాళ రేషన్‌షాపులో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. అందులో కూడా వేలిముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు. గతంలో రేషన్‌షాపుల్లో 9 రకాల సరుకులు ఇచ్చేవారు. ఇవాళ రేషన్‌ కార్డు, పింఛన్, మరుగుదొడ్డి, ఇల్లు మంజూరు కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ప్రతి గ్రామంలో చంద్రబాబు జన్మభూమి మాఫియాను తయారు చేశారు. ఇవాళ గ్రామా గ్రామంలో వీధి శివారులో మందు షాపులు కనిపిస్తున్నాయి. ఊర్లలో మినరల్‌ వాటర్‌ ఉందో లేదో తెలియదు కానీ. ప్రతి గ్రామంలో మందు షాపులు కనిపిస్తాయి. సీఎం కాగానే బెల్టు షాపులు రద్దు చేస్తామని మొదటి సంతకం చేశారు. చంద్రబాబు పైన కూర్చొని అవినీతి చేస్తారు. ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు, చివరకు గుడి, దళితుల భూముల్లో అవినీతి చేస్తారు. కింద గ్రామాల్లో దోచుకోమని జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇస్తారు. 
– మంచి పరిపాలన అంటున్నారు. నాలుగున్నరేళ్లు ప్రజలను కాల్చుకుతిని  ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారా? పింఛన్లు ఇవ్వని విషయం ఇప్పుడు తెలిసిందట. ఎన్నికలకు మూడు నెలల ముందు కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, బీసీలకు కొన్ని పనిముట్లు ఇస్తారు. మూడు నెలల ముందు కడపకు వెళ్లి స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన అంటారు.   నాలుగున్నరేళ్లు పట్టించుకొని పెద్ద మనిషికి నిరుద్యోగ భృతి గుర్తుకు వస్తుంది. ఈ రోజు పేపర్‌ చూశారా? 5 లక్షల ఇళ్లు కట్టిస్తారట. ఈ ఇళ్లు కూడా కట్టించి ఇవ్వరట. మంజూరు చేస్తారట. పునాదులకు మాత్రమే నిధులు ఇస్తారట. టీడీపీ నేతలు ఇంటికి వచ్చి స్టీక్కర్లు అతికిస్తారట..ప్రజలు జై చంద్రబాబు అనాలట. రుణమాఫి చేయకుండానే రైతులు కేరింతలు కొట్టాలట. ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు ఎగురగొట్టారు. డ్వాక్రా మహిళలకు చెవ్వుల్లో పూలు పెట్టారు. వాళ్లు కూడా జై చంద్రబాబు అంటూ జై కొట్టాలట. 
– నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేస్తారు. అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాదు. ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెట్టిస్తా అంటారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ప్రశ్నిస్తారు. మళ్లీ ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయని తెలిసి తానే యూటర్న్‌ తీసుకొని తానే ప్రత్యేక హోదాకు హీరో అంటూ ధర్నా పోరాట దీక్షలు చేస్తుంటే నిజంగా చంద్రబాబు మనిషేనా?
– నిన్న కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌ ..కేసీఆర్‌ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. అటువంటి నేత ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తానని, అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తామని చెప్పారు. ప్రజల కోసం ఆలోచించే వారు ఎవరైనా దాన్ని స్వాగతిస్తారు. మన ఎంపీలకు పక్క రాష్ట్రంలోని తెలంగాణ ఎంపీలు తోడైతే ఎవరైనా ఆనందపడుతారు. 25 మంది ఎంపీలకు మరో 17 మంది ఎంపీలు తోడై ప్రత్యేక హోదా కోసం స్వరం వినిపిస్తే దాన్ని సంతోషించాల్సింది పోయి దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. 
– ఎన్నికలు జరిగితే తాను చేసిన పరిపాలన మీద, అరాచకాల మీద, రైతుల అగచాట్ల మీద, పాలన వైఫల్యాల మీద ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలుసు. ప్రజలను మభ్యపెట్టేందుకు రోజుకో సినిమా చూపిస్తారు. ఒకరోజు సినిమాలో ఏమంటారో తెలుసా..ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వెళ్తారు. అక్కడ ఇడ్లీ తింటూ సినిమా చూపిస్తారు. కర్నాటకకు వెళ్లి కుమారస్వామితో టీ తాగుతూ మరో సినిమా చూపిస్తారు. పక్కనే ఒడిసా సీఎం ఉన్నారు. మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి సీఎంతో మాట్లాడరు. కలకత్తాకు వెళ్లి మమతా బెనర్జీతో కలిసి భోజనం చేస్తారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేస్తున్న పరిపాలన చూడండి. ఆయన పాలనపై ఎన్నికలు జరిగితే డిపాజిట్లు రావలని తెలిసి రోజుకో సినిమా చూపిస్తున్నారు.
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఎదైనా నాయకుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత వస్తుంది. అది జరగాలంటే జగన్‌  ఒక్కరితో సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి.
– రేపు పొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి దేవుడి ఆశీస్సులు, మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే నా ఉద్దేశం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడవాళ్ల కోసం మనం ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతాను.
– పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు చెబుతున్నాను. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఎంతైతే అప్పు ఉంటుందో  ఆ మొత్తం నాలుగు దఫాల్లో చెల్లిస్తాను. నేరుగా మీ చేతికే ఇస్తాను. అక్క చెల్లెమ్మల చేతుల్లో డబ్బులు ఉంటే ఇళ్లు బాగుంటుందని నాన్నగారు అనేవారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు వైయస్‌ఆర్‌ హయాంలో పావలా వడ్డీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేవారు. మనందరి ప్రభుత్వం వచ్చాక రుణాల విప్లవం తీసుకువస్తాం. మళ్లీ సున్నా వడ్డీ రుణాలు ఇస్తాం. బ్యాంకులకు నేరుగా ప్రభుత్వమే వడ్డీ డబ్బులు చెల్లిస్తోంది. 
– మన బతుకులు మారాలంటే మన పిల్లలు బడి బాట పట్టాలి. ఆ చిట్టిపిల్లలు బడికి వెళ్లి డాక్టర్లు, ఇంజినీర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. రాష్ట్రంలో చదువురాని వారు దాదాపు 32 శాతం మంది ఉన్నారు. చదువుకునేందుకు స్థోమత లేక పిల్లలను చదవించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం రాగానే మీ పిల్లలను ఏ బడికి పంపించినా పర్వాలేదు. ప్రతి చెల్లెమ్మకు ఏడాదికి రూ.15 వేలు  ఇస్తామని మాట ఇస్తున్నాను. కాలేజీకి వెళ్లే పిల్లలకు ఫీజులు కట్టలేక తల్లులు తల్లడిల్లిపోతున్నారు. మీ పిల్లలను కాలేజీలకు పంపించండి..ఏం చదువుతారో చదివించండి..నేను చదివిస్తాను. మీ పిల్లలు హాస్టల్లో ఉండేందుకు అయ్యే ఖర్చులు ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటాను. 
– 45 ఏళ్ల వయసులో ఉన్న అక్కలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఒక్క రోజు పనికి వెళ్లకపోతే పస్తులుండాల్సిందే. అలాంటి అక్కల కోసం చెబుతున్నాను. వైయస్‌ఆర్‌ చేయూత పథకం తీసుకువస్తాం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ మనం ఎదురు చూస్తుంటాం. ప్రతి కులం వారు కూడా కార్పొరేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఊర్లో వెయ్యి మంది ఉంటే కార్పొరేషన్‌ ద్వారా 5 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ తీసుకువస్తాను. రుణాల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ తీసుకువస్తాను. మీ ఊర్లోనే చదువుకున్న పది మందికి ఉద్యోగాలు ఇస్తాను. అంతేకాకుండా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి ఉద్యోగం  ఇస్తాం. ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తాం. గ్రామ వాలంటీర్‌ గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానం అయి ఉంటారు. మీ ఇంటికి రేషన్‌ బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ కూడా పింఛన్, బియ్యం రాలేదని భయపడాల్సిన పని లేదు. ఎటువంటి భయం లేకుండా ప్రతి ప్రభుత్వ పథకం డోర్‌ డెలివరీ చేస్తాం. ప్రతి అక్కకు నాలుగేళ్లలో రూ.75 వేలు కార్పొరేషన్‌ ద్వారా అందజేస్తామని చెబుతున్నాను. ఈ డబ్బంతా కూడా ఉచితంగా ఇస్తామని చెబుతున్నాను. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి ఏటా ఒక డేట్‌ ఇస్తాం. ఆ రోజు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుతో ఏం చేస్తే బాగుంటో సలహాలు ఇస్తాం.
– 60 ఏళ్ల వయస్సులో ఉన్న అవ్వ, తాతలకు చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం రాగానే పింఛన్‌ రూ.2 వేలకు పెంచుతాం. ప్రతి అక్కకు పక్కా ఇల్లు కట్టిస్తాం. నాన్నగారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల  ఇల్లు కట్టించారు. ఇవాళ చంద్రబాబు హయాంలో ఊరికి మూడు నాలుగు ఇళ్లు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితి మార్చేస్తాం. ఇళ్లు లేని నిరుపేదలు ఎవరు లేకుండా చేస్తాం. నాన్నగారి కంటే ఒక్క లక్ష అధికంగా ఇల్లు కట్టించి ఇస్తాం. అంతేకాదు..ఆ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. కారణం ఆ ఇల్లు అక్కచెల్లెమ్మలకు ఆస్తిగా వస్తుంది. రేపు పొద్దున డబ్బు కోసం ఆ ఇంటి పత్రాలను బ్యాంకుల్లో తాకట్టు పెడితే పావలా వడ్డీకే రుణం  ఇప్పిస్తాం.
– ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపించేలా ఒక పని చేస్తాను. 2019 తరువాత 2024లో ఎన్నికలు జరుగుతాయి. 2024లో ఎన్నికలు వచ్చే నాటికి గ్రామాల్లో పూర్తిగా మద్యం లేకుండా చేస్తాను. ఈ పథకం ప్రతి అక్కకు మంచి చేస్తుందని, మన కుటుంబాల్లో ప్రేమ పెరుగుతుందని ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు  ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికి తెలుసు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ  బిడ్డను దీవించమని పేరు పేరున కోరుతూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..
 

తాజా వీడియోలు

Back to Top