అందరూ మోసం చేసినవాళ్లే..వాళ్లను నమ్మకండి





– శ్రీకాకుళం జిల్లాలో మెడికల్‌ కాలేజీ వైయస్‌ఆర్‌ చలువే
– మహేంద్ర తనయ ప్రాజెక్టు పనులు వైయస్‌ఆర్‌ హయాంలో 40 శాతం పూర్తి
– తోటపల్లి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తి చేశారు
– ఎడమ కాల్వ ఆధునీకీకరణ పనులు అలాగే ఉన్నాయి
– తోటపల్లి ఎడమ కాల్వ ఆధునీకరణ జరగ్గ పాలకొండలో సాగునీరు కరువు
– ౖÐð యస్‌ఆర్‌ హయాంలో సునామీ వస్తే 4 వేల  ఇళ్లు కట్టించారు
– ముఖ్యమంత్రిహోదాలో చంద్రబాబు హామీల వర్షం
– పాలకొండను నగర పంచాయతీగా మార్చారు..సౌకర్యాలు కరువు
– వంద పడకల ఆసుపత్రి ఉంది..లంచం ఇవ్వనిదే పురుడు పోయరు
– గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు
– ఏనుగుల దాడిలో అమాయకులు చనిపోతున్నారు..పంటలు నష్టపోతున్నాయి
– విష జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు
– తిత్లీ తుపాను వల్ల రూ.3435 కోట్లు నష్టమని కేంద్రానికి చంద్రబాబు లేఖ
– తుపాన్‌ బాధితులకు చంద్రబాబు ఖర్చు చేసింది రూ.200 కోట్లు మాత్రమే
– అధికారంలోకి వచ్చాక తిత్లీ బాధితులను పూర్తిగా ఆదుకుంటాం
– ప్రజలను ఆదుకోకుండా ఎయిర్‌ షోలు నిర్వహిస్తున్నారు
– నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు గాడిదలు కాశారా? 
– ఎన్నికలు వస్తున్నాయంటే మాత్రం ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయి
– 2014లో చంద్రబాబు బీజేపీతో వచ్చి డ్రామాలు..ఇవాళ యాక్టర్లు మారారు
– బీజేపీ పక్కకు పోయింది..కాంగ్రెస్‌ వచ్చింది
– వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లలో వైయస్‌ఆర్‌సీపీని గెలిపిద్దాం
– కేంద్రంలో ఎవరు ఉన్నా..మెడలు వంచి ప్రత్యేక హోదా సాదిద్దాం
– కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, ఆయన పార్టనర్‌ పవన్‌ను నమ్మకండి
– వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొస్తాం
– వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకుండా చూస్తాం.
 – దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌

శ్రీకాకుళం: కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, ఆయన పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ అందరూ కూడా మనల్ని మోసం చేశారని, వీళ్లను ఎవర్ని నమ్మకండని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, ఆయన బినామీలకు మాత్రమే సామాజిక న్యాయం జరిగిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాల్లో అన్నింటిలో కూడా వైయస్‌ఆర్‌సీపీని గెలిపించుకుందామని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకుందామని జననేత పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 308వ రోజు బుధవారం పాలకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– పాదయాత్ర 12 జిల్లాలు పూర్తి చేసుకొని చివరి జిల్లా శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో మా కష్టాలు రెట్టింపు అయ్యాయని. పట్టించుకునే నాథుడు లేడని ఈ జిల్లా ప్రజలు నా వద్దకు వచ్చి చెప్పారు. మరోవైపు అన్నా..నాన్నగారి హాయంలో జరిగిన మేలు ఇంకా గుర్తు ఉందన్నా..ఇప్పటికీ మరిచిపోలేదని చెప్పుకొచ్చారు. అన్నా..నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మా జిల్లాలో మెడికల్‌ కాలేజీ కట్టాలన్న ఆలోచన ఏ నాయకుడికి రాలేదు. ఇక్కడి మెడికల్‌ కాలేజీ వైఎస్‌ఆర్‌ చలువే అని చెప్పారు. మా జిల్లాలో ఒక యూనివర్సిటీ పెట్టాలన్న ఆలోచన ఏ ఒక్క ముఖ్యమంత్రికి రాలేదన్నా..