ఉద్దానం ప్రాంతానికి మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి బాబూ?

339వ రోజు పాదయాత్ర డైరీ
 
ఇప్పటివరకు నడిచిన దూరం – 3,628.2 కి.మీ.

339వ రోజు నడిచిన దూరం – 10.2 కి.మీ.

07–01–2019, సోమవారం,

జగతి, శ్రీకాకుళం జిల్లా.

ఈరోజు మాణిక్యపురం, బల్లిపుట్టుగ, వరక, బొరివంక, జగతి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఉదయం వికలాంగుల హక్కుల సంఘం ప్రతినిధులు కలిశారు. బాబుగారి పాలనలో ఉద్యోగాలే భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులు కుటుంబానికి భారం కారాదని, ఆ విధివంచితులు సమాజంలో గౌరవంగా బతకాలని.. నాన్నగారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. ఉద్యోగావకాశాలు కూడా కల్పించారు. ఇప్పుడా అవకాశాలు మృగ్యమయ్యాయన్నది వారి వ్యథ. 

ఉదయం భీమవరం నుంచి వచ్చిన నిర్మలకుమారి, విమలకుమారి అనే అక్కాచెల్లెళ్లు ఇదే విషయం చెప్పారు. వారి చెల్లెలు శాంతకుమారి పుట్టుకతోనే మూగ, చెవుడు. నాన్నగారి హయాంలో ఆ దివ్యాంగురాలికి వచ్చిన ఉద్యోగమే ఆమె జీవితాన్ని నిలబెట్టిందట. మా కుటుంబమంతా రుణపడి ఉన్నామని ఆ అక్కాచెల్లెళ్లు చెబుతుంటే చాలా సంతోషమనిపించింది. నా పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా.. రోజూ ‘సాక్షి’లో వచ్చిన పాదయాత్ర డైరీ పేజీలను సేకరించి, పుస్తకంలో పొందుపరిచి బహూకరించారు. పదమూడు జిల్లాల్లో జరిగిన పాదయాత్రపై కవితను కూర్చి వినిపించారు. నన్ను కలిసిన ఆనందంతో ఉద్వేగానికి గురై కంటతడిపెట్టడం కదిలించింది.  

ఈరోజు పాదయాత్ర జరిగిన ప్రాంతమంతా కొబ్బరిచెట్లే. అతి పొడవుగా పెరిగే దేశీయ చెట్ల కొబ్బరి ఈ ప్రాంతానికే ప్రత్యేకం. ఉత్తరాది రాష్ట్రాలకు బాగా ఎగుమతి అవుతుంది. నూనె శాతం, పోషక విలువలు అధికంగా ఉండి నాణ్యమైన కొబ్బరినందించే ఈ చెట్లను ఇప్పుడు తిత్లీ తుపాను దారుణంగా దెబ్బతీసింది. ఎటు చూసినా పూర్తిగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు, వాలిపోయిన చెట్లే కనిపించాయి. ఉద్దానం కొబ్బరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు కోనసీమను మరిపించిన ఈ కొబ్బరి తోటల్లో నేడు స్మశాన ఛాయలు కనిపిస్తున్నాయి.  

ముప్పై, నలభై ఏళ్ల చెట్లు అలా నేలవాలిపోవడంతో, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో చీకట్లు పరుచుకున్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్టంటే ఇంటికి పెద్ద కొడుకుతో సమానం. మళ్లీ చెట్లను నాటినా ఫలసాయం రావడానికి పదేళ్లు పడుతుందని వాపోయారు. వలసలు మినహా మరో గతి లేదంటూ రైతన్నలు కన్నీటిపర్యంతమయ్యారు.  

ఇక్కడి కళింగపట్నం, ఇద్దెవానిపాలెం తదితర గ్రామాల్లో కేవలం పిల్లలు, వృద్ధులు, మహిళలు తప్ప మగవాళ్లందరూ వలసెళ్లి పోయారని తెలిసి చాలా బాధేసింది. కుసుంపురం వద్ద రోడ్డు పక్కనే పెద్ద అమ్మవారి గుడి ఉంది. దాన్ని కేవలం వలస కార్మికులే నిర్మించారట. అది ఈ ప్రాంత వలసల తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడి ప్రజలకు చేయూతనిచ్చి, వలసలను నివారించి ఉద్దానానికి పునర్వైభవం తేవాలన్న నా సంకల్పం మరింత బలపడింది.  

సర్వశిక్షా అభియాన్‌లో పనిచేసే కంచిలి, కవిటి మండలాల ఉద్యోగులు కలిశారు. ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటూ వేతనాల్లో మాత్రం కోత విధిస్తోందని చెప్పారు. పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చిన బాబుగారు ఓట్లేయించుకుని మోసం చేశారని వాపోయారు. 

ఈరోజు ఉదయం నడిచిన గ్రామాలన్నింటిలో బెం తో ఒరియా కులస్తులు అత్యధికంగా ఉన్నారు. గతంలో ఎస్టీలుగా గుర్తించిన తమకు ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వ డం లేదని మొరపెట్టుకున్నారు. తల్లిదండ్రులకేమో ఎస్టీ సర్టిఫికెట్లున్నాయి. పిల్లలకు మాత్రం ఇవ్వడం లేదట. ‘సంవత్సరాలుగా కుల ధృవీకరణ లేక, కనీసం నేటివిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి?’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ ఉద్దానం ప్రాంతానికి కొబ్బరి పరిశోధన కేంద్రం, కోకోనట్‌ ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తానంటూ మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి? కొబ్బరి తోటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నా.. పరిహారం మాత్రం ఇవ్వడం లేదని, చెల్లని చెక్కులిచ్చి మోసం చేస్తున్నారని మొరపెట్టుకుంటున్న రైతన్నలకు ఏం సమాధానం చెబుతారు? మూడేళ్లకే ఫలసాయాన్ని అందించే కొబ్బరి మొక్కలను సరఫరా చేస్తానన్నారు. ఆ కార్య క్రమం ఏమైంది? 
-వైఎస్‌ జగన్‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top