రైతు ఆత్మహత్యలపై కలెక్టరేట్ ల ముట్టడి..!

హైదరాబాద్ః  రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ తెలంగాణవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సహా  ప్రజాప్రతినిధులు ఎవరూ చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమని నేతలు మండిపడుతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తి చూపేందుకు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద వైస్సార్సీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి.   

రంగారెడ్డిః ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సీర్సీపీ తెలంగాణ రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్ , ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అన్నదాతలతో కలిసి రంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించారు. రైతు సమస్యలపై
ఆరు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్నిజాయింట్  కలెక్టర్ కు అందించారు.కరువు
బారి నుంచి రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం
చేయాలని డిమాండ్ చేశారు.

మహబూబ్ నగర్ః రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కలెక్టరేట్ ను ముట్టడించారు. వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

కరీంనగర్ః  ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కరీంగనర్ లో వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ను ముట్టడించారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. అన్నం పెట్టే అన్నదాతలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు.

మెదక్ః రైతు ఆత్మహత్యలపై సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రైతులను ఆదుకోవాలని, కోరుతూ గట్టు శ్రీకాంత్ రెడ్డి. నర్రా బిక్షపతి. శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 

డిమాండ్స్..
1.తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలి 
2. యుద్ధప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలి..ఏకమొత్తంగా రుణమాఫీ విడుదల చేయాలి 
3. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసహాయం ప్రకటించాలి  
4. కరువులో రైతులకు రూ.5 వేలు ఇవ్వాలి 
5. పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు ఉచితంగా దానా అందించాలి 
6. పెండింగ్ ప్రాజెక్ట్ లను వెంటనే పూర్తిచేయాలి.
Back to Top