ఇవాళ అంబేద్కర్‌ యూనివర్సిటీ ఉందంటే అది నాన్నగారి చలువే అని గుర్తు చేశారు. వంశాధార ప్రాజెక్టును చూపించి..అన్నా గతంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు గురించి ఏ నాడు పట్టించుకోలేదు. ఆ తరువాత నాన్నగారు సీఎం అయ్యాక 70 శాతం పనులు పూర్తి చేశారు. ఇవాళ ఆ మిగిలిన పనులు పూర్తి చేయలేని అధ్వాన్న పాలన సాగుతుందని చెప్పుకోచ్చారు. మహేంద్ర తనయ ప్రాజెక్టు 40 శాతం పనులు జరిగాయి. నాన్నగారు చనిపోయాక ఆ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడు లేడన్నా అంటున్నారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం తోటపల్లికి వచ్చి చంద్రబాబు ఒక్క టెంకాయ కొట్టారన్నా..అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు గుర్తుకు రాలేదు. తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పనులు నాన్నగారు పూర్తి చేశారు. ఎడమ కాల్వ ఆధునీకీకరణ పనులు అలాగే ఉన్నాయి. పిల్ల కాల్వ పనులు నిలిచిపోయాయి. దాదాపు 85 వేల ఎకరాలకు నీరు అందించని పరిస్థితి.
– ఏ ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లా గురించి పట్టించుకోలేదు. నాన్నగారి పాలనలో ఈ జిల్లాలో 2 లక్షల ఇల్లు కట్టించారని ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు. నాన్నగారి హాయంలో సునామీ వస్తే..బాధితులందరికీ నాన్నగారు దగ్గరుండి ఇళ్లు కట్టించారని చెప్పారు. అన్నా..ఇవాళ కనీసం ఊరికి నాలుగైదు ఇళ్లు కూడా ఇవ్వని అధ్వాన్న పాలన అని చెప్పుకోచ్చొరు.
– తోటపల్లి ఎడమ కాల్వ ఆధునీకీకరణ పనులు జరగకపోవడంతో ఈ నియోజకవర్గం, పక్క నియోజకవర్గంలో నీరు అందడం లేదు. ఎన్నికలు వస్తున్నాయని ఎడమ కాల్వ పనులకు టెంకాయ కొట్టేందుకు వస్తున్నారట. 
– పాలకొండ మండలంలో జంపరకొండ జలాశయం ఇప్పటికీ పూర్తి కాలేదు. టెట్టంగి గ్రామంలో చంద్రబాబు ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమంలో పాల్గొని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు దిక్కు లేదు. తెట్టంగి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అన్నారు. ఊరికో ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి, సులబ్‌ కాంప్లెక్స్, డ్రైనేజీ, బ్యాంకు పెట్టిస్తానని ఏడాది క్రితం సీఎం స్థాయి వ్యక్తి అంటే ఇవాళ కనీసం ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదంటే ఈ పెద్ద మనిషి నాలుక మీద ఏది వస్తే అది చెప్పుతారనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు.
–తెట్టంగి గ్రామంలో స్కూల్‌ ఉంది. ఈ స్కూల్‌కు చెందిన నాలుగు ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యింది. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఈ భూమి స్కూల్‌కు ఇప్పిస్తా అన్నారు. పాదయాత్రలో ఆ స్కూల్‌ పిల్లలు నా వద్దకు వచ్చి అన్నా..ఆడుకోవడానికి స్థలం లేదని చెప్పారు.
– ఇదే పాలకొండ గతంలో మేజర్‌ పంచాయతీ ఉండేది. ఇప్పుడు దీన్ని నగర పంచాయతీగా మార్చారు. ఇక్కడ సౌకర్యాలు మెరుగుపడలేదు కానీ..ఇంటి పన్ను మాత్రం ఏడాదికి గతంలో రూ.300 ఉంటే ఇప్పుడు రూ.1050 గుంజుతున్నారు. ఇదే పాలకొండలో తాగడానికి నీరు అధ్వాన్నంగా ఉంది. ఇలాంటి కలుషిత నీరు తాగితే పరిస్థితి ఏంటి?. 
