ఉరవకొండ: మహిళా సాధికారతకు పెద్ద పీట వేశామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందని ఉద్ఘాటించారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేశాడని గుర్తు చేశారు. అక్టోబర్ 2016 నుంచి ఆ అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశాడు. అప్పట్లో.. పొదుపు సంఘాల రుణాలు కాస్త.. తడిసి మొపెడు అయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు. ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉరవకొండలో వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి డబ్బులు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. చిక్కటి చిరునవ్వులు మధ్య ఇంతటి ప్రేమానురాగాలు మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వాగ్ధానాన్ని పూర్తి చేస్తున్నాం... నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతున్నాం. దేశ చరిత్రలోగానీ, మహిళా చరిత్రలోగానీ, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకొంటే అక్షరాలా రూ.25,570 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ రోజు ఎక్కడైనా దేశం బాగుంది, రాష్ట్రం బాగుంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే... ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు, వాళ్ల పిల్లలకు నాణ్యమైన విద్య అంతుందా? లేదా? అన్న ప్రామాణికం. వారి అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, వారికి లభిస్తున్న భద్రత, రక్షణ.. రాజకీయంగా అధికారంలో దక్కుతున్న వాటా ఇవన్నీ లెక్కేసుకుని మహిళా సాధికారత విషయంలో ఒక రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందంజలో ఉంటే.. రాష్ట్రం కూడా మందంజలో ఉంటుందని అందరూ నమ్ముతారు. మన రాష్ట్రం నుంచే 21వ శతాబ్ధపు ఆధునిక మహిళ... ఈరోజు నేను గర్వంగా చెబుతున్నాను. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21 వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డమీద, గడపగడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో 56 నెల్లలో మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగూ వేసింది. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం, అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోంది. ఈరోజు రూ. 6,400 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. ఈ ఒక్క పథకానికి సంబంధించి రూ. 25,570 కోట్లు ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం. 4 దఫాల్లో 79 లక్షల మంది మహిళలు మంచి చేస్తూ.... 79 లక్షల మందికి మంచి చేస్తూ.. ఇప్పటికే 3 దఫాల్లో రూ.19,178 కోట్లు ఇవ్వడమే కాక, నాలుగో దఫా కింద ఇవాళ ఇస్తున్న రూ.6,400 కోట్లు కలుపుకొంటే రూ.25,570 కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా ఇచ్చినట్లవుతుంది. ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా ఇచ్చింది. వాళ్ల కాళ్ల మీద వాళ్లాను నిలబెట్టడం కోసం వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా రెండు కార్యక్రమాలు తీసుకుంటే రూ.31వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈరోజు నేడు విడుదల చేస్తున్న రూ.6,400 కోట్లతో కలుపుకొంటే మనందరి ప్రభుత్వం 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.53 లక్షల కోట్లు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎన్నడూ జరగని విధంగా, లంచాలకు వివక్షకు చోటు లేకుండా రాష్ట్రంలో మీ బిడ్డ పాలనలో చేయడం కూడా ఒక రికార్డే. పథకాలు అమల్లో తేడా.. నాడు–నేడు. ఆశ్చర్యమేమిటంటే... ఏ పథకంలోనైనా... ఎక్కడ? ఎవరు? ఎవరికి? ఇస్తున్నామనే వ్యత్యాసం చూపించడం లేదు. గతంలో ఏ పథకం కావాలన్నా మొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? అంతటితో ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీలు దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికీ లంచాలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు రూ. 2.53 లక్షల కోట్లు ఎక్కడా కులం చూడటం లేదు, మతం, ప్రాంతం, వర్గం, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా.. మన పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి నేరుగా పోతోంది. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటింటా అక్కచెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 56 నెలల పాలనలోనే మహిళాసాధికారత కోసం ఏం చేశామో నాలుగు మాటల్లో చెబుతాను. ఒక్క జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్షరాలా 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి సొమ్ము రూ.26.67 వేల కోట్లు ఇచ్చాం. వైయస్సార్ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25,500 కోట్లు ఇవ్వడం జరిగింది. వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45–60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏకంగా 31.23 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ వారు బాగుండాలని, చిరునవ్వులు చూడాలని అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.14,129 కోట్లు. ఈ 56 నెలల కాలంలోనే నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండాలని ఏకంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 22లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ కడుతున్న ఇళ్లు పూర్తయితే రూ.2.70 లక్షలతో ఇళ్లు కడుతున్నాం. ఇళ్లు పూర్తయితే .... ఒక్కో ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5–20 లక్షల దాకా పలుకుతోంది. వాళ్లకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.2–3 లక్షల కోట్లు. అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద తమ కాళ్ల మీద నిలబెట్టేందుకు కోటీ 5 లక్షల మందికి మంచి జరిగిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ కింద ఇచ్చినది రూ.4,968 కోట్లు. ఈ 56 నెలల కాలంలోనే 25.40 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ పిల్లల కోసం విద్యాదీవెన కింద రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.4275 కోట్లు ఇచ్చాం. వీటితో పాటు కాపు అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం కింద రూ.2028 వేల కోట్లు ఇచ్చాం. పేద ఓసీ అక్కచెల్లెమ్మల సాధికారత కోసం ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు ఇచ్చాం. పేదల పెన్షన్ అందుకుంటున్న వారు దాదాపు 66.34 లక్షల మంది ఉంటే.. ఇందులో నా 43,78,000 మంది పెన్షన్లు అందుకుంటున్న వారు నా అవ్వలు, నా అక్కచెల్లెమ్మలే. ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా, అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ.. చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా ? అని అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టి పోతున్నారు. ఇది జరుగుతున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఈ పెన్షన్ల సొమ్ము కింద ఖర్చు చేసిన సొమ్ము రూ.84,730 కోట్లు. ఇందులో రూ. 56,000 కోట్లు అవ్వలు, అక్కచెల్లెమ్మల పెన్షన్ కోసం ఖర్చు చేశాం. చిరువ్యాపారాలు చేసుకుంటున్న అక్కచెల్లెమ్మలకు జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రూ.2,610 కోట్లు అయితే, చేదోడు ద్వారా వాళ్లకు ఇచ్చిన సొమ్ము రూ.404 కోట్లు. గతంలో ఇన్ని కార్యక్రమాలు చూశామా... ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసిందిగానీ, వారి పిల్లల గురించి, కుటుంబాల గురించి గాని పట్టించుకున్నది ఎప్పుడైనా చూశామా? గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మిగలినవన్నీ మామూలే. అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనిపిస్తోంది. గతంలో ఐదేళ్ల కాలంలో ఎందుకు ఈ మంచి జరగలేదనేది ఆలోచన చేయమని అడుగుతున్నాను. కారణం ఒక్కటే. గతంలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లు ఉంటే... ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎవరూ లంచం అడగడం లేదు, వివక్ష చూడం లేదు. పండగలా–ఆసరా కార్యక్రమం.. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ దాకా పండుగ వాతావరణంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.6400 కోట్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకుంటారు. అక్కచెల్లెమ్మల సంతోషాల్లో వీళ్లు ఏకమవుతారు. గ్రామ సచివాలయాల్లో మాట్లాడినప్పుడు అక్కచెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయన్న కథలు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే వినిపించాలి. ఈ రాష్ట్రంలో వైయస్సార్ ఆసరా, చేయూత, అమ్మఒడి మూడు కార్యక్రమాలతో పాటు సున్నావడ్డీ కలవడం రాష్ట్రంలో ఎంత మంచి జరిగిందనేది ఆలోచన చేయాలి. గతానికి ఇప్పటికీ తేడా గమనించాలి. 2014లో బాబు కట్టుకథలు... 2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు. అక్టోబర్ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. అప్పట్లో రూ.14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపుడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి రూ.25,500 కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు. చంద్రబాబు చేసిన మోసం వల్ల ఏ గ్రేడ్, బీ గ్రేడ్ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో ఏకంగా 19 శాతానికి పడిపోయాయి. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి. 19శాతానికి పడిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లో సంఘాలుగా ఉన్నాయి. గతంలో ఔట్ స్టాండింగ్ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలన్నీ (నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్స్) ఎన్‌పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్‌పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి. తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే అన్నది గమనించాలి. అక్కచెల్లమ్మలకు అండగా నామినేటెడ్ పనులు–పదవుల్లోనూ.. ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలు సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది. అంతే కాకుండా ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి. నామినేషన్‌లో ఇచ్చే కాంట్రాక్ట్ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ రోజు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్ అక్కచెల్లెమ్మల కోసమే నియమితులయ్యారు. ఇవాళ అక్కచెల్లెమ్మల కోసం దిశ యాప్ తీసుకొచ్చాం. ఏకంగా 1.46 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ డౌన్‌లోడ్ అయ్యింది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు.. పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. చెడు మాత్రమే చేసిన చంద్రబాబు ముఠా... ఇంత మంచి మనం చేసినా... ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది. నేడు ప్రతి ఇంట్లో చేసిన మంచి కనిపిస్తుంది. కారణం ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్ధాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్దాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు. చేసిన మంచి లేకపోయినా బాబుకు–స్టార్ క్యాంపైనర్లు... ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా.. మంది ఉన్నారు. బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్‌గా ఉన్న దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు. వీళ్ల ముగ్గురూ పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటారు. అక్కడున్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లంతా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. పసుపు కమలాలు... వీళ్లుకాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు.. వీళ్లంతా చంద్రబాబుకు తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న.. అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా ఇంకొంత మంది బాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరకాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు. టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకుల పేరిట కనిపిస్తారు, వేదికల పేరు మీద, మేధావులు అని చెప్పుకుంటూ కనిపిస్తారు. రక రకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం పని చేస్తారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లందరూ భాగస్వాములే. మీ బిడ్డకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. ఏ అభివృద్ధీ చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లూ లేరు. కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు. వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు. వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా... మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా? కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా.. కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను. మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు.. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైయస్సార్ ఆసరా అందుకున్న నా 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన 30 లక్షల మంది కుటుంబాలు.. వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ప్రభుత్వ బడుల ఇంగ్లిషు మీడియం పిల్లలూ స్టార్ క్యాంపెయినర్లే... ఇంగ్లిషు మీడియం ద్వారా బడులు, బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. గ్రామంలో వచ్చిన మార్పులు కళ్లారా చూసిన గ్రామీణ ప్రజలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. సేవా సైన్యమూ స్టార్ క్యాంపెయినర్లే... ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ ఆదివారమైనా, సెలవురోజైనా ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే తలుపుతట్టి గుడ్‌మార్నింగ్ చెబుతూ పెన్షన్ డబ్బులు అందజేస్తున్న 2.50 లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలు సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా 2.53 లక్షల కోట్లు బటన్ నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నాను. మీ బిడ్డ పైన దేవుడుని– కింద మిమ్మల్నే నమ్ముకున్నాడు... మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు. చంద్రబాబు మాదిరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి అండదండలు లేవు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద మిమ్మల్ని తప్ప ఇంకొకర్ని మీ బిడ్డ నమ్ముకోలేదు. రాబోయే రోజుల్లో అబద్ధాలు మోసాలు చేస్తారు. కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామంటారు. ఆలోచన చేయమని కోరుతున్నా. మీ ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని మిమ్మల్నందరినీ కోరుతున్నా. మీ బిడ్డకుసైనికులుగా మీరే నిలబడండి. జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. కారణం మీరు వేసే ఓటు జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కాదు.. మీరు వేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం పేదరికం నుంచి బయట పడాలి అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుందన్న వాస్తవాన్ని మాత్రం మర్చిపోకండని గుర్తు చేస్తున్నాను. మంచి చేసే అవకాశం, పరిస్థితులు ఇంకా ఎక్కువ దేవుడు ఇవ్వాలి, మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇంకా చూడాలి,మీ పిల్లల బతుకులు ఇంకా బాగుపడాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. చివరిగా... కాసేపటి క్రితం విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గానికి జరిగిన మంచి గొప్పగా చెపుతూ.. మరోవైపు జరగాల్సినవి, చేయదగినవిఅడిగాడు. తాను అడిగినట్టు జీడిపల్లి రిజర్వాయరు, బెలుగుప్ప మండలానికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకు సంబంధించి పనులు వేగవంతం చేస్తాం. 76వేల ఎకరాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ ఛానెల్ సిస్టం కోసం రూ.68 కోట్లు అడిగాడు. దీని గురించి అడుగులుముందుకు పడతాయి. బీసీ రెసిడెన్షియల్ పెన్నా అహోబిలంలో అడిగాడు. దీనికోసం రూ.33 కోట్లు కేటాయిస్తున్నాం. అదే విధంగా 12 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల కోసం రూ.20 కోట్లు అడిగాడు. ఇది కూడా మంజూరు చేస్తున్నాం. ఉరవకొండ పట్టణంలో 10వేలు ఇళ్లు గతంలో ఉంటే మనం మరో 8వేలు ఇళ్లు కడుతున్నాం అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. దేవుడి దయతో ఇంతమంది అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. దీనికి దేవుడికి రుణపడి ఉంటానని, మీ అందరికీ మంచి జరగాలని మనసారా ప్రార్ధిస్తూ సెలవు తీసుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.