ఖమ్మం: పాలేరు నియోజక వర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఏకగ్రీవానికి సహకరించటానికి అభ్యంతరం లేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కోరినట్లయితే దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా, సీఎంగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే వారి కుటుంబసభ్యులు సభ్యతగా ఉంటే ఆ స్థానంలో కుటుంబసభ్యుల్లో ఒకరికి పదవి ఇచ్చే సంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చే వారని ఆయన గుర్తు చేశారు. ఈ సంప్రదాయం, సానుభూతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ పాలేరులో అన్ని పార్టీలతోపాటు తమను ఏకగ్రీవానికి సంప్రదిస్తే వైఎస్సార్‌సీపీ ముందు వరుసలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పోటీ అనివార్యమైతే వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతామని పొంగులేటి చెప్పారు. పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణుల అభిప్రాయం, అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. తాను, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నామని బురదజల్లుతూ చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. పదవులే కావాలనుకుంటే ఎప్పుడో తామిద్దరికి బుగ్గ కార్లు వచ్చేవని, కానీ ప్రజలు తమపై అభిమానంతో గెలిపించారన్నారు. ఎమ్మెల్యే పాయంను పార్టీ మారడం కోసం కోట్ల రూపాయలను ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని, ఓ ముగ్గురు మంత్రులు కూడా ఆయన్ను టీఆర్ఎస్‌లోకి రావాలని ఒత్తిడికి గురి చేశారని, కానీ వీటికి తలొగ్గకుండా... ఆయన నిస్వార్థ ప్రజానాయకుడిగా ఉన్నాడన్నారు.పదవులు శాశ్వతం కాదు... !వైఎస్సార్‌సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రలోభాలకు గురి చేసే పదవులు శాశ్వతం కాదని, ప్రజల అభిమానం, ఆత్మీయతే చివరి వరకు ఉంటాయన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు నమ్మవద్దన్నారు.