– పాలకొండలో 108 పరిస్థితి ఎలా ఉందంటే..ఇక్కడ నాలుగు మండలాలు ఉండాల్సి ఉండగా కేవలం మూడే ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రమే కండిషన్‌లో ఉంది. చివరకు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడం లేదట. 
– పాలకొండలో విష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. వంద పడకల ఏరియా ఆసుపత్రిలో లంచాలు ఇవ్వనిదే ప్రసవాలు చేయడం లేదు.ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండరు. డాక్టర్లు ఏ ఆపరేషన్‌ చేయరట. ఏదైన కేసులు వస్తే శ్రీకాకుళం రెఫర్‌ చేస్తారట.
– సీతంపేట మండలంలో నాలుగు వేల మంది గిరిజనులకు పట్టాలు ఇవ్వడం లేదు. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో ఎనుగుల దాడిలో మనుషులు చనిపోతున్నారు. పంట నష్టం జరుగుతున్నా ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు. 
– గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. గిరిజనుల నుంచి కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు కల్పించాల్సి ఉండగా..పిక్క తీసిన చింతపండు గిరిజనుల వద్ద నుంచి రూ.55 కొనుగోలు చేస్తారు. హెరిటేజ్‌లో మాత్రం కేజీ రూ.390 చొప్పున అమ్ముతున్నారు. మన చింతపండు చాలా ఫేమస్‌..చాలా పేరుంది. అలాంటి చింతపండును కేజీ రూ.55లకే కొనుగోలు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు.
– తిత్లీ తుపాను గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఏదైనా తుపాన్‌ వస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా చేస్తారంటే..పక్కన ఒడిశా ముఖ్యమంత్రి ఏం చేశారో..ఇక్కడ చంద్రబాబు ఏం చేశారో తేడా చూడండి. తుపాను వస్తుందంటే అధికారులను వెంటనే అప్రమత్తం చేస్తారు. రాష్ట్రంలోని అధికారులను తుపాను ప్రాంతాలకు తెప్పించి బాధితులను ఆదుకునే పనులు మొదలుపెడతారు. ఆస్తినష్టం అంచనా వేస్తారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో తిత్లీ తుపాను వచ్చింది. రెండు సంవత్సరాలుగా ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఏ నాడు సాయం చేయలేదు. తిత్లీ తుపాను వచ్చిన తరువాత 11,200 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని లెక్కలు కట్టారు. ఈ లెక్కలు ఎప్పుడు కట్టారో తెలుసా..పది రోజుల తరువాత వచ్చి లెక్కలు కట్టారు. అధికారులు వచ్చి చేసింది ఏంటో తెలుసా..వారికి నచ్చినట్లు లెక్కలు రాశారు. టీడీపీకి చెందిన పది శాతం జనాభాకు మాత్రం రూ.20 వేలు ఇస్తారు. 90 శాతం ఉన్న బాధితులకు మాత్రం రూ.1500, రూ.2 వేలు ఇస్తారు. తిత్లీ తుపానులో చంద్రబాబు ఏమాత్రం డ్రామాలు చేస్తారంటే..సీఎం ప్రధానికి లేఖ రాశారు. తిత్లీ తుపాను వల్ల రూ.3435 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కలు రాశారు. అయ్యా చంద్రబాబు..రూ.3435 కోట్లు నష్టం అని నీవే లెక్కలు రాశావు. నీవు..ఎంత డబ్బు ప్రజలకు ఇచ్చావని అడుగుతున్నాను. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అంటే 15 శాతం కూడా ఈ పెద్ద మనిషి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇందులో ఖర్చు చేసింది కేవలం రూ.210 కోట్లే..కానీ ఈ పెద్ద మనిషి విజయవాడలో ఫ్లెక్సీ కడతారు. తిత్లీ బాధితులను బ్రహ్మండంగా ఆదుకున్నామని ప్రచారం చేస్తారు. ఆర్టీసీ బస్సులపై చంద్రబాబు ఫోటోలు వేయిస్తారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని పబ్లిసిటి ఇచ్చారు. అయ్యా..నష్టం వాటిల్లింది  రూ.3435 కోట్లు అయితే ..నీవు 15 శాతం కూడా ఇవ్వకుండ డ్రామాలాడుతుంటే దీన్ని శవాల మీద చిల్లర ఏరుకోవడం కాదా చంద్రబాబూ?
– తిత్లీ బా«ధితులందరికీ నేను ఒ క్కటే చెబుతున్నాను..రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి..మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక..జగన్‌ అనే నేను..రూ.3435 కోట్లలో ప్రతి రూపాయి మీకు ఇస్తానని హామీ ఇస్తున్నాను.
– చంద్రబాబు పాలన  ఒక్కసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది. రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాలేదు. ఈయన చేసిన రుణమాఫి రైతుల వడ్డీలకే సరిపోలేదు. ఈయన ఎన్నికలప్పుడు బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత బ్యాంకుల్లో బంగారాన్ని వేలం వేస్తున్నారు. నోటీసులు వస్తున్నాయి. పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నారు. చక్కగా వారు రుణం చెల్లిస్తుంటే చంద్రబాబు కట్టొద్దు అన్నారు. ఆయన చేసిన అన్యాయం ఏంటో తెలుసా? గతంలో ప్రభుత్వమే వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టేవారు. చంద్రబాబు వడ్డీ డబ్బులు బ్యాంకులకు చెల్లించకపోవడంతో పావలా వడ్డీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు అందడం లేదు.  ఏ రైతుకు గిట్టుబాటు ధరలు లేవు. పండించిన పంటను అమ్ముకోలేక పోతున్నారు. దళారీ వ్యవస్థను కట్టడి చేయడం లేదు. చంద్రబాబే దళారీలకు నాయకుడిగా మారాడు. హెరిటేజ్‌ షాపు లాభాల కోసం రైతుల వద్ద నుంచి ఈయనే తక్కువ ధరకు కొనుగోలు చేసి మూడింతలు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు.  రైతులు కరువుతో అల్లాడుతున్నారు. చంద్రబాబుకు మనసు కరగదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. రుణాల రీ షెడ్యూల్‌ కావడం లేదు. రైతుల నుంచి వడ్డీలపై వడ్డీలు బాదుతున్నారు. రోమ్‌ నగరం తగులబడుతుంటే..రోమ్‌ చక్రవర్తి ఫిడెల్‌ వాయించినట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. రైతులు కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం విజయవాడలో బోట్‌ రేసులు పెడతారట. విజయవాడలో ఏయిర్‌ షో ఏర్పాటు చేస్తారు. ఈయన మాత్రం కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకొని చూస్తారు. ప్రజలు అవస్థలు పడుతుంటే..చంద్రబాబు సినిమా చూపిస్తున్నారు.
– కరువుతో అల్లాడుతున్న ప్రజలతో ఉండాల్సింది పోయి విమానం ఎక్కి ఒకరోజు కుమారస్వామితో టిఫిన్‌ అంటారు. మరో రోజు స్టాలీన్‌తో భోజనం అంటారు. ఇంకో పూట మమతా బెనర్జితో టీ తాగుతారు. నన్ను విమానంలో చూసేందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెబుతారు. 
– ఈ పెద్ద మనిషి ఎన్నికల సమయంలో ఏమన్నారు..జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే జాబు రావాలంటే బాబు పోవాలి అనే పరిస్థితిలోకి రాష్ట్రం వచ్చింది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యేనాటికి 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తేల్చారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో రిటైర్డు అయిన వారిని చూస్తే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అక్షరాల 23 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..నాలుగున్నరేళ్లు ఈ పెద్ద మనిషి ఏం గాడిదలు కాస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయని అదిగో నోటిఫికేషన్‌..అది 7 వేల ఉద్యోగాలట. అదన్న సక్రమంగా ఇస్తారంటే అది లేదు. సిలబస్‌ పది రోజుల్లో మార్పు. 
– పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు సోమవారం సోమవారం వెళ్తారట. ఆయన అక్కడికి ఎందుకు వెళ్తారో తెలుసా? కాంట్రాక్టర్ల వద్ద లెక్కలు తేల్చుకోవడానికట. నాలుగున్నరేళ్లలో పోలవరం నిర్మాణం పునాదులు దాటలేదు. డిసెంబర్‌ నాటికి ఈయన గేట్లు పెడతారట. ఓ సామెత ఉంది. ఓ పెద్ద మనిషి ఇళ్లు కట్టడానికి పునాది వేశారట. గోడలకు గేట్లు పెట్టి ఇల్లు పూర్తి అయ్యిందని ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టారట. చంద్రబాబు నిర్వాహకం ఇలాగే ఉంది. పోలవరం కాంట్రాక్టర్లను సబ్‌ కాంట్రాక్టర్లుగా తన బినామీలకు అప్పగించి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా అందులో సబ్‌కాంట్రాక్టర్‌గా ఉన్నారు. 
– 2004 ఎన్నికలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబు ఒక హెలికాప్టర్‌ తీసుకొనిఅందులో ఒక ఫోటో గ్రాఫర్, తాఫి మేస్తి్రని పెట్టుకున్నారు. ప్రాజెక్టుకు టెంకాయ కొట్టారు. వెంటనే ఈనాడు దినపత్రికలో పెద్ద పెద్ద అక్షరాలలో తోటపల్లి ప్రాజెక్టు పూర్తి అవుతుందని రాస్తారు. దేవాదుల ప్రాజెక్టు అంతే..టెంకాయ కొట్టిన తరువాత ఏమైంది..నాన్నగారు వచ్చిన తరువాత ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేశారు.
– ఎన్నికలకు మూడు నెలలు సమయం ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గుర్తుకు వస్తుంది. గోదావరి– పెన్నా అనుసంధానం అంటారు. ఇంకా ఏదైనా ప్రాజెక్టు కనిపిస్తే అక్కడికి కూడా వెళ్లి టెంకాయ కొడతారు. తొమ్మిదేళ్ల పట్టించుకోలేదు. ఈ నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. నాగార్జున సాగర్‌లో నికర జలాలు వచ్చినా కూడా సాగునీరు  ఇవ్వరు. పట్టిసీమతో సీమను సస్యశ్యామలం చేశానంటారు. రెయిన్‌గన్లతో కరువును ప్రారద్రోలానని చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం గోదావరి– పెన్నా అంటున్నారు. 
– చంద్రబాబు పాలనలో ఎక్కడ పడితే అక్కడ దోపిడీ, ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు, గుడి భూములు, బడి బూములు, పేదల భూములు, చివరకు గుడి భూములు కూడా వదలడం లేదు.
 – టీడీపీ ఎన్నికల ప్రణాళిక వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఆ మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టారు. ఆ ప్రణాళిక కనిపిస్తే ప్రజలు కొడతారని చంద్రబాబుకు భయం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఎవరికి సామాజిక న్యాయం చేయలేదు. సుజనా చౌదరీ, సీఎం రమేష్, రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌కు వేల కోట్లు రూపాయలు, లింగమనేని, లోకేష్‌కు వేల కోట్ల సామాజిక న్యాయం. దేవినేని, యరపతినేని, చింతమనేని, ప్రత్తిపాటికి, కొమ్మలపాటి, నారాయణ, ఎల్లోమీడియాకు వేల కోట్ల రూపాయల సామాజిక న్యాయం జరిగింది. 
– టీడీపీ పాలనలో కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదవారిలో ఓ స్వప్నాన్ని చూశారు. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్, డాక్టర్‌ రావాలని పేదల చదువుల కోసం ఎంత ఖర్చైనా నేను భరిస్తా అంటూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకువచ్చారు. ఇవాళ ఇంజినీరింగ్‌ చదవాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. పెద్ద చదువులు చదవాలంటే పేదవాడు ఉన్న  ఇంటిని అమ్ముకోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ పడకేసింది. వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రసవం చేయించాలంటే రూ.50 వేలు కావాలి. 108 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో పాలన సాగుతోంది.
– రేషన్‌ షాపుల్లో ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. గతంలో బియ్యంతో పాటు కందిపప్పు, గోదుమలు, చక్కెర, పసుపు, ఉప్పు, చింతపండు, కిరోసిన్‌ ఇచ్చేవారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ పేరుతో మాఫియాను తయారు చేశారు. అర్హుడు ఎవరైనా పింఛన్‌ కావాలని అడిగితే మీరు ఏ పార్టీ అంటున్నారు.
– ఇవాళ గ్రామాల్లో తాగడానికి మినరల్‌ వాటర్‌ దోరుకుతుందో లేదో తెలియదు కానీ..ప్రతి గ్రామంలో వీధి వీధిన బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. ఇది చంద్రబాబు పాలన.
– ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు విమానాల్లో పరుగులు తీస్తున్నారు. ఒక రోజు ఢిల్లీ, మరో రోజు బెంగుళూరు, చెన్నై అంటారు. చంద్రబాబు కలుస్తున్న ఈ నాయకులంతా కూడా కాంగ్రెస్‌లోని యూపీఏ కూటమిలో ఉన్నవారే. లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారే. వారి వద్దకు వెళ్లి ఈయన సుందర ముఖారవిందాను చూసి వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉ న్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారు.
– 2014 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీ బొమ్మ పెట్టుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌ బొమ్మ పెట్టుకున్నారు. ఆ రోజు బీజేపీతో ఇవే మాటలు చెప్పించారు. ఆ రోజు నరేంద్రమోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఈ రోజు యాక్టర్లు మారిపోయారు. కాంగ్రెస్‌ వచ్చింది. మళ్లీ కాంగ్రెస్‌ అవే మాటలు..వాళ్లు కొత్తగా ప్రత్యేక హోదా ఇస్తారట.  అదే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టేసమయంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని  విడగొట్టింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా డిమాండును కాంగ్రెస్‌ పార్టీ విభజన చట్టంలో పెట్టి ఉంటే కోర్టుకు వెళ్లి సాధించేవారం కాదా? కడప స్టీల్‌ ప్లాంట్‌ నుంచి దుగ్గరాజపట్నం వరకు, విశాఖ రైల్వే జోన్‌ నుంచి కారిడార్‌ వరకు ఇచ్చిన హామీని సాధించుకునేవాళ్లం. అదే రోజు కాంగ్రెస్‌ తప్పకుండా చేస్తామని చట్టంలో పేర్కొని ఉంటే సాధించేవాళ్లం కాదా? అదే కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుకు చెడ్డ..2019 వచ్చే సరికి ముద్దు అయ్యింది.
– ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. విడాకులు తీసుకున్నప్పుడు గుర్తుకు వచ్చింది. మిమ్మళ్లందరికి ఒక్కటే చెబుతున్నాను. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ను నమ్మకండి. వీళ్లందరూ కూడా గత ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఆ తరువాత వీళ్లందరూ మోసం చేశారు. హత్య చేసేదాంట్లో ఒకరు కత్తి ఇస్తే..ఇంకొక్కరు చేతులు పట్టుకున్నారు. ఇంకొకరు పొడిచారు కాబట్టే మన పరిస్థితి ఇలా తయారైంది. 
– రేపు పొద్దున 2019లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్లను, వీళ్లును ఎవరిని నమ్మకండి. అన్ని ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందాం. వైయస్‌ఆర్‌సీపీని గెలిపిద్దాం. 25 స్థానాలు మన వద్దే పెట్టుకుందాం. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మద్దతిద్దాం. వారిని న మ్మి మోసపోవద్దని కోరుతున్నాను. ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలి. రాజకీయాల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఇదంతా జరగాలంటే ఒక్క జగన్‌తో సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి ఆశీస్సులు కావాలి..దీవెనలు కావాలి. 
– ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ పడకేసింది. పలాస వచ్చినప్పుడు కిడ్నీ పేషేంట్ల పరిస్థితి చూశాను. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాను. మనందరి ప్రభుత్వం వచ్చాక మీ అందరికి హామీ ఇస్తున్నాను. ప్రతి పేదవాడికి ఏ ఆపరేషన్‌ అయినా సరే..వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాను. మంచి ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఆపరేషన్‌ చేయించుకున్న తరువాత విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి చెబుతున్నాను. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాను. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా చేస్తాం. నవరత్నాల్లో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
– మా అక్క కళావతి గురించి చెప్పడం మరిచిపోయాను. అక్కను విఫరీతంగా ప్రలోభపెట్టారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా నమ్మినదాన్ని వదిలిపెట్టలేను. నీతితో, నిజాయితో ఉంటానని చెప్పింది ఈ అక్క. కళావతి అక్కకు నా మనస్సులో స్థానం ఉంటుంది. ఎప్పటికీ వదిలిపెట్టను. 

 

తాజా వీడియోలు

Back to Top