యువతకు మంచి రోజులు ముందున్నాయ్‌!

గొల్లలమామిడాడ (తూ.గో.జిల్లా),

11 జూన్‌ 2013: 'అందరికీ మంచి రోజులు వస్తాయి.. కొద్ది కాలం ఓపిక పట్టండి' అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల యువతకు భరోసా ఇచ్చారు. విద్యార్థులు చదువుకోవడం ఎంత ముఖ్యమో వారికి ఉద్యోగాలు కల్పించడమూ అంతే ముఖ్యమని శ్రీమతి షర్మిల అభిప్రాయపడ్డారు. మరి కొద్ది నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయని, జగనన్న సిఎం అవుతారని, రాజన్న రాజ్యం దిశగా మనందర్నీ నడిపిస్తారన్నారు. రాజన్న రాజ్యంలో అందరి బాగోగులనూ జగనన్న చూసుకుంటారని చెప్పారు. జగనన్న సిఎం అయ్యాక రైతులు, పేదలు, గ్రామాల సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో విద్యార్థులకు మేలు చేయడానికి కూడా అంతే నిబద్ధతతో వ్యవహరిస్తారని ఆమె హామీ ఇచ్చారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ప్రజలకు చేసిందేమీ లేదని ఆమె ఆరోపించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వమూ చంద్రబాబు తరహాలోనే ప్రజలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఎంతో గొప్ప మనసు ఉంది కనుక ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో మంగళవారం సాయంత్రం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చిరునవ్వుతో, ఓపికగా, సూటిగా సమాధానాలు చెప్పారు.

ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి విద్యార్థీ రాజకీయాల్లోకి రావాలని, అందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుంద‌ని శ్రీమతి షర్మిల చెప్పారు. విద్యార్థి సంఘాలు లేకపోతే వారి సమస్యలు ప్రభుత్వానికి ఏ విధంగా తెలుస్తాయని, అందుకే జగనన్న పాలనలో విద్యార్థి సంఘాలను ప్రోత్సహిస్తారన్నారు. విద్యార్థి సంఘాలను చంద్రబాబు నాయుడు హయాంలో రద్దు చేసిన విషయాన్ని ఒక విద్యార్థి ప్రస్తావించినప్పుడు శ్రీమతి షర్మిల పై విధంగా స్పందించారు. గ్రామీణ యువతకు కూడా సమానావకాశాలు కల్పించాలని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ ఐటిలను ఏర్పాటు చేశారని, కిరణ్‌ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని ఆమె అన్నారు. జగనన్న సిఎం అయ్యాక ట్రిపుల్‌ ఐటిలకు మరింతగా పూర్వ వైభవాన్ని తీసుకువస్తారని హామీ ఇచ్చారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. అయితే.. వాటిలో పది శాతం కూడా అమలు చేయలేకపోయారని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా చేయాలని జగనన్న కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఐదేళ్ళలో జగనన్న 70 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు విద్య నేర్పించాలని మహానేత వైయస్‌ కృషి చేశారని, జగనన్న ఆ విధానాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని చెప్పారు. ఈబీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్సుమెంటు చేసి లక్షలాది మందిని ఉన్నత విద్యను అందించిన మహామనిషి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. జగనన్న వచ్చాక కూడా డబ్బులు లేని కారణంగా ఏ విద్యార్థీ విద్యకు దూరం కాకుండా చూస్తారని శ్రీమతి షర్మిల తెలిపారు.

డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చినవీ, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఉద్యోగాలు కూడా చెప్పినవే కాకుండా మరిన్ని ఎక్కువగా ఇచ్చారన్నారు. కిరణ్‌ సిఎం అయ్యాక యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు మేలు చేయాలనే తపన నాయకుడనే వాడికి ఉండాలని అది చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలో లేవని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలైనా ఇస్తారు, ఎన్ని వాగ్దానాలైనా చేస్తారని అయితే మాట మీద నిలబడడం ఆయనకు చేతకాదన్నారు. విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అసలు నిరుద్యోగమే లేకుండా జగనన్న చేస్తారని, ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పిస్తారని ఆమె హామీ ఇచ్చారు.

విద్యార్థులు, ప్రజల సమస్యలన్నీ జగనన్నకు తమ కన్నా ముందే తెలుసని, అందుకే వాటి పరిష్కారానికి ఆయన కంకణబద్ధుడై ఉన్నారని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు శ్రీమతి షర్మిల సమాధానం చెప్పారు. నిజానికి జగనన్న తమ కంటే మూడేళ్ళు ముందు నుంచే ప్రజల మధ్యలోనే ఉన్నారని అందుకే అందరి సమస్యలూ పూర్తిగా తెలుసన్నారు.

విద్యార్థులను బడికి కాకుండా పనికి పంపించడమంటే కన్నతల్లికి ఎంత కష్టమో తమకు తెలుసని శ్రీమతి షర్మిల అన్నారు. అందుకే జగనన్న 'అమ్మ ఒడి' పథకానికి రూపకల్పన చేశారన్నారు. జగనన్న సిఎం అవగానే విద్యార్థులను బడికి పంపించే తల్లుల ఖాతాలో నెలనెలా డబ్బులు జమచేస్తారని ఆమె చెప్పారు.

అందరికీ మేలు జరగాలని కోరుకున్న, ఆ దిశగా కృషి చేసిన మహానేత రాజశేఖరరెడ్డి మన దురదృష్టం కొద్దీ వెళ్ళిపోయారని శ్రీమతి షర్మిల ఆవేదనగా చెప్పారు. రాజన్న మరణంతో తమ కుటుంబంతో పాటు అందరికీ దిగులుగా ఉందని విచారం వ్యక్తం చేశారు. జగనన్న జైలు నిర్బంధంలో ఉండడం, ఎంతో కష్టమైన సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఎలా ఫీలవుతున్నారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితి వస్తుందని ఏనాడూ ఊహించలేదన్నారు. తాను మాత్రమే కష్టపడుతున్నానని తాను అనుకోవడం లేదన్నారు. కాళ్ళు, చేతులు కట్టి పడేసినట్లు కుట్ర చేసి జగనన్నను జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న త్వరలోనే తప్పకుండా వస్తారని, రాజన్న రాజ్యం వైపు మనందర్నీ నడిపిస్తారన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌, టిడిపిలకు ఇంటికి పంపించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి జగనన్నకు అధికారం అప్పగించాలని ముఖాముఖీలో పాల్గొన్న శ్రీమతి షర్మిల విద్యార్థినీ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. జగనన్న సిఎం అయ్యాక రాజన్న పథకాలన్నింటికీ ప్రాణం పోస్తారని హామీ ఇచ్చారు.

Back to Top