హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2012 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వైయస్‌ఆర్ విగ్రహానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహానేత వర్ధంతి సందర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రక్తదాన, వైద్య శిబిరాలను మేకపాటి ప్రారంభించారు.ఈ సంర్భంగా మేకపాటి మాట్లాడుతూ, వైయస్‌ఆర్ మరణం తర్వాత రాష్ట్రం అనాథగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగానూ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల ఖేల్ ఖతం అయిపోయిందని వ్యాఖ్యానించారు. వైయస్ జగన్మోహన్‌రెడ్డి గురించి అసందర్భంగా మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుకు ప్రజలే అతి త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. వైయస్ జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆయన తెలిపారు. ప్రజల సారథిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన అన్నారు. కన్న తండ్రికి నివాళులు అర్పించే అవకాశం కూడా జగన్‌కు లేకుండా పోయిందని, ఇది దురదృష్టకరమని పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. వి.హెచ్. గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఆయనను ప్రజలు చెప్పుతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయచందర్, రాజ్ ఠాకూర్, వైయస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.