మంచికి వైయస్ఆర్‌సీపీ మద్దతు

హైదరాబాద్:

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏ పని చేసినా గుడ్డిగా వ్యతిరేకించకుండా అది తలపెట్టిన కార్యక్రమం మంచిదైతే మద్దతునివ్వాలని, ప్రజా వ్యతిరేకమైనదైతే ప్రతిఘటించాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ శనివారం పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైంది. పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికతో పాటు జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు.‌ అంశాల వారీగా కేంద్రానికి మద్దతు ఉంటుందని, మంచికి మద్దతునిస్తూ చెడు నిర్ణయాలను వ్యతిరేకించాలని పార్టీ ఎంపీలకు ఈ సమావేశంలో శ్రీ జగన్ నిర్దేశించారు.

ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాల మేరకు లోక్‌సభ సీనియర్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నియమించారు. ఆయనతో పాటు మొత్తం కార్యవర్గం ఎంపిక పూర్తయింది. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు), వెలగపల్లి వరప్రసాదరావు (తిరుపతి), కొత్తపల్లి గీత (అరకు), బుట్టా రేణుక (కర్నూలు), పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి (రాజంపేట), వై.వి.సుబ్బారెడ్డి (ఒంగోలు), వై.యస్.అవినాశ్‌రెడ్డి (కడప), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం)లు హాజరైన ఈ సమావేశం గంటన్నర పాటు సాగింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో పార్టీ ముందుండాలని సమావేశంలో పార్టీ ఎంపీలకు శ్రీ జగన్ పిలుపునిచ్చారు.
‌లోక్‌సభలో తొలి నుంచీ ప్రతిపక్షంలో కీలకపాత్ర పోషిస్తున్న అనేక పార్టీల బలం కుదించుకుపోయిన పరిస్థితుల్లో ‌భవిష్యత్తులో వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు కీలకపాత్ర పోషించాలని చెప్పారు.

‌వైయస్ఆర్‌సీపీది నిర్మాణాత్మక పాత్ర: మేకపాటి
వైయస్‌ఆర్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం సహచర ఎంపీలతో కలసి మేకపాటి మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి తాము అంశాల వారీగా మద్దతునిస్తామని చెప్పారు. లోక్‌సభలో ప్రతిపక్ష స్థానాల్లో జాతీయ స్థాయి పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ స్థానాలు ఉన్నాయని.. అన్నా డీఎంకేకు 37, తృణమూల్ కాంగ్రె‌స్‌కు 34, బీజేడీకి 20, టీఆర్‌ఎస్‌కు 11, సీపీఎంకు 9 స్థానాలు ఉన్నాయని, ఎస్.పి.వై.రెడ్డి కూడా తమతో ఉండి ఉంటే తమకూ 9 ఎంపీ సీట్లుండేవని పేర్కొన్నారు. అయినా ఇపుడున్న 8 మంది ఎంపీలతో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తామన్నారు. ప్రతి అంశాన్నీ వ్యతిరేకించబోమని.. దేశ, రాష్ట్ర క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటామని, దేశ క్షేమానికి భంగం కలిగినట్లుగా భావిస్తే వ్యతిరేకిస్తామన్నారు.

Back to